కాజల్ అగర్వాల్ లీడ్ రోల్‌లో నటించిన చిత్రం ‘సత్యభామ’. ఓ కీలక పాత్రలో నవీన్‌చంద్ర నటించారు. సుమన్ చిక్కాల దర్శకత్వంలో బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపల్లి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 7న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా సోమవారం విలేకర్ల సమావేశంలో ఈ చిత్రం మ్యూజిక్ డైరెక్టర్ శ్రీ చరణ్ పాకాల మాట్లాడుతూ– ‘‘ఓ పోలీసాఫీసర్ ఎమోషనల్ జర్నీయే ఈ చిత్రం.
థ్రిల్లర్ మూవీస్ ఇష్టపడేవారికి ‘సత్యభామ’ చిత్రం బాగా నచ్చుతుంది. ఈ సినిమాలో ఐదు పాటలు ఉన్నాయి. కాజల్, నవీన్‌చంద్రల మధ్య ‘కళ్లారా చూసాలే..’ అనే లవ్‌సాంగ్ ఉంటుంది. అలాగే ‘వెతుకు వెతుకు’ పాట ఇన్వెస్టిగేషన్ నేపథ్యంలో ఉంటుంది. ఈ పాటను కీరవాణిగారు పాడారు. గతంలో ‘ఆపరేషన్ గోల్డ్ ఫిష్’ సినిమాకు నా మ్యూజిక్‌లో కీరవాణిగారు పాడారు. ‘సత్యభామ‘ పాటకు ఆయన స్టూడియోకు వస్తూనే ‘నేను పాడిన ఏ పాట విని నన్ను నీ పాటకు పాడేందుకు పిలిచావ్’ అని అడిగారు. లిరిక్స్ అందించిన చంద్రబోస్‌గారు కూడా పాట పూర్తయ్యేంతవరకు చర్చిస్తూనే ఉన్నారు.
‘సత్యభామ’లో ఓ ఇంగ్లిష్ సాంగ్ కూడా ఉంది. ఇతర పాటలను త్వరలోనే విడుదల చేస్తాం. నేను థ్రిల్లర్ మూవీస్‌కు ఎక్కువగా పని చేస్తాననే పేరొచ్చింది. ఈ ఇమేజ్ నాకు ఇబ్బందిగానే ఉంది. ఎందుకంటే మొత్తం థ్రిల్లర్ మూవీస్‌కు నేనే సంగీతం అందించడం లేదు. చెప్పాలంటే.. ‘కృష్ణ అండ్ హిస్ లీల, డీజే టిల్లు, గుంటూరు టాకీస్’ వంటి లవ్ అండ్ కమర్షియల్ చిత్రాలకూ సంగీతం అందించాను. కానీ థ్రిల్లర్స్ మ్యూజిక్ డైరెక్టర్ అనే ముద్ర వచ్చేసింది. నాకైతే అన్ని జానర్ సినిమాలకూ సంగీతం అందించాలని ఉంది. ప్రస్తుతం ‘గూఢచారి 2’కు పని చేస్తున్నాను. మరో నాలుగైదు ప్రాజెక్ట్స్ ఉన్నాయి’’ అని చెప్పుకొచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment