
కోలీవుడ్‌లో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న నటుడు ధనుశ్. అంతేకాదు సక్సెస్‌ఫుల్ నిర్మాతగా పేరు తెచ్చుకున్నారు. అయితే ధనుశ్‌కు ఈ స్థాయి అంత సులభంగా వచ్చింది కాదు. తుళ్లువదో ఇళమై చిత్రంతో కథానాయకుడిగా తన తండ్రి కస్తూరి రాజా దర్శకత్వంలో ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. ఆ తర్వాత విడుదలకు ముందు ఎన్నో అవమానాలను, అవహేళనలను ఎదుర్కొన్నారు. అయితే ధనుష్‌కు తొలి చిత్రం మంచి విజయాన్ని అందించడంతో పలువురు దర్శక నిర్మాతలు ఆయన వెంట పరుగులు తీశారు.
కెరీర్ ప్రారంభంలో ధనుశ్ విజయాలలో ఆయన సోదరుడు, దర్శకుడు సెల్వరాఘవన్ భాగమయ్యాడు. అయితే ధనుశ్‌పై విమర్శలు కూడా చాలానే ఉన్నాయి. ముఖ్యంగా నిర్మాతలకు సరిగా కాల్ షీట్స్ కేటాయించడం లేదనే ఆరోపణలున్నాయి. ఇకపోతే ఇటీవల మరో అగ్రనటి నయనతార కూడా ఆయన వ్యక్తిత్వంపై విమర్శలు చేసిన విషయం తెలిసిందే. అదేవిధంగా ఐశ్వర్య రజనీకాంత్‌తో ఈయన వివాహ బంధానికి కూడా ఎండ్ కార్డ్ వేశాడు. ఇటీవలే వీరిద్దరికి విడాకులు కూడా మంజూరయ్యాయి. యితే ఇవన్నీ ధనుశ్ కెరియర్‌కు ఎలాంటి ఇబ్బంది తీసుకురాలేదనే చెప్పాలి.
తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ధనుశ్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. తనను అర్థం చేసుకోవడం నిజంగానే కొంచెం కష్టమని.. తనతో సన్నిహితంగా ఉండే వారికే తానేంటో తెలుస్తుందన్నారు. అయితే తాను ఎవరికీ అంత సులభంగా దగ్గర అవ్వనని.. అందుకు కొన్ని రోజుల సమయం పడుతుందని అన్నారు. తనతో సుదీర్ఘ పరిచయం ఉన్న వారే తనను అర్థం చేసుకోగలుగుతారని నటుడు ధనుశ్ పేర్కొన్నారు. దీంతో ఈయన ఎవరి గురించి ఇలా మాట్లాడారా అన్న చర్చ సినీ వర్గాల్లో జరుగుతోంది. కాగా ధనుష్ ప్రస్తుతం ఇడ్లీ కడై అనే చిత్రంలో నటిస్తూ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. ధనుష్ దర్శకత్వం వహించిన మరో చిత్రం నిలవుక్కు ఎన్ మేల్ ఎన్నడీ కోపం త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది.