
ప్రస్తుతం నయనతార మాలీవుడ్ వైపు మళ్లుతున్నారా? పరిస్థితి చూస్తే అలానే అనిపిస్తోంది. లేడీ సూపర్‌స్టార్‌గా వెలుగుతున్న నయనతారకు ఇప్పుడిప్పుడే ఆ పేరు దూరం అవుతున్నట్లు కనిపిస్తోంది. ఎందుకంటే చైన్నె సుందరి త్రిష నుంటి గట్టి పోటీ ఎదురవుతోంది. దీంతో త్రిష కోలీవుడ్‌లో సూపర్ స్టార్ హోదాను కైవసం చేసుకోనుందా? ప్రస్తుతం కోలీవుడ్‌లో గత కొద్దికాలంగా హాట్ టాపిక్ ఇదే.
నయనతార గతేడాది జవాన్ చిత్రంతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. అంతేకాదు ఆ చిత్రం సంచలన విజయాన్ని సాధించింది. అయితే బాలీవుడ్‌లో మరో అవకాశం రాలేదు. ఇక తమిళంలో ఇటీవల ఈమె నటించిన ఇరైవన్, అన్నపూరణి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద తీవ్రంగా నిరాశపరచాయి. ప్రస్తుతం నవ దర్శకుడు టూయుటూ విక్కీ దర్శకత్వం వహిస్తున్న మన్నాగట్టి, సెంథిల్‌కుమార్ దర్శకత్వంలో ఒక చిత్రం, మాధవన్‌తో కలిసి టెస్ట్ అనే మరో చిత్రంలో నటిస్తున్నారు. నయనతారకు వీటిలో ఏదో ఒకటి హిట్ కావాల్సిన పరిస్థితి ఏర్పడింది.
మరో విషయం ఏమిటంటే కోలీవుడ్‌లో స్టార్ హీరోలతో జతకట్టే అవకాశాలు నయన్‌కు ఇప్పుడిప్పుడే దూరమవుతున్నాయి. నటి త్రిష వైపు వెళుతున్నాయని చెప్పక తప్పడం లేదు. ఆ తరువాత తెలుగులోనూ స్టార్ హీరోలైన చిరంజీవి, అల్లుఅర్జున్‌లతో కలిసి నటించే అవకాశాలను దక్కించుకున్నారు. అంతేకాకుండా మలయాళంలోనూ నటిస్తున్నారు.
దీంతో నయనతార కూడా మలయాళ చిత్ర పరిశ్రమపై దృష్టిసారించినట్లు తెలుస్తోంది. తన మాతృభాష అయిన ఈ చిత్ర పరిశ్రమలో నయనతారకు ప్రత్యేక స్థానం ఉంది. ఇంతకుముందే మమ్ముట్టి, నివిన్‌బాలీ వంటి స్టార్ హీరోలతో జతకట్టారు. అలా ఈమె మలయాళంలో నటించిన చివరి చిత్రం గోల్డ్. అల్‌పోన్స్ దర్శకత్వం వహించిన ఆ చిత్రం 2022లో విడుదలై పెద్దగా ఆడలేదు.
దీంతో కొంతకాలం మాలీవుడ్‌కు దూరంగా ఉంటూ వచ్చిన నయనతార తాజాగా మరో చిత్రంలో నటించడానికి సిద్ధం అవుతున్నారు. దీనికి డియర్ స్టూడెంట్ అనే టైటిల్‌ను నిర్ణయించారు. ఇందులో నయనతార టీచర్ పాత్రను పోషిస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రం గురించి తమిళ నూతన సంవత్సరం సందర్భంగా ఆదివారం పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో నటుడు నివిన్ బాలి హీరోగా నటిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment