Drugs Case: What About Actors/Heroes ? | Why NCB Focus on Actress Only - Sakshi Telugu
Sakshi News home page

డ్రగ్స్: హీరోయిన్లు మాత్రమేనా? హీరోల మాటేమిటి?

Published Wed, Sep 23 2020 3:21 PM | Last Updated on Wed, Sep 23 2020 4:51 PM

Only heroines? Bollywood heroes dont take drugs, smoke?  - Sakshi

(వెబ్‌ స్పెషల్‌): బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ అనుమానాస్పద మరణం ప్రాథమికంగా చిత్ర పరిశ్రమపై అనేక ప్రశ్నల్ని లేవనెత్తింది. మొదట సుశాంత్  ది  ఆత్మహత్యగా మీడియాలో వార్తలు వ్యాపించినా,  క్రమ క్రమంగా అనేక నీలినీడలు వెలుగు చూస్తూ వచ్చాయి. నెపోటిజం, పెద్దోళ్ల పెత్తనం, డ్రగ్ మాఫియా దాకా వరుసగా పలు కీలక మలుపులు చోటు చేసుకున్నాయి. గత మూడు నెలలుగా  సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ సినిమా స్టోరీని తలపిస్తూ మీడియాలో సుశాంత్ సంబంధిత కథనాలు లేని రోజు లేదంటే అతిశయోక్తి కాదు.  ప్రధానంగా సుశాంత్ స్నేహితురాలు, రియా చక్రవర్తి పేరు మారు మోగుతూ వచ్చింది.  విచారణలో సీబీఐ, ఈడీ, ఎన్‌సీబీ ఎంట్రీ తరువాత కేసు స్వరూపమే మారిపోయింది. విచారణలో పలువురు బాలీవుడ్‌ స్టార్ల పేర్లు రియా వెల్లడించినట్లు సమాచారం. దీనిపై పార్లమెంటులో కూడా వాదోపవాదాలు జరిగాయంటే దీని తీవ్రతను అర్థం చేసుకోవచ్చు.

ప్రధానంగా  సుశాంత్ ఆత్మహత్య  కేసులో మొదటినుంచీ ఏదో ఒక విధమైన వాదం, వివాదంతో  వార్తల్లో నిలిచిన బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ పరిశ్రమంలో నెపోటిజంపై గొంతెత్తారు. బాలీవుడ్ పెద్దలపై తనదైన శైలిలో విమర్శలు రేకెత్తించారు. తదనంతర పరిణామాల్లో సుశాంత్  స్నేహితురాలు అరెస్ట్ కావడంతో డ్రగ్స్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దీంతో  కంగన మరోసారి బాలీవుడ్ హీరోలపై సంచలన వ్యాఖ్యలే చేశారు. డర్టీ సీక్రెట్స్ అంటూ ట్వీట్ల దుమారం రేపారు. బాలీవుడ్ హీరోలు రణబీర్ కపూర్, రణవీర్ సింగ్, విక్కీ కౌశల్ వంటి వారు డ్రగ్స్ తీసుకోలేదని ప్రకటించాలని కంగనా డిమాండ్ చేయడం విశేషం. అంతేకాదు తాను డ్రగ్స్ తీసుకున్నట్టు నిరూపిస్తే.. ముంబై విడిచిపోతానని ప్రగల్భాలు పోయినా, తాను మత్తుమందులకు బానిసనంటూ గతంలో వాపోయిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కంగన మౌనాన్ని ఆశ్రయించక తప్పలేదు.

బాలీవుడ్ లో దాదాపు 99 శాతం మంది డ్రగ్స్ ని నీళ్లలాగే వాడేస్తున్నారన్న కంగనా వ్యాఖ్యలు సృష్టించిన దుమారం దాదాపు అన్ని వుడ్ లను చుట్టేస్తోంది. మాదకద్రవ్యాల మాఫియాతో 20 మంది కన్నడ నటీ నటులకు లింకులున్నాయని బెంగళూరు  పోలీసులే నిర్ధారించారు. ఇక 2017లో టాలీవుడ్ డ్రగ్స్ వ్యవహారం రేపిన సంచలనాన్ని ఎలా మర్చిపోగలం. తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన పూరీ జగన్నాథ్, రవితేజ, ఛార్మీ సుబ్బరాజు, నవదీప్, తరుణ్, మొమైత్ ఖాన్ తదితరులు విచారణకు హాజరైన వారేకదా. ఈ సందర్భంగా నటి మాధవీలత తెలంగాణ నార్కోటిక్స్ కంట్రోల్ బోర్డునుద్దేశించి చేసిన విజ్ఞప్తిని ప్రస్తావించుకోవాలి. తెలుగు సినీ పరిశ్రమలో డ్రగ్స్ లేని పార్టీలు లేవనీ, కాలేజీ విద్యార్థులపై నిఘా పెట్టాలని ఆమె కోరారు.    

బాలీవుడ్, టాలీవుడ్ శాండిల్‌వుడ్ లను డ్రగ్స్ దుమారం గతంలో పట్టి కుదిపేయలేదా? డ్రగ్స్ మాఫియా పరిశ్రమను ఏలుతోందనేది ఎప్పటినుంచో ఉన్న ఆరోపణే. అయితే ఎవరో ఒకరో ఇద్దరో చేసిన పనికి అందరిపైనా విమర్శలు సరికాదంటూ ఇండస్ట్రీ పెద్దలు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. బాలీవుడ్ డ్రగ్స్ మాఫియాకు అంతర్జాతీయ స్థాయిలో లింకులు ఉన్నాయని, ఈ మేరకు దర్యాప్తు సంస్థ ఎన్‌సీబీ (నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో)కి ఆధారాలు  డ్రగ్ మాఫియా కోరల  ప్రభావాన్ని చెప్పకనే చెబుతున్నాయి.

విలాసంగా, సరదాగా గంజాయి నుంచి మొదలైన గమ్మత్తైన మత్తునుంచి అతిప్రమాదకరమైన డ్రగ్స్‌ వైపునకు మళ్లుతున్నారు. ప్రపంచంలోని అత్యంత ఖరీదైన డ్రగ్స్ హెరాయిన్, కొకైన్‌, ఎల్‌ఎస్‌డీ, డీవోబీ, వీడ్ (గంజాయి) లాంటివి ఇపుడు కాలేజీ విద్యార్థులకు సైతం కాలేజీ క్యాంటీన్లు, హాస్టళ్లలో దొడ్డిదారిన సులువుగా దొరుకుతున్నాయనేది జగమెరిగిన సత్యం. దేశంలోని మెట్రో నగరాల్లో రేవ్‌ పార్టీలు, పబ్ కల్చర్, రేసింగులు, బెట్టింగులు లాంటి అతి వినాశకరమైన సంస్కృతిని పెంచి పోషిస్తోందీ డ్రగ్ మాఫియా. శ్రీలంక, దక్షిణాఫ్రికా, నైజీరియాదేశాల మాస్టర్ మైండ్స్ అండతో అంతర్జాతీయ స్థాయిలో మాదక ద్రవ్యాల వ్యాపార లింకులు వెలుగులోకి వస్తున్నాయి. ఈ నెల సెప్టెంబర్1న 970 గ్రాముల హెరాయిన్ పార్శిల్ ను స్వాధీనం చేసుకున్న అధికారులు డిజిటల్ ఫోరెన్సిక్ విశ్లేషణల ఆధారంగా అంతర్జాతీయ ముఠాను ఛేదించారు. ఎన్‌సీబీ విడుదల చేసిన తాజా ప్రకటన ప్రకారం, మొత్తం భారతదేశం అంతా ఒక సిండికేట్‌గా దందా నిర్వహిస్తున్నారు. ఇండో-నైజీరియన్ డ్రగ్ సిండికేట్ ఫ్రాంక్ ప్రధాన సూత్రధారిగా విదేశాల్లో ఉంటూనే దేశ రాజధాని నగరం డిల్లీ కేంద్రంగా మొత్తం సిండికేట్‌ను నిర్వహిస్తున్నాడు. నకిలీ, చట్టవిరుద్ధ గుర్తింపు కార్డులే వీరి  మోడెస్ ఒపరాండీ. 

డ్రగ్స్‌ కేసు, బాలీవుడ్‌ స్టార్ల ప్రమేయం డ్రగ్స్ కోణం నుంచి దర్యాప్తులో రియా, ఆమె సోదరుడు షోవిక్ చక్రవర్తి, శామ్యూల్ మిరండా, దీపేష్ సావంత్‌, మరికొంతమంది డ్రగ్ వ్యాపారులను  ఇప్పటికే అరెస్టు చేసింది. ముఖ్యంగా ఈ కేసులో  డ్రగ్స్ కోణం వెలుగులోకి వచ్చిన గతకొన్ని రోజులుగా కేవలం బాలీవుడ్ హీరోయిన్ల పేర్లు మాత్రమే ఎందుకు వెలుగులోకి వస్తున్నాయి. తెలుగులో స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్, తాజాగా అగ్రహీరో మహేష్ భార్య నమ్రతా శిరోద్కర్, బాలీవుడ్‌లో  సారా అలీఖాన్, దీపికా పదుకోన్, దియా మీర్జా, శ్రద్ధా కపూర్ లాంటి వారి పేర్లు బయటికి రావడం పెద్ద సెన్సేషన్‌గా మారింది. అటు హీరోయిన్లు స్లిమ్‌గా మారేందుకు డ్రగ్స్‌ను ఆశ్రయిస్తున్నారనే వాదన తెరపైకి వచ్చింది. తాజా పరిణామం అనంతరం బాలీవుడ్ సూపర్ హీరోలపై ఆసక్తికర చర్చకు దారితీసింది. మొత్తం దేశీయ సినీ పరిశ్రమలోగానీ, బాలీవుడ్ హీరోల్లో గానీ డ్రగ్స్ వాడేవారే లేరా? మత్తు మందులు, ధూమపానం లాంటి చెడు అలవాట్లుకు బానిసలైన హీరోలు లేరా? వారికి నేరచరిత్ర ఆరోపణలు లేవా? డ్రగ్ మాఫియా లింకులు లేవా? లాంటి ప్రశ్నలు వెల్లువెత్తున్నాయి.  

ఇది ఇలా ఉంటే అటు రియా ద్వారాగానీ, ఇటు టాలెంట్‌ మేనేజర్‌ జయా సాహా ద్వారా ఇంకెంతమంది గుట్టు రట్టు కానుందనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్. ఏది ఏమైనా సుశాంత్ ఆత్మహత్య తరువాత జస్టిస్ ఫర్ సుశాంత్ అనేది పక్కకుపోయింది. ఉన్నదల్లా ఆరోపణలు.. ప్రత్యారోపణలు..సవాళ్లు.. ప్రతి సవాళ్లు... ట్విస్ట్ అండ్ టర్న్స్. ఒక అనుమానాస్పద మరణం కేసులో ఇన్ని రాజకీయ, నాటకీయ పరిణామాలు, సంచలన ట్విస్టులు  బహుశా ఇదే మొదటి సారి. (సుశాంత్‌ డ్రగ్స్‌ కోసం మమ్మల్ని వాడుకున్నాడు)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement