సాక్షి, హైదరాబాద్: 1946 జూన్ 4న నెల్లూరు జిల్లా కోనేటమ్మ పేటలో శ్రీపతి పండితారాధ్యుల సాంబమూర్తి, శకుంతలమ్మ దంపతులకు జన్మించారు బాలసుబ్రహ్మణ్యం. ముగ్గురు కుమారులు, ఐదుగురు కుమార్తెలు కలిగిన సాంబమూర్తికి రెండో సంతానం బాలు. తండ్రి హరికథా కళాకారుడు కావడంతో బాలు యుక్త వయసులోనే సంగీతంపట్ల ఆకర్షితుడయ్యారు. తల్లి కోరిక మేరకు ఇంజనీరింగ్ చేస్తూనే పలు సంగీత పోటీల్లో పాల్గొన్నారు. 1964లో తన తొలి అవార్డును అందుకున్నారు. ఆ తర్వాత ఇళయరాజాతో కలసి ఓ మ్యూజిక్ బ్యాండ్ ఏర్పాటు చేశారు.
నటుడిగానూ సక్సెస్
►ఏ హీరోకి పాడితే అది ఆ హీరో గొంతే అన్నట్లుగానే బాలు పాటలు పాడారు. విజయవంతమైన గాయకుడు అనిపించుకున్న ఆయన నటుడిగా కూడా ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. 1969లో ‘పెళ్లంటే నూరేళ్ల పంట’సినిమా ద్వారా నటుడిగా పరిచయమయ్యారు.
►1990లో ‘కేలడి కన్మణి’సినిమా (తెలుగులో ‘ఓ పాపా లాలి’)లో లీడ్ రోల్ చేశారు. ప్రేమికుడు (1994), పవిత్రబంధం (1996), ఆరోప్రాణం (1997), రక్షకుడు (1997), దీర్ఘసుమంగళీభవ (1998) వంటి చిత్రాల్లో కీలక పాత్రల్లో నటించారు.
► ‘దేవస్థానం’, ‘మిథునం’చిత్రాల్లో లీడ్ రోల్స్‌లో కనిపించారు. బాలచందర్ తమిళ చిత్రం ‘మన్మధ లీలై’తెలుగు డబ్బింగ్ ‘మన్మధ లీల’తో డబ్బింగ్ ఆర్టిస్ట్ అయ్యారు.
►కమల్‌హాసన్, రజనీకాంత్, సల్మాన్ ఖాన్, విష్ణువర్ధన్, గిరీష్ కర్నాడ్, అర్జున్, నగేష్, రఘువరన్ వంటి నటులకు గాత్రదానం చేశారు. 1977లో వచ్చిన ‘కన్యా కుమారి’తో సంగీత దర్శకుడిగా మారారు.
►తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో సుమారు 46 సినిమాలకు సంగీతం సమకూర్చారు. నిర్మాతగా ‘యోధ’, ‘భామనే సత్యభామనే’, ‘తెనాలి’, ‘శుభ సంకల్పం’వంటి సినిమాలు నిర్మించారు. ‘హలో బ్రదర్’ను ఆయన బ్యానర్ ద్వారా తమిళంలోకి అనువదించి నాగార్జున పాత్రలకు డబ్బింగ్ కూడా చెప్పారు బాలు.
అవార్డులు
►ఉత్తమ గాయకుడిగా ఆరుసార్లు జాతీయ అవార్డు అందుకున్నారు. 1979లో సంగీత ప్రధానంగా వచ్చిన ‘శంకరాభరణం’చిత్రానికిగాను ఆయన తొలి జాతీయ అవార్డు అందుకున్నారు.
►ఆ తర్వాత 1981లో హిందీ చిత్రం ‘ఏక్ ధూజే కేలియే’, 1983లో ‘సాగర సంగమం’, 1988లో ‘రుద్రవీణ’, 1995లో కన్నడ చిత్రం ‘సంగీత సాగర గానగోయి పంచాక్షర గవై’, 1996లో తమిళ చిత్రం ‘మిన్‌సార కనవు’చిత్రాలకు జాతీయ అవార్డు అందుకున్నారు. 25 నంది అవార్డులు దక్కాయి.
►భారతీయ సినిమాకు ఆయన అందించిన సేవలకుగాను 2001లో పద్మశ్రీ, 2011లో పద్మభూషణ్ అవార్డులను అందుకున్నారు. 2012లో ఎన్టీఆర్ నేషనల్ అవార్డు అందుకున్నారు. 2016లో ‘ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్’అవార్డు తీసుకున్నారు. 1999లో పొట్టి శ్రీరాములు విశ్వ విద్యాలయం డాక్టరేట్‌ను ప్రదానం చేసింది. ఇంకా తమిళ, కన్నడ తదితర రంగాల నుంచి పలు అవార్డులు అందుకున్నారు.
తొలి చిత్రం: మర్యాద రామన్న.. కోదండపాణి, పద్మనాభంతో బాలు
బాలు కుటుంబం
బాలుకు తన దగ్గరి బంధువైన సావిత్రితో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు సంతానం. పల్లవి, ఎస్.పి. చరణ్. పాటకు ముఖ్యం పల్లవి, చరణం. ఈ రెండూ కలిసొచ్చేట్లుగా తన సంతానానికి పేర్లు పెట్టారు. బాలు తనయుడు ఎస్.పి.చరణ్ గాయకుడిగా, నిర్మాతగా కొనసాగుతున్నారు. బాలు సోదరి ఎస్.పి. శైలజ కూడా గాయని. ఆమె భర్త నటుడు శుభలేఖ సుధాకర్. ఎస్.పి. బాలు తల్లి శకుంతలమ్మ గత ఏడాది ఫిబ్రవరి 4న మరణించారు. కాగా, తండ్రి స్థాపించిన భిక్షాటన పూర్వక శ్రీ త్యాగరాజ స్మరణోత్సవ సభకు బాలసుబ్రహ్మణ్యం శాశ్వత అధ్యక్షుడు.
16 భాషల్లో...
సినీ నేపథ్య గాయకుడిగా ‘శ్రీ శ్రీ శ్రీ మర్యాదరామన్న’(1966) చిత్రం ద్వారా పరిచయమయ్యారు బాలు. ఈ చిత్రానికి ఎస్.పి.కోదండపాణి సంగీత దర్శకత్వం వహించారు. తనకు సినీ గాయకునిగా జీవితాన్ని ప్రసాదించిన కోదండపాణిపై అభిమానంతో తాను నిర్మించిన ఆడియో ల్యాబ్‌కు ‘కోదండపాణి ఆడియో ల్యాబ్స్’అని పేరు పెట్టారు బాలు. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ, కన్నడ, సంస్కృత, ఆంగ్ల, ఉర్దూ.. ఇలా సుమారు 16 భాషల్లో పాటలు పాడారు.
వారాల అబ్బాయిగా విద్యాభ్యాసం
శ్రీకాళహస్తి/నగరి (చిత్తూరు జిల్లా): అప్పట్లో నెల్లూరు జిల్లాలో ఉండే కోనేటమ్మపేట (ప్రస్తుతం తమిళనాడు)లో జన్మించిన బాలు.. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో వారాల అబ్బాయిగా ఉండి విద్యాభ్యాసం చేశారు. తొలుత నగరి పట్టణంలోని బ్రాహ్మణ వీధిలో ఉన్న తన మేనమామ ఇంట్లో ఉండి పీసీఎన్ ప్రభుత్వ హైస్కూల్‌లో ఎనిమిదో తరగతి వరకూ చదివారు. అక్కడ రాధాపతి అయ్యవారు వద్ద విద్యాభ్యాసం చేశారు. తర్వాత రాధాపతి అయ్యవారు శ్రీకాళహస్తి పానుగంటి రాజా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు బదిలీపై వచ్చారు. ఆయనతో పాటే బాలు కూడా శ్రీకాళహస్తి వచ్చి.. 9, 10 తరగతులు, 1960లో ఎస్‌ఎస్‌ఎల్‌సీని పూర్తిచేశారు. రాధాపతి అయ్యవారు వద్ద వారాల అబ్బాయిగా ఉండి చదువుకునేవారు. తన గురువు అంటే బాలుకు ఎనలేని గౌరవం ఉండేది.
శ్రీకాళహస్తికి బాలు తండ్రి
శ్రీకాళహస్తిలో ఎస్పీ బాలు ఉండగా.. ఆయన తండ్రి ఎస్పీ సాంబమూర్తి కూడా అక్కడికి వచ్చి బొజ్జ కృష్ణదాసు సాయంతో హరికథ చెబుతూ, నాటకాలు ప్రదర్శిస్తూ జీవనం సాగించేవారు. 1959లో రామదాసు నాటకాన్ని ప్రదర్శించగా.. అందులో బాలు రామదాసు కుమారునిగా అద్భుతంగా నటించి అందరి మన్ననలు పొందారు.
మొదటి పాట రికార్డు శ్రీకాళహస్తిలోనే..
శ్రీకాళహస్తిలో రాధాపతి అయ్యవారుతో పాటు జి.బాలసుబ్రహ్మణ్యం అనే సైన్స్ ఉపాధ్యాయుడు ఉండేవారు. ఆయన చెన్నై నుంచి తెప్పించిన టేప్ రికార్డర్‌లో బాలు పాడిన పాట రికార్డు చేశారు. భక్తప్రహ్లాద పాటను అలా తొలిసారిగా రికార్డు చేశారు. తొలిసారిగా తాను సినిమాలో పాడిన పాట రికార్డును బాలు.. తన గురువులకు పంపి ఆశీర్వాదం తీసుకున్నారు. ప్రతి ఇంటర్వ్యూలో ఆ ఇద్దరినీ బాలు తలచుకుంటూ ఉండేవారు.
బాలు వాక్కు బ్రహ్మ వాక్కు!
Published Sat, Sep 26 2020 4:33 AM | Last Updated on Sat, Sep 26 2020 12:06 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment