Dilip Kumar Death: Legendary Bollywood Actor Passes Away At 98 - Sakshi
Sakshi News home page

Dilip Kumar: బాలీవుడ్‌ ప్రముఖ నటుడు కన్నుమూత

Published Wed, Jul 7 2021 8:05 AM | Last Updated on Wed, Jul 7 2021 11:47 AM

Legendary Bollywood Actor Dilip Kumar Passes Away At 98 - Sakshi

ప్రముఖ బాలీవుడ్‌ నటుడు దిలీప్‌ కుమార్‌(98) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ముంబైలోని హిందుజా ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఈ క్రమంలో తీవ్ర అనారోగ్యానికి గురైన ఆయన బుధవారం ఉదయం 7.30 గంటలకు తుదిశ్వాస విడిచారు. నేడు సాయంత్రం ఐదు గంటలకు ముంబైలోని జుహులో ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. ఆయన మరణం పట్ల చిత్రపరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.

ఇటీవలే ఆయన శ్వాస సంబంధిత సమస్యలతో ముంబైలోని ఓ ఆసుపత్రిలో చేరగా ప్లూరల్‌ యాస్పిరేషన్‌’ (ఊపిరితిత్తుల్లో చేరిన నీటిని తొలగించడం) ప్రొసీజర్‌ నిర్వహించారు. కానీ మళ్లీ తీవ్ర అస్వస్థతకు లోనవడంతో ప్రాణలు విడిచారు. గతేడాది దిలీప్‌ కుమార్‌ సోదరులు అస్లాంఖాన్‌, ఇషాన్ ఖాన్‌లు కరోనాతో ప్రాణాలు విడిచిన విషయం తెలిసిందే. ఈ విషాదం నుంచి కోలుకోక ముందే దిలీప్‌ కూడా కన్నుమూయడంతో ఆయన కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది.

దిలీప్‌ కుమార్‌ 1922 డిసెంబర్‌ 11న పాకిస్తాన్‌లోని పెషావర్‌లో జన్మించారు. ఆయన అసలు పేరు మహమ్మద్‌ యూసుఫ్‌ ఖాన్‌. బాంబే టాకీస్‌ యజమాని ఈయనకు దిలీప్‌ కుమార్‌ అని నామకరణం చేశాడు. సినిమాల్లోకి రాకముందు దిలీప్‌ తండ్రితో కలిసి పండ్లు అమ్మారు. ఆ తర్వాత 1944లో జ్వర్‌ భాతా చిత్రంతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చారు. 1955లో ఆజాద్‌, దేవదాస్‌ సినిమాలతో బిగ్గెస్ట్‌ హిట్లను తన ఖాతాలో వేసుకున్నారు. 'ఆజాద్‌' ఆ దశాబ్దిలోనే అధిక వసూళ్లు సాధించిన సినిమాగా రికార్డుకెక్కింది. ఆ తర్వాత వచ్చిన పౌరాణిక చిత్రం 'మొఘల్‌-ఎ-ఆజామ్‌'తో ఆయన ప్రేక్షకులకు ఆయన మరింత చేరువయ్యారు. ఓరకంగా చెప్పాలంటే 1944 నుంచి 1998 వరకు దిలీప్‌ కుమార్‌ చిత్రసీమను ఏలారనే చెప్పాలి.

ఉత్తమ నటుడిగా ఆయనకు 8 సార్లు ఫిల్మ్‌ఫేర్‌ అవార్డులు, 1993లో ఫిలింఫేర్‌ లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డు దక్కింది. 1994లో దిలీప్‌కుమార్‌ను దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డు వరించింది. ఈ దిగ్గజ నటుడి సేవలను గుర్తించిన ప్రభుత్వం 1991లో పద్మభూషణ్‌, 2015లో పద్మవిభూషణ్‌ పురస్కారాలతో ఆయనను సన్మానించింది. 1998లో దిలీప్‌కుమార్‌ను నిషాన్‌-ఇ-ఇంతియాజ్‌ అవార్డుతో పాక్‌ ప్రభుత్వం ఘనంగా సత్కరించింది. 2000 - 2006 వరకు రాజ్యసభ సభ్యుడిగానూ దిలీప్‌ కుమార్‌ సేవలందించారు. భారతీయ చిత్రసీమకు మెథడ్‌ యాక్టింగ్‌ టెక్నిక్‌ పరిచయం చేసిన ఆయన సినిమా రంగంలోనే గొప్ప నటుడిగా గుర్తింపు సాధించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement