మహాప్రస్థానం చిత్రంలో కరీంకు సీన్ వివరిస్తున్న దర్శకుడు జానీ
నటుడిగా రాణించాలన్న తపన ఓ తాపీ మేస్త్రీని వెండి తెరకు పరిచయం చేసింది. వృత్తి పరంగా భవనాలు నిర్మిస్తున్నప్పటికీ అతని ప్రవృత్తి మాత్రం రంగస్థలం. సినిమాల్లో నటిస్తూ ఇప్పుడిప్పుడే తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. తనకు అన్నం పెట్టిన వృత్తిని వదలకుండానే అవకాశం దొరికినప్పుడు సినిమాల్లో అగ్ర నటుల సరసన తనదైన శైలిలో అభినయం ప్రదర్శిస్తూ శభాష్ అనిపించుకుంటున్నాడు.
సాక్షి, పొన్నలూరు(ప్రకాశం) : పొన్నలూరు మండలం చెన్నిపాడు గ్రామానికి చెందిన కరీం వెండి తెరపై తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. తండ్రి ఢిల్లీ సాహెబ్, తల్లి కాసింబీకి ఐదుగురు సంతానం కాగా కరీం చిన్నవాడు. 19 ఏళ్ల వయసులోనే రంగస్థలంపై నలతాంగ అనే పౌరాణిక నాటకంలో నటించాడు. పెద్దగా చదువుకోకపోవడంతో ఉపాధి నిమిత్తం నిజామబాద్‌కు వెళ్లి తన అన్న మహబూబ్ వద్ద తాపీ మేస్త్రీగా పనిచేస్తూ ఉన్నాడు. ఈ క్రమంలో గుంటూరు జిల్లా బాపట్లకు చెందిన తన్మయి ఆర్ట్స్ వ్యవస్థాపకుడు, ప్రముఖ నాటిక ప్రయోక్త సుదర్శన్ దర్శకత్వంలో ఇందూరు రంగస్థలంపై నటించాడు. 2008లో నిజామబాద్ జిల్లా రాజీవ్‌గాంధీ ఆడిటోరియంలో గాంధీ జయంతి, అబ్బే ఏంలేదు, నమోనమం, ఆ ఉదయం ఎప్పుడో, ఉప్పెనొచ్చింది తదితర సాంఘిక నాటికల్లో విభిన్న పాత్రలు పోషించాడు. వెండి తెరపై చిరంజీవి, రవితేజ, శ్రీకాంత్, సునీల్, నిఖిల్, సుధీర్‌బాబు, కళ్యాణ్‌రామ్, సప్తగిరి, రవిబాబుతోపాటు పలువురు గుర్తింపు కలిగిన నటులతో కలిసి నటించి తన అభినయంతో ఆకట్టుకుంటున్నాడు.
జమ్ చిత్రంలో నటిస్తున్న కరీం
స్నేహితుడి సహాయంతో సినిమాల్లోకి..
ఒక పక్క బేల్దారి పనులు చేస్తూనే రంగస్థలంపై అనేక నాటికలు ప్రదర్శించి కరీం మంచి నటుడిగా పేరు తెచ్చుకున్నాడు. కరీం స్వస్థలానికి చెందిన మల్లిక్ సినిమా రంగంలో కార్యనిర్వాహక మేనేజర్‌గా ఉండటంతో.. అతని నటనను గుర్తించి ‘సలాం హైద్రాబాద్’ అనే హిందీ సినిమాలో చిన్న పాత్ర ఇప్పించాడు. అప్పటి నుంచి పలు చిన్న సినిమాల్లో పాత్రలు పోషిస్తూ వస్తున్నాడు. సినీ హీరోలు శ్రీకాంత్ నటించిన నగరం, సేవకుడు, కళ్యాణ్‌రామ్ ‘ఇజం’, సునీల్ ‘జక్కన’ సినిమాల్లో నటించాడు. ఆ తర్వాత నిఖిల్ హీరోగా తెరకెక్కిన స్వామిరారా, అలాగే తిమ్మరుసు, అంకుశం(కొత్తది), పోరు తెలంగాణ, గిలిగింతలు, డీకే బోసు, చూసినోడికి చూసినంత, ఖోఖో తెలుగోడి ఆట, చూడాలని చెప్పాలని, దక్షిణ మధ్య రైల్వే జట్టు, చండీ, బిల్లా–రంగా, మెంటల్, కాకతీయుడు, మోసగాళ్లకు–మోసగాడు, శ్రీమతి బంగారం, బ్రేకింగ్ న్యూస్‌తోపాటు సప్తగిరి ఎక్స్‌ప్రెస్, ఎక్కడికిపోతావు చిన్నవాడ, ఖైదీ నంబర్ 150, డిస్కోరాజా చిత్రాల్లో నటించాడు. ఇప్పటి వరకు తెలుగు, తమిళ, హిందీ భాషల్లో సుమారుగా 50 సినిమాల్లో విలన్ దగ్గర సహయకునిగా, హాస్యనటుడిగా పాత్రలు పోషించాడు. కరీం ప్రస్తుతం తనీష్ హీరోగా తెరకెక్కిస్తున్న మహాప్రస్థానం, నటుడు శివాజీ రాజా కొడుకు విజయ్ హీరోగా జమ్ అనే చిత్రాల్లో, ఓ వెబ్ సిరీస్‌లోనూ నటిస్తున్నాడు.
హీరో తనీష్, దర్శకుడు పూరీ జగన్నాథ్‌తో..
మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకుంటా
తాపీ మేస్త్రీగా నా సంపాదన బాగున్నా, బాగోలేకపోయినా నటనపై ఉన్న ఆసక్తితో అవకాశం దొరికినప్పుడు రంగస్థలంపై, సినిమాల్లో నటిస్తున్నా . ఇప్పుడిప్పుడే చిన్న చిన్న పాత్రలతో సినిమా రంగంలో అడుగులు వేస్తున్నా. ఇప్పటి వరకు 50 చిత్రాల్లో నటించా. భవిష్యత్‌లో మంచి పాత్రలు చేయడంతోపాటు గుర్తింపు కలిగిన నటుడిగా ఎదగాలని ఉంది. నన్ను సినీ రంగంలో ప్రోత్సహిస్తున్న భగవాన్, మల్లిక్, కెమెరామెన్ గోల్డ్ అమర్‌కు రుణపడి ఉంటా.
– కరీం
వెబ్ సిరీస్‌లో
Comments
Please login to add a commentAdd a comment