అత్తను తల్లిగా, కోడలిని కూతురిగా భావించాలంటారు. కానీ అలా అల్లుకుపోయి అన్యోన్యంగా ఉండే కుటుంబాలు చాలా తక్కువ. రెక్కలొచ్చాక కన్నపేగును దూరం పెడుతూ బతికుండగానే నరకం చూపిస్తున్నవాళ్లే ఎక్కువ. కొన్నిసార్లు కొడుకులు చూసుకున్నా కోడళ్లు మాత్రం రాక్షసంగా వ్యవహరిస్తున్నారు. ఇలాంటి పరిస్థితే అలనాటి హీరోయిన్ మధుబాల అక్కకు ఎదురైంది. కొడుకు అంటే పంచప్రాణాలైన ఆమె అతడితో పాటే విదేశాలకు వెళ్లింది. కానీ కోడలు ఆమెను కనీసం మనిషిగా కూడా చూడకుండా తిండి పెట్టకుండా చిత్రహింసలు పెట్టింది. ఆమెకు ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇప్పుడామె ఎలా ఉంది? అనేది చదివేయండి..
మధుబాల అక్క కనీజ్ బల్సారాకు కొడుకు ఫరూఖ్ అంటే ప్రాణం. అతడికి కూడా తల్లంటే వల్లమాలిన ప్రేమ. అందుకే న్యూజిలాండ్‌కు వెళ్లేటప్పుడు భార్య సమీనాతో పాటు తల్లిదండ్రులను కూడా తీసుకెళ్లాడు. కానీ సమీనాకు అతడి పేరెంట్స్ అంటే గిట్టదు. సరిగా చూసుకునేది కాదు. వాళ్లకు భోజనం కూడా పెట్టకపోతే ఫరూఖ్ బయట నుంచి తీసుకువచ్చి మరీ పేరెంట్స్‌కు తిండి పెట్టేవాడు. అయినా సరే కనీజ్.. కొడుకుతో ఉంటే చాలనుకుంది. అప్పుడప్పుడు కూతురు పర్వీజ్‌ను చూసేందుకు ఇండియా వచ్చి వెళ్లేది. తర్వాత భర్త చనిపోవడంతో ఒంటరయ్యింది. అనారోగ్య సమస్యల కారణంగా గత ఐదేళ్లుగా భారత్‌కు రావడం కూడా మానేసింది. ఇంతలో జనవరి 8న కొడుకు కన్నుమూయడంతో పుట్టెడు శోకంలో మునిగిపోయింది.
ఇలాంటి విషాద సమయంలో అత్త మీద మరింత జులుం ప్రదర్శించింది సమీనా. ఆమె దగ్గరున్న డబ్బులు, నగలు అన్నింటినీ లాగేసుకుని ఇంటి నుంచి వెల్లగొడుతూ.. జనవరి 29న ఇండియాకు ఫ్లైట్ ఎక్కించింది. ఆమెను పంపించేసిన ఈ విషయాన్ని భారత్‌లో ఉన్న బంధువులకు ఫోన్ చేసి తెలిపింది. ఇది తెలిసిన కనీజ్ కూతురు పర్వీజ్ హుటాహుటిన ముంబై విమానాశ్రయానికి చేరుకుంది. అక్కడ కనీజ్‌కు కరోనా పరీక్ష చేసుకునేందుకు డబ్బులు కూడా లేవని తెలియడంతో వెంటనే తన దగ్గరున్న డబ్బును సిబ్బందికి అందించింది. కరోనా పరీక్ష ముగిసి బక్కచిక్కిన దేహంతో బయటకు వచ్చిన ఆమె 'బేటా, ఫరూఖ్ చనిపోయాడు తెలుసా? అది చెప్పడానికే నేను వచ్చాను. నాకు చాలా ఆకలైతుంది బిడ్డా, తినడానికి ఏదైనా ఇస్తావా?' అని దీనంగా అడగడంతో కన్నీటి పర్యంతమైంది పర్వీజ్. తల్లిని ఇంటిని తీసుకువచ్చి కడుపునిండా భోజనం పెట్టి స్నానం చేయించింది. తన తల్లి ఇంకా బతికే ఉన్నందుకు దేవుడికి కృతజ్ఞతలు తెలుపుతూనే గయ్యాలి సమీనాను తిట్టిపోసింది.
Comments
Please login to add a commentAdd a comment