సినిమా తెరకెక్కించడం ఒకెత్తు అయితే.. దానిని జనాల్లోకి తీసుకెళ్లడం మరో ఎత్తు. అందుకే ప్రమోషన్స్ కోసం ప్రత్యేకంగా బడ్జెట్ కేటాయిస్తారు నిర్మాతలు. పక్కా ప్రణాళికతో వినూత్నంగా ప్రచారం చేస్తూ.. విడుదల రోజు వరకు తమ సినిమా పేరుని ప్రేక్షకులు గుర్తుపెట్టుకునేలా చేస్తారు. చిన్న సినిమాలు వారం, పది రోజుల ముందు ప్రమోషన్స్ స్టార్ట్ చేస్తే.. పాన్ ఇండియా సినిమాలు అయితే నెల ముందే ప్రచారం మొదలెడతాయి. ఇక రాజమౌళి లాంటివాడైతే సినిమా షూటింగ్ నుంచే ప్రమోషన్స్‌కి ప్రణాళికలు వేస్తాడు. ఆర్‌ఆర్‌ఆర్ విషయంలో కేవలం ప్రమోషన్స్‌కే రూ.20 కోట్ల వరకు కేటాయించినట్లు వార్తలు వినిపించాయి. అంతలా సినిమా ప్రమోషన్స్‌కి ప్రాధాన్యత ఇస్తారు మన దర్శకనిర్మాతలు.
కానీ ఆదిపురుష్ యూనిట్ మాత్రం ఈ విషయాన్ని చాలా లైట్ తీసుకున్నట్లు కనిపిస్తుంది. సినిమా విడుదలకు ఒక్క రోజు(జూన్ 16న) మాత్రమే మిగిలి ఉన్నా.. ఎలాంటి ప్రచార కార్యక్రమం చేపట్టకపోవడం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ముఖ్యంగా టాలీవుడ్‌లో అయితే ఈ సినిమాకు సరైన ప్రమోషన్ కార్యక్రమాలే చేపట్టలేదు.
(చదవండి: ఆదిపురుష్.. టికెట్ రేట్లు చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే!)
ఇటీవల తిరుపతిలో భారీ స్టాయిలో ప్రీరిలీజ్ ఈవెంట్ చేపట్టారు. అదే రోజు యాక్షన్ ట్రైలర్‌ని రిలీజ్ చేసి చేతులు దులుపుకున్నారు. ఆ రోజు నుంచి నేటి వరకు ఒక్కటంటే ఒక్క ప్రమోషన్ కార్యక్రమాన్ని కూడా నిర్వహించలేదు. కనీసం మీడియా ఇంటర్వ్యూలు కూడా చేపట్టకపోవడం గమనార్హం. ప్రధాన పాత్రలు పోషించిన ప్రభాస్, కృతీసనన్ కూడా తిరుపతి ఈవెంట్ తర్వాత సినిమా గురించి బయట ఎక్కడా మాట్లాడలేదు.
ట్రెండింగ్‌లో ‘ఆదిపురుష్’
ఆదిపురుష్ విషయంలో విచిత్రమైన సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. చిత్రబృందం ప్రమోషన్స్‌కి దూరంగా ఉన్నప్పటికీ.. సినిమా పేరు మాత్రం నెట్టింట ట్రెండింగ్‌గా మారింది. టాలీవుడ్‌లో ఇప్పుడు ఎక్కడ చూసినా ఆదిపురుష్ గురించే చర్చిస్తున్నారు. టికేట్లు భారీ స్థాయిలో అడ్వాన్స్ బుకింగ్ అవుతున్నాయి. ఒకనొక దశలో టికెట్ బుకింగ్ వెబ్‌సైట్లు క్రాష్ అయ్యానంటే ఆదిపురుష్ క్రేజ్ ఏ స్థాయిలో ఉందో తెలుసుకోవచ్చు. అడ్వాన్స్ బుకింగ్ ద్వారాలే ఈ సినిమాకు రూ. 100 కోట్లు వచ్చినట్లు తెలుస్తోంది. జై శ్రీరామ్ నినాదానికి, ప్రభాస్‌కు ఉన్న క్రేజ్ ‘ఆదిపురుష్’కి బాగా కలిసొస్తుందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment