Megastar Chiranjeevi Superb Speech At Baby Movie Success Meet, Deets Inside - Sakshi
Sakshi News home page

Megastar Chiranjeevi: వాళ్లను చూస్తే నాకు ఎప్పుడూ గర్వంగానే ఉంటుంది

Published Mon, Jul 31 2023 5:30 AM | Last Updated on Mon, Jul 31 2023 11:31 AM

Megastar Chiranjeevi Superb Speech At Baby Movie Success Meet - Sakshi

‘‘సినిమా అభిమానులంటే ఒక రకమైన దురభిప్రాయం ఉన్నటువంటి సమయం నుంచి నేను ఈ పరిశ్రమను చూస్తున్నాను. ఈ హీరో ఫ్యాన్స్ ఆ హీరోని తిట్టుకోవడం, ఆ హీరో ఫ్యాన్స్ ఈ హీరోని తిట్టుకోవడం... ఈ క్రమంలో చదువులపై అశ్రద్ధ వహించి, జీవితంలో పైకి రావాలనే తపన లేకుండా ఉంటారని.. ఇలా సమాజంలో అభిమానుల గురించి దురభిప్రాయం ఉండేది.

అలాంటివి నా చెవిన పడ్డాయి. అలాంటి సమయంలో నేను ఇండస్ట్రీలో నిలదొక్కుకుని నాకంటూ అభిమానులు ఏర్పడితే.. నా అభిమానులను చూసి, సమాజం గర్వపడేలా వారిని తీర్చిదిద్దాలని ఆ రోజు నేను నిర్ణయించుకున్నాను. అందులో భాగంగానే బ్లడ్‌ బ్యాంక్, ఐ బ్యాంక్‌ వంటి మంచి సామాజిక కార్యక్రమాలు చేశాను. నా పిలుపు మేరకు వచ్చిన నా అభిమానుల గురించి వారి తల్లిదండ్రులు, సమాజం గర్వించేలా మాట్లాడటం చూస్తుంటే.. నా అభిమానులను చూసి నాకు ఎప్పుడూ గర్వంగానే ఉంటుంది’’ అన్నారు చిరంజీవి.

ఆనంద్‌ దేవరకొండ, వైష్ణవీ చైతన్య, విరాజ్‌ అశ్విన్  ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘బేబి’. మాస్‌మూవీ మేకర్స్‌ పతాకంపై సాయిరాజేష్‌ దర్శకత్వంలో ఎస్‌కేఎన్  నిర్మించిన ఈ చిత్రం జూలై 14న విడుదలైంది. ఈ సందర్భంగా ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన ‘బేబీ’విజయోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన చిరంజీవి మాట్లాడుతూ– ‘‘పాత తరంతోనే ఇండస్ట్రీ ఉంటే అది వెనకబడిపోతుంది. కొత్త తరం రావాలి. అప్పుడే మన పరిశ్రమ నిరంతరం ముందుకు సాగిపోతూ ఉంటుంది.

రాజమౌళివంటి దిగ్గజ దర్శకులు ఉన్నారు కాబట్టే మన తెలుగు సినిమాలు అంతర్జాతీయ స్థాయికి, ఆస్కార్‌ స్థాయికి వెళ్తున్నాయి. ఇది మనందరం గర్వించదగ్గ విషయం. వాళ్లను యువ దర్శకులు స్ఫూర్తిగా తీసుకుని కొత్త కంటెంట్‌తో రాగలిగితే అంతకుమించిన ప్రత్యుపకారం ఇండస్ట్రీకి మరొకటి ఉండదు. ఎస్‌కేఎన్ , సాయి రాజేష్, మారుతి.. ఇలా నా అభిమానులను చూస్తుంటే నాకు ఎనలేని సంతోషం కలుగుతుంది.

నా అభిమానులు చేసిన ‘బేబి’ ప్రయత్నం ప్రజాశీస్సులు పొంది, ఇంతటి విజయాన్ని సాధించింది. ఈ ఆనందంలో భాగం కావాలనే నేను ఇక్కడికి వచ్చాను. ‘బేబి’ ఎడ్యుకేషనల్‌ ఫిల్మ్‌లా అనిపించింది. చాలామంది యువత సోషల్‌ మీడియా ఆకర్షణలో పడిపోయి, సెల్‌ ఫోన్ కు ఎడిక్ట్‌ అవుతున్నారు. యువతే కాదు..వారి తల్లిదండ్రులు కూడా ఈ మూవీని చూసి, ఇప్పుడున్న పరిస్థితులకు అన్వయించుకుని జాగ్రత్తలు తీసుకోవాలి’’ అన్నారు. ‘‘చిరంజీవిగారిని స్ఫూర్తిగా తీసుకుని ఇండస్ట్రీకి వచ్చిన మాకు, ఆయన మా సినిమా సక్సెస్‌మీట్‌కు రావడం సంతోషంగా ఉంది’’ అని ‘బేబి’ చిత్రయూనిట్‌ పేర్కొంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement