‘‘విరాటపర్వం’ చిత్రంలో ఉద్యమంతో పాటు ఒక గొప్ప ప్రేమకథ ఉంది. వేణు ఊడుగులగారు అద్భుతంగా రాశారు.. తీశారు. ఇలాంటి బలమైన కథలో నాకు మంచి పాత్ర దక్కింది’’ అని నవీన్ చంద్ర అన్నారు. రానా దగ్గుబాటి, సాయిపల్లవి జంటగా వేణు ఊడుగుల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘విరాటపర్వం’. డి. సురేష్ బాబు సమర్పణలో సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 17న విడుదల కానుంది.
ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించిన నవీన్ చంద్ర విలేకరులతో మాట్లాడుతూ– ‘‘విరాటపర్వం’లో సీనియర్ ఉద్యమకారుడు రఘన్న పాత్రలో కనిపిస్తా. కథను తలకిందులు చేసే పాత్ర నాది. నాతో మొదటిసారి తెలంగాణ యాసని అద్భుతంగా చెప్పించారు వేణుగారు. ఈ సినిమా చేయడం ఒక చాలెంజ్. రానాగారి వ్యక్తిత్వం గొప్పది. ఓ రకంగా ఆయన బిగ్ ఇన్‌ఫర్మేషన్ బాక్స్’’ అన్నారు. ఇంకా మాట్లాడుతూ– ‘‘నన్ను చాలా మంది హీరోగా ఫిక్స్ అయిపోయారు.
హీరోగా చేయాల్సిన సినిమాలు వస్తే చేస్తున్నాను. సినిమా ఆడినా ఆడకపోయినా నేను చక్కగా చేశాననే గుర్తింపు వస్తోంది. నాపై నమ్మకంతో మంచి పాత్రలు ఇస్తున్న దర్శకులకు కృతజ్ఞతలు. హీరోగా చేయడం సెపరేటు. నాలుగు నెలలు ఒకే కథపై ఉంటాం.. దానికి వచ్చే పేరు, రెమ్యూనరేషన్ వేరుగా ఉంటాయి. కానీ మంచి కథ ఉన్న సినిమాల్లో పాత్రలు చేయడం కూడా నటుడిగా తృప్తి ఇస్తోంది. నేను చేసిన కొన్ని ఓటీటీ సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. యూవీ కాన్సెప్ట్స్‌లో హీరోగా ఒక సినిమా చేశాను. రామ్‌చరణ్–శంకర్‌గారి సినిమా, బాలకృష్ణ– గోపీచంద్ మలినేనిగారి సినిమా చేస్తున్నాను’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment