బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ తన భార్య ఆలియాతో వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. కొద్ది రోజులుగా వీరిద్దరి మధ్య న్యాయ పోరాటం జరుగుతోంది. దుబాయ్ నుంచి పిల్లలతో సహా ఇండియాకు తిరిగొచ్చిన ఆలియా.. నవాజుద్దీన్ తీవ్రస్థాయిలో ఆరోపణలు చేసింది. తనను, పిల్లలను ఇంట్లోకి రానివ్వడం లేదని ఆరోపించింది. ఆ తర్వాత ఒకరిపై ఒకరు పీఎస్‌లో ఫిర్యాదు చేసుకున్నారు.
అయితే తాజాగా నవాజుద్దీన్ సిద్ధిఖీ తన భార్యపై బాంబే హైకోర్టులో రూ. 100 కోట్ల పరువునష్టం దావా వేసిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై స్పందించిన ఆలియా విడాకుల ప్రక్రియ ప్రారంభమైందని అన్నారు.
ఆలియా మాట్లాడుతూ.. 'విడాకుల ప్రక్రియ కచ్చితంగా జరుగుతుంది. నా పిల్లల సంరక్షణ కోసం నేను పోరాడతా. నా పిల్లలిద్దరూ నాతో ఉండాలనుకుంటున్నారు. ఎందుకంటే వారు ఆయనతో కలిసి జీవించడానికి ఇష్టపడరు' అని అన్నారు.
ఇదే విషయంపై ఆలియా తరఫున లాయర్ రిజ్వాన్ ఇప్పటికే కోర్టుకు వాంగ్మూలం సమర్పించినట్లు తెలిపారు. నవాజుద్దీన్ న్యాయవాదులు తనకు సెటిల్‌మెంట్ కోసం కొన్ని నిబంధనలు పంపారని తెలిపారు. ఇప్పుడు ఆలియాతో అదే విషయమై చర్చిస్తున్నట్లు రిజ్వాన్ సిద్ధికీ పేర్కొన్నారు. వారి పిల్లల భవిష్యత్తు కోసం వివాదం ముగిసిపోయేలా ప్రయత్నిస్తున్నామని ఆయన హామీ ఇచ్చారు. ఇందులో భాగంగానే రూ. 100 కోట్ల పరువునష్టం దావాను ఉపసంహరించుకోవాలని సిద్దిఖీని కోరతామని రిజ్వాన్ పేర్కొన్నారు. అయితే మిస్టర్ నవాజుద్దీన్ సిద్ధిఖీ హైకోర్టులో దాఖలు చేసిన పరువునష్టం దావాకు కాపీని మాకు ఇంకా అందజేయలేదని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment