
విశ్వనటుడు కమలహాసన్ చిత్రంలో లేడీ సూపర్‌స్టార్ నయనతార నటించబోతున్నట్లు తాజా సమాచారం. సూపర్‌స్టార్ రజనీకాంత్ సరసన మూడు, నాలుగు చిత్రాలలో నటించిన నయనతార ఇప్పటి వరకు కమలహాసన్‌కు జంటగా నటించలేదు. అయితే ఇప్పుడు నటించబోతున్నారా? అన్న ప్రశ్న తలెత్తుతుండొచ్చు. దీనికి కాదనే బదులే వస్తుంది. అయితే కమలహాసన్ నిర్మించనున్న చిత్రంలో నయనతార ప్రధాన పాత్రను పోషించడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం.
నటుడు కమలహాసన్ ఓ పక్క కథానాయకుడిగా నటిస్తునే మరో పక్క ఇతర నటులతో తన రాజ్‌కమల్ ఫిలిం ఇంటర్నేషనల్ పతాకంపై చిత్రాలు నిర్మించడానికి సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. ఆ విధంగా విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో ఒక చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అజిత్ 62వ చిత్రానికి దర్శకత్వం వహించడానికి విఘ్నేష్ శివన్ సుమారు రెండేళ్లు కష్టపడ్డాడు. అయితే చివరి క్షణంలో ఆ చిత్రం నుంచి తొలగించారు. అలాంటి సమయంలో నటుడు కమలహాసన్ అండగా నిలిచారని సమాచారం. నయనతార కథానాయకిగా లేడీ ఓరియంటెడ్ కథా చిత్రాన్ని విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో కమలహాసన్ నిర్మించతలపెట్టినట్టు తెలుస్తోంది.
మరో విషయం ఏంటంటే ఇంతకుముందు ఈ చిత్రాన్ని లవ్ టుడే చిత్రం ప్రేమ్ ప్రదీప్ రంగనాథన్ కథానాయకుడు స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించనున్నట్లు ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు సీన్ మారింది. దీనికి విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహించనున్నారట. నయనతార ప్రధాన పాత్రలో నటించనున్న ఈ చిత్రంలో ప్రదీప్ రంగనాథన్ ముఖ్య పాత్రలో నటించనున్నట్లు, ఆయనకు జంటగా మరో యువ నటి నటించిన సమాచారం. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. కాగా నయనతార ఇప్పటికే తన 75వ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే.