
మలయాళ చిత్ర పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి జస్టిస్ హేమ కమిటీ ఒక నివేదికను రూపొందించింది. అందులో దిగ్భ్రాంతికర విషయాలు వెలుగుచూశాయి. మాలీవుడ్ పరిశ్రమలో ఉండే మహిళలు కాస్టింగ్ కౌచ్ నుంచి వివక్ష వరకు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని హేమ కమిటీ పేర్కొంది. ఈ క్రమంలో మలయాళ నటి రేవతి సంపత్ సంచలన ఆరోపణలు చేసింది.
మలయాళ సీనియర్ నటుడు సిద్ధిఖీ తనపై అత్యాచారం చేశాడంటూ సెన్సేషనల్ కామెంట్ నటి రేవతి సంపత్ చేసింది. ఆమె వ్యాఖ్యలతో మాలీవుడ్‌లో పెద్ద దుమారమే రేగుతుంది. అసోషియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్ (AMMA) నుంచి ఆయన తప్పుకున్నాడు. జనరల్ సెక్రటరీగా ఉన్న ఆయన తన పదవికి రాజీనామా చేసి తాజాగా ఆ లేఖను AMMA ప్రెసిడెంట్ మోహన్ లాల్‌కు అందజేశాడు.

నటి రేవతి సంపత్ 2021లోనే తనను చెప్పుకోలేని విధంగా హింసించారంటూ.. ఏకంగా 14 మంది పేర్లు బయటపెట్టి ఆమె సంచలనంగా మారింది. ఆ లిస్ట్‌లో నటుడు సిద్ధిఖీ కూడా ఉన్నారు. సినిమాలపై ఆసక్తి ఉండటంతో నేను ఛాన్సుల కోసం ఎదురుచూస్తున్న సమయంలో సోషల్‌మీడియా ద్వార సిద్ధిఖీ పరిచయం అయ్యాడు. ఆయన నటిస్తున్న సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తానని నాకు ఆశ చూపించాడు. సుమారు ఏడేళ్ల క్రితం వచ్చిన సుఖమయిరిక్కట్టే చిత్రంలో ఆయన ప్రధాన పాత్రలో నటించారు.
ఆ సమయంలో ప్రీమియర్ షోకు నన్ను కూడా ఆహ్వానించాడు. సినిమా పూర్తి అయిన తర్వాత తిరువనంతపురంలోని మస్కట్ హోటల్‌కు నన్ను తీసుకెళ్లి అక్కడ నాపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. నాపై అత్యాచారం చేశాడు. ఎదురుతిరిగినందుకు నాపై దాడిచేశాడు. హోటల్ గదిలో బిక్కుబిక్కుమంటూ నరకం చూశాను. ఆ భయానక సంఘటన నుంచి నేను ఇప్పటికీ కోలుకోలేకున్నాను.' అని రేవతి సంపత్ చెప్పింది. సిద్ధిఖీ చాలా నీచమైన వ్యక్తి అంటూ తన స్నేహితులపై కూడా ఆయన లైంగిక దాడికి పాల్పడ్డాడని ఆమె ఆరోపించింది.

మలయాళ ఇండస్ట్రీలో మహిళలపై జరుగుతోన్న వేధింపులపై జస్టిస్ హేమ కమిటీ 2019లోనే ప్రభుత్వానికి ఒక రిపోర్ట్ ఇచ్చింది. అయితే, అది ఇన్నేళ్ల తర్వాత బయటకు రావడంతో అక్కడి పరిశ్రమలో పెద్ద దుమారం రేగుతుంది. ఈ రిపోర్ట్ వచ్చిన తర్వాత మలయాళ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసింది. అందులో జనరల్ సెక్రటరీగా ఉన్న సిద్ధిఖీ అందరికీ న్యాయం చేస్తానని కామెంట్ చేసిన కొన్ని గంటల్లోనే రేవతి సంపత్ అతనిపై సంచలన ఆరోపణలు చేసింది. దీంతో తాజాగా ఆయన తన పదవికి రాజీనామా చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment