Save The Tigers 2 Review: సేవ్‌ ద టైగర్స్‌ 2.. ఎలా ఉందంటే? | Sakshi
Sakshi News home page

Save The Tigers 2 Review: మళ్లీ వచ్చేసిన మగజాతి ఆణిముత్యాలు.. సిరీస్‌ ఎలా ఉందంటే?

Published Fri, Mar 15 2024 2:22 PM

Mahi V Raghav's 'Save The Tigers 2' Web Series Review and Rating In Telugu - Sakshi

వెబ్‌ సిరీస్‌ రివ్యూ: సేవ్‌ ద టైగర్స్‌ 2
నటీనటులు : ప్రియదర్శి, అభినవ్ గోమఠం, చైతన్య కృష్ణ, 'జోర్దార్' సుజాత, పావని గంగిరెడ్డి, దేవయాని, హర్షవర్ధన్, గంగవ్వ, వేణు టిల్లు, రోహిణి తదితరులు
క్రియేటర్స్‌: మహి వి రాఘవ్‌, ప్రదీప్‌ అద్వైతం
రైటర్స్‌ : ప్రదీప్‌ అద్వైతం, విజయ్‌ నమోజు, ఎస్‌ ఆనంద్‌ కార్తీక్‌
ద‌ర్శ‌క‌త్వం : అరుణ్‌ కొత్తపల్లి
క్రియేటర్స్ : మహి వి. రాఘవ్, ప్రదీప్ అద్వైతం
సంగీతం : అజయ్‌ అరసద
ఎడిటర్‌ : శ్రవణ్‌ కటికనేని
విడుదల తేది: మార్చి 15, 2024 (డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌)

ఓటీటీలో క్రైమ్‌, సస్పెన్స్‌ థ్రిల్లర్సే కానీ కామెడీ జాడేది అనుకుంటున్న తరుణంలో సేవ్‌ ద టైగర్స్‌ వెబ్‌ సిరీస్‌ రిలీజైంది. గతేడాది హాట్‌స్టార్‌లో విడుదలైన ఈ వెబ్‌ సిరీస్‌ జనాలను ఎంతగానో ఆకట్టుకుంది. భార్యా బాధితులుగా హీరోలు పడే అగచాట్లు ప్రేక్షకులకు నవ్వు తెప్పిస్తుంది. ఈ హిట్‌ సిరీస్‌కు సీక్వెల్‌గా తాజాగా సేవ్‌ ద టైగర్స్‌ 2 విడుదలైంది. మరి ఈ సిరీస్‌ ఎలా ఉందో రివ్యూలో చూద్దాం...

కథ
హీరోయిన్‌ హంసలేఖ(సీరత్‌ కపూర్‌) మిస్‌ అవడంతో మొదటి సీజన్‌ ముగుస్తుంది. తను ఏమైందన్న ఆందోళనతో రెండో సీజన్‌ కథ మొదలవుతుంది. హంసలేఖ ఎక్కడ? అని పోలీసులు విక్రమ్ (చైతన్య కృష్ణ), రాహుల్ (అభినవ్ గోమఠం), గంటా రవి (ప్రియదర్శి)లను ప్రశ్నిస్తారు. తమకు తెలియదు మహాప్రభో అని మొర పెట్టుకున్నా సరే.. పోలీసులు లెక్క చేయకుండా ముగ్గురికీ లాఠీదెబ్బల రుచి చూపిస్తారు. మరోవైపు మీడియాలో హంసలేఖను ఈ ముగ్గురూ పార్టీ నుంచి తీసుకెళ్లిన వీడియో చూపించి ఏకంగా ఆమెను హత్య చేశారంటూ కథనాలు ప్రసారం చేస్తారు. ఇంతలో హంసలేఖ ఎంట్రీ ఇవ్వడంతో ఆ ముగ్గురినీ పోలీసులు వదిలేస్తారు.

పోలీస్‌ స్టేషన్‌ నుంచి బయటకు వచ్చాక ఏం జరిగింది? ఆ ముగ్గురి భార్యలు స్పంద కౌన్సిలర్‌ (సత్యకృష్ణ) దగ్గరకు ఎందుకెళ్లారు? రాహుల్‌, అతడి భార్య మాధురి (పావని గంగిరెడ్డి) మధ్య దూరిన మూడో వ్యక్తి హారిక (దర్శనా బానిక్‌) ఎవరు? గేటెడ్‌ కమ్యూనిటీలో ఫ్లాట్‌ కొనాలన్న రవి భార్య హైమావతి(జోర్దార్‌ సుజాత) కల నెరవేరిందా? విక్రమ్‌ భార్య రేఖ (దేవయాని శర్మ) లాయర్‌ ప్రాక్టీస్‌ ఎందుకు ఆపేయాలనుకుంది? మూడు జంటల మధ్య మళ్లీ గొడవలు ముదరడానికి కారణమేంటి? అన్నది సిరీస్‌ చూసి తెలుసుకోవాల్సిందే!

విశ్లేషణ
మొదటి సీజన్‌లాగే ఈ సీజన్‌లోనూ కామెడీకి కొదవలేదు. కామెడీతో పాటు ఓ సందేశాన్ని జోడించారు. కళ్లతో చూసే ప్రతీది నిజం కాదని నొక్కి చెప్పారు. చూసిన ప్రతీది నిజమని గుడ్డిగా నమ్మేసి ఓ అభిప్రాయానికి రాకూడదని, ఏది నిజం? ఏది అబద్ధం? అనేది మనమే తెలుసుకోవాలని మహి వి రాఘవ్‌ మెదడుకు ఎక్కేలా చెప్పాడు. ఈ విషయంలో మహిని కచ్చితంగా మెచ్చుకోవాల్సిందే! మహి క్రియషన్స్‌, అరుణ్‌ డైరెక్షన్‌ ఎక్కడా సింక్‌ మిస్‌ అయినట్లు అనిపించదు. సిరీస్‌ నిర్మాణ విలువలు సైతం బాగున్నాయి. కథకు తగ్గట్టుగా అజయ్‌ అరసద సంగీతం అందించాడు.

ఎవరెలా చేశారంటే?
ఈ సిరీస్‌లో ఎవరి నటనకు వంక పెట్టాల్సిన పని లేదు. ప్రియదర్శి, అభినవ్‌, చైతన్య బాగా నటించారు. సుజాత, దేవయాని, పావని వారితో పోటీపడి నటించినట్లు అనిపించినా మగజాతి ఆణిముణ్యాలదే ఇక్కడ పైచేయి అని చెప్పాలి. ముఖ్యంగా ప్రియదర్శి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. కూతురు పెద్దమనిషి అయ్యాక ఆమెతో మాట్లాడిన సీన్‌.. ఆ అమ్మాయి స్కూల్‌లో తన గురించి మాట్లాడేటప్పుడు అతడు భావోద్వేగానికి లోనయ్యే సన్నివేశాల్లో ప్రియదర్శి చింపేశాడు. గంగవ్వ, అవినాష్‌, , వేణు.. తమ పాత్రల పరిధిమేర నటించారు. పనిమనిషితో పెట్టుకుంటే మడతెడిపోద్ది అనే రీతిలో రోహిణి మరోసారి ఫుల్‌గా నవ్వించింది.

ఫైనల్‌గా చెప్పాలంటే.. ఓపక్క నవ్విస్తూనే భార్యాభర్తలు ఎలా ఉండాలో చెప్తుందీ సిరీస్‌. తండ్రీకూతుళ్ల అనుబంధంతో ఏడిపిస్తుంది. వీకెండ్‌లో హ్యాపీగా చూసేయొచ్చు.

Rating:
Advertisement
Advertisement