టైటిల్: మూన్ నైట్ (వెబ్ సిరీస్)
నటీనటులు: ఆస్కార్ ఐజాక్, మే కాలమావీ, ఈధన్ హాక్ తదితరులు
నిర్మాత: కెవిన్ ఫీజ్
డైరెక్టర్స్: మహమ్మద్ దియాబ్, జస్టిన్ బెన్సన్, ఆరన్ మూర్‌హెడ్
సంగీతం: హెషాం నజీ
సినిమాటోగ్రఫీ: గ్రెగరీ మిడిల్‌టన్, ఆండ్రూ డియాజ్ పలెర్మో
ఎపిసోడ్‌లు: ఆరు
విడుదల తేది: మార్చి 25-మే 6, 2022 (డిస్నీ ప్లస్ హాట్‌స్టార్)
హాలీవుడ్ మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్‌లో (ఎమ్‌సీయూ) వచ్చే చిత్రాలకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఈ యూనివర్స్ నుంచి ఇప్పటివరకు అనేక చిత్రాలు, వెబ్ సిరీస్‌లు వచ్చాయి. ఇటీవల విడుదలైన 'డాక్టర్ స్ట్రేంజ్ మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్‌నెస్'ను కలుపుకొని మొత్తంగా 28 సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఈ మూవీస్‌తోపాటు మార్వెల్ పలు వెబ్ సిరీస్‌లను కూడా నిర్మించింది. ఈ క్రమంలోనే తాజాగా వచ్చింది 'మూన్ నైట్' వెబ్ సిరీస్. అయితే ఇదివరకు వచ్చిన వాండా విజన్, ఫాల్కన్ అండ్ వింటర్ సోల్జర్, వాట్ ఇఫ్, హాక్ ఐ సిరీస్‌లలోని క్యారెక్టర్లను మార్వెల్ సినిమాల్లో చూపించారు. కానీ మొదటిసారిగా ఒక వెబ్ సిరీస్‌తో మార్వెల్ క్యారెక్టర్‌ను పరిచయం చేశారు. ఎప్పటిలానే మార్వెల్ సినిమాలు, సిరీస్‌లపై భారీ అంచనాలు ఉంటాయి. మరి ఈ హైప్ మధ్య విడుదలైన మూన్ నైట్ ఏ మేరకు అలరించాడో రివ్యూలో చూద్దాం.
కథ:
స్టీవెన్ గ్రాంట్ (ఆస్కార్ ఐజాక్) ఒక సాధారణ వ్యక్తి. ఈజిప్టులోని ఒక మ్యూజియంలో పనిచేస్తాడు. అతను ఒక్కోసారి సడెన్‌గా బ్లాంక్ అయిపోతుంటాడు. లేచి చూసేసరికి విభిన్న ప్రదేశాల్లో ఉంటాడు. తిరిగి తను నివసించే చోట లేచేసరికి కొన్ని రోజులు గడిచిపోతాయి. స్టీవెన్‌కు నిజమేదో, కల ఏదో తెలియకుండా ఉంటుంది. ఈ క్రమంలో అతనికి ఒక కాల్ వస్తుంది. ఆ కాల్‌లో అతన్ని స్టీవెన్‌కు బదులు మార్క్ స్పెక్టర్ అని పిలుస్తారు. మొదట్లో అతన్ని మార్క్ అని ఎందుకు పిలుస్తున్నారో అర్థం కాదు. తర్వాత అతనికి మార్క్ స్పెక్టర్ పేరుతో పాస్‌పోర్టులు ఉండటాన్ని కనుగొంటాడు. క్రమక్రమంగా అతనికి మల్టిపుల్ డిజార్డర్ ఉన్నట్లు గ్రహిస్తాడు స్టీవెన్. అతను బ్లాంక్ అయిన ప్రతిసారి మార్క్ స్పెక్టర్ అనే వ్యక్తిలా మారిపోతున్నట్లు గుర్తిస్తాడు. అంతేకాకుండా అతనికి ఒక భార్య లేలా (మే కాలమావీ) ఉన్నట్లు తెలిసి షాక్ అవుతాడు. అయితే అతని శరీరం స్టీవెన్ గ్రాంట్‌దా లేక మార్క్ స్పెక్టర్‌దా ? అతను ఈజిప్టు చంద్ర దేవుడి అవతారమైన మూన్ నైట్‌గా ఎందుకు మారాడు ? అలా మారడానికి కారణం ఎవరు? అతని బాధ్యత ఏంటి ? దాన్ని నిర్వర్తించాడా ? స్టీవెన్ గ్రాంట్‌లో ఇంకెంతమంది వ్యక్తులు ఉన్నారు ? అనేది తెలియాలంటే ఈ వెబ్ సిరీస్ చూడాల్సిందే.
విశ్లేషణ:
ఆరు ఎపిసోడ్‌లు ఉన్న ఈ వెబ్ సిరీస్‌కు ముగ్గురు డైరెక్టర్లు మహమ్మద్ దియాబ్, జస్టిన్ బెన్సన్, ఆరన్ మూర్‌హెడ్ దర్శకత్వం వహించారు. సిరీస్ ప్రారంభంలో హీరోతోపాటు ప్రేక్షకుడికి కూడా అతనికి ఏం జరుగుతుంది ? అతను బ్లాంక్ అయినప్పుడు వేరే ప్రదేశాలకు ఎందుకు వెళ్తున్నాడు ? అది కల? నిజమా ? అని విషయాలను సస్పెన్స్‌డ్‌గా చాలా బాగా చూపించారు. యాక్షన్ సీన్స్, 'మూన్ నైట్'గా మార్క్ మారడం వంటి సీన్లు బాగా ఆకట్టుకున్నాయి. సీన్లు బోర్ కొట్టించకుండా తెరకెక్కించడంలో డెరెక్టర్స్ సక్సెస్ అయ్యారు. అయితే మూన్ నైట్ సూపర్ హీరోను మరింత పవర్‌ఫుల్‌గా చూపిస్తే బాగుండేదనిపించింది. అక్కడక్కడ వయలెన్స్ కాస్త ఎక్కువగా ఉంటుంది. పలుచోట్ల ఊహించిన దానికంటే తక్కువగా హీరోయిజం ఉంటుంది. ప్రతి ఎపిసోడ్‌లో వచ్చే క్లైమాక్స్ సీన్.. తర్వాతి ఎపిసోడ్ ఎలా ఉంటుందో అనే ఉత్సుకతను పెంచేలా ఉంది.
ఎవరెలా చేశారంటే?
ఇక ఈ సిరీస్‌లో నటించిన యాక్టర్స్ సూపర్బ్‌గా అలరించారు. ముఖ్యంగా మల్టిపుల్ డిజార్డర్‌తో బాధపడుతున్న స్టీవెన్ గ్రాంట్ పాత్రలో ఆస్కార్ ఐజాక్ మార్వలెస్‌గా చేశాడనే చెప్పవచ్చు. ఇటు స్టీవెన్ గ్రాంట్‌గా, అటు మార్క్ స్పెక్టర్‌గా ఇద్దరు వేరు వేరు వ్యక్తులు అనిపించేలా అదరగొట్టాడు. స్టీవెన్ గ్రాంట్ సాప్ట్ అండ్ ఇంటలిజెంట్ క్యారెక్టర్ కాగా మార్క్ స్పెక్టర్ వయలెంట్ క్యారెక్టర్‌గా ఉంటుంది. వీరిద్దరి మధ్య వచ్చే ఎమోషనల్ సీన్లు ఎంతో ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా ఐదో ఎపిసోడ్‌లో వచ్చే ఎమోషనల్ సీన్లలో ఐజాక్ నటన హైలెట్ అని చెప్పవచ్చు. మార్క్ భార్యగా, పురావస్తు పరిశోధకురాలిగా లేలా ఎల్ ఫౌలి క్యారెక్టర్‌లో మే కాలమావి కూడా చక్కగా ఒదిగిపోయింది. తను చేసే యాక్షన్ సీన్స్ బాగుంటాయి. సిరీస్ లాస్ట్ ఎపిసోడ్‌లో తాను కూడా ఓ సూపర్ హీరోగా మారడం విశేషం.
ఇక విలన్‌గా అర్థర్ హారో పాత్రలో ఈథన్ హాక్ నటన కూడా ప్రత్యేకంగా ఆకట్టుకునేలా ఉంటుంది. మంచి పవర్‌ఫుల్ విలన్‌గా తన ముద్ర వేశాడు. ఈ సిరీస్‌లో యాక్షన్ సీన్స్‌తోపాటు యాక్టర్స్ నటనే ప్రధాన బలం. హెషాం నాజీ అందించిన సంగీతం, గ్రెగరీ మిడిల్‌టన్, ఆండ్రూ డియాజ్ పలెర్మో సినిమాటోగ్రఫీ సిరీస్‌కు మరింత ప్లస్ అయ్యాయి. ఓవరాల్‌గా చెప్పాలంటే 'అపరిచితుడు' తరహాలో ఉండే ఒక సూపర్ హీరో సిరీస్ ఇది.
Comments
Please login to add a commentAdd a comment