
నాలుగు పదుల వయసులో వరుస అవకాశాలతో దూసుకెళుతున్న హీరోయిన్ నయనతార. దక్షిణాదిలోనే కాకుండా ఇటీవల బాలీవుడ్ చిత్రం జవాన్‌తో సక్సెస్ కొట్టింది. ఒక పక్క నటన, మరో పక్క పిల్లల బాధ్యత, ఇంకో పక్క వ్యాపారం అంటూ బిజీగా జీవితాన్ని గడుపుతోంది. 75 చిత్రాల మైలురాయిని అవలీలగా దాటేసింది. అయినా హీరోయిన్‌గా ఎక్కడా ఫుల్‌స్టాప్ లేదంటోంది. ప్రస్తుతం ఆమె చేతిలో పలు చిత్రాలు ఉన్నాయి. 75వ చిత్రంగా మాధవన్, సిద్ధార్థ్‌లతో టెస్ట్ చిత్రంలో నటిస్తోంది. అంతే కాకుండా కథానాయకిగా నటించిన మరో చిత్రం అన్నపూరణి. ఈ చిత్రం త్వరలో తెరపైకి రావడానికి సిద్ధమవుతోంది.
ఇదిలా ఉండగా.. తాజాగా మరో నూతన చిత్రానికి నయనతార గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. అరుణ్‌రాజా కామరాజ్ దర్శకత్వం వహించనున్న హీరోయిన్ ఓరియంటెడ్ కథా చిత్రంలో నటించనున్నారని తెలిసింది. నటుడిగా సినీరంగానికి పరిచయం అయిన అరుణ్‌రాజా కామరాజ్ ఆ తరువాత గాయకుడు, గీత రచయితగా తనలోని ప్రతిభను నిరూపించుకుని ఆపై దర్శకుడిగా కనా చిత్రంతో పరిచయమయ్యారు. దర్శకుడిగా తొలి చిత్రంతోనే విజయాన్ని అందుకున్న ఈయన ఉదయనిధి స్టాలిన్ హీరోగా నెంజిక్కు నీతి చిత్రం చేసి సక్సెస్ అయ్యారు. తాజాగా లేబుల్ అనే వెబ్‌సిరీస్ చేశారు. నటుడు కార్తీ హీరోగా చిత్రం చేయనున్నట్లు ప్రచారం జరిగింది. అది ఏమైందో గానీ తాజాగా నయనతార హీరోయిన్‌గా చిత్రం చేయడానికి సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. దీన్ని ప్రిన్స్ పిక్చర్స్ నిర్మించనున్నట్లు సమాచారం. ఈ రేర్ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment