
పంకజ్ త్రిపాఠి, కృతీ సనన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'మిమీ'. మంగళవారం ఈ సినిమా ట్రైలర్ రిలీజైంది. ఇందులో హీరో పంకజ్.. 'అమెరికావాడు నీ ద్వారా బిడ్డను కనాలనుకుంటున్నాడు' అనగానే హీరోయిన్ అతడి చెంప ఛెళ్లుమనిపిస్తుంది. అయితే అది నువ్వనుకుంటున్నట్లుగా కాదని, సరోగసీ విధానం ద్వారా ఆ దంపతులు సంతానం కోరుకుంటున్నారని వివరంగా చెప్తాడు. పైగా బిడ్డను కనిచ్చిన మహిళకు 20 లక్షలిస్తామని చెప్పడంతో నోరెళ్లబెట్టిన మిమీ (కృతీ) సరోగసీకి సిద్ధమైనట్లు తెలుస్తోంది.
కానీ తర్వాత కథలో అసలు ట్విస్టు చోటు చేసుకున్నట్లు కనిపిస్తోంది. గర్భం దాల్చిన కొన్ని నెలలకు అమెరికా దంపతులు పిల్లలు వద్దనుకుంటున్నారని, కాబట్టి అబార్షన్ చేయించుకోమని చెప్తాడు పంకజ్. అన్ని నెలలు కడుపులో మోసిన పసిగుడ్డును అన్యాయంగా పొట్టన పెట్టుకోవడానికి కృతీకి మనసొప్పదు. సరోగసీ ద్వారా తల్లైన విషయం తెలియని ఆమె తల్లిదండ్రులు మిమీ గర్భం దాల్చడాన్ని చూసి శివాలెత్తుతారు.
కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రెవరో చెప్పంటూ నిలదీయడంతో ఆమె పంకజ్ వైపు వేలు చూపించింది. అంటే తర్వాతి కథలో వీళ్లిద్దరికీ పెళ్లి జరుగుతుందా? కృతీ బిడ్డకు జన్మనిస్తుందా? ఒకవేళ పసిగుడ్డుకు జన్మనిస్తే ఎవరు పెంచుకుంటారు? అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే! ఏఆర్ రెహమాన్ సంగీతం అందించిన ఈ చిత్రానికి లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించగా దినేశ్ విజన్ నిర్మించాడు. ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో జూలై 30 నుంచి ప్రసారం కానుంది.
Comments
Please login to add a commentAdd a comment