‘‘మనం పోషించిన పాత్రల పేరుతో ప్రేక్షకులు మనల్ని పిలవడం ఏ నటులకైనా గొప్ప ప్రశంస. పోలిక అని కాదు కానీ.. షారుఖ్ ఖాన్‌గారిని బాద్‌షా అని పిలుస్తారు. డీజే టిల్లు’ చిత్రంలో నేను పోషించిన రాధిక పాత్ర ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. నా కెరీర్ ప్రారంభంలోనే రాధిక అని పేరు తెచ్చుకోవడం సంతోషంగా ఉంది.. దాన్ని గౌరవంగా భావిస్తున్నాను’’ అని హీరోయిన్ నేహా శెట్టి అన్నారు. విశ్వక్ సేన్ హీరోగా కృష్ణ చైతన్య దర్శకత్వం వహించిన చిత్రం ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’.
నేహా శెట్టి, అంజలి కథానాయికలు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ సినిమా ఈ నెల 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా నేహా శెట్టి మాట్లాడుతూ–‘‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ మూవీ ఒక కుటుంబ ప్రయాణంలా ఉంటుంది. రత్న, రత్నమాల, బుజ్జి పాత్రల చుట్టూ కథ తిరుగుతుంది. ఈ మూవీలో 90లలో ధనవంతుల కుటుంబానికి చెందిన పల్లెటూరి అమ్మాయి బుజ్జి పాత్ర చేశా.
90లలో సాగే ఈ క్యారెక్టర్ కోసం డైరెక్టర్‌గారు నటి శోభనగారిని రిఫరెన్స్గా చూపించారు. బుజ్జి పాత్ర నాకు ఎంతగానో పేరు తెచ్చి పెడుతుంది. అప్పట్లో వాన పాటలంటే శ్రీదేవిగారు గుర్తుకొచ్చే వారు. అంత గొప్ప నటిలాగా ఇప్పుడు నాకు ఎక్కువ వాన పాటల్లో కనిపించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను. విశ్వక్ సేన్ ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డాడు. అనుభవం గల నటిగా అంజలిగారి నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. కృష్ణ చైతన్యగారు ఈ మూవీని తెరకెక్కించిన విధానం అద్భుతం. సితార సంస్థలో సినిమా చేయడం సంతోషంగా ఉంది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌కి జోడీగా ఓ సినిమా చేయబోతున్నా’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment