దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ సినిమాలోని నాటు నాటు సాంగ్ ప్రపంచాన్ని ఊపేసిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది లాస్ ఎంజిల్స్ వేదికగా జరిగిన 95వ ఆస్కార్ వేడుకల్లో ది బెస్ట్ ఒరిజినల్ సాంగ్ ఆస్కార్ అవార్డ్ దక్కింది. దీంతో టాలీవుడ్ పేరు ప్రపంచవ్యాప్తంగా మార్మోగింది. తాజాగా ఆర్ఆర్ఆర్ చిత్రబృందాన్ని ఫిలిం ఛాంబర్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. హైదరాబాద్‌లోని శిల్పాకళావేదికపై ఆర్ఆర్ఆర్ టీంకు అభినందన సభ నిర్వహించారు. ఈ వేడుకలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు.
అల్లు అరవింద్ మాట్లాడుతూ. 'కలలో కూడా కనలేని ఆస్కార్ ఈ రోజు రాజమౌళి టీం వల్ల సాధ్యమైంది. క్షణక్షణం నుంచి మొదలైన కీరవాణి ప్రస్థానం ఈ రోజు ఆస్కార్ అందుకునే స్థాయికి వచ్చింది. వరంగల్‌లో చదువుకుంటున్న ఒక స్టూడెంట్ ఈ రోజు ఎక్కడో ఉన్న ఆస్కార్‌ను తీసుకొచ్చాడు. అతనే చంద్రబోస్. ఈ రోజు తెలుగు సినిమా అంటే అందరూ తిరిగి చూసే స్థాయికి తీసుకొచ్చారు. రాజమౌళి చిత్రబృందం తెలుగు సినిమాస్థాయిని ఎక్కడికో తీసుకెళ్లింది.
చంద్రబోస్ మాట్లాడుతూ..' సినీ ఇండస్ట్రీ అంత మమ్మల్ని ఆశీర్వదించడం చాలా ఆనందంగా ఉంది. నా మిత్రుడు కీరవాణి మాటలతో నా జీవిత గమనం మార్చింది. ఆస్కార్ ఎనౌన్స్ చేసేటప్పుడు నేను భయంతో కీరవాణి చెయ్యి పట్టుకున్నా. ఆస్కార్ పట్టుకున్న వెంటనే భారతీయ కీర్తి పతాకాన్ని పట్టుకున్నాననే భావన కలిగింది. ఆస్కార్ అందుకోవడం నా జన్మలో చేసుకున్న అదృష్టం. కీరవాణితో నాది 28 ఏళ్ల అనుబంధం. బాహుబలిలో నాకు అవకాశం రాకున్నా.. ఆర్ఆర్ఆర్‌లో వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనుకుని సహనంతో ఉండి ఈ పాట రాయడానికి దాదాపు 17 నెలలు పట్టింది.' అని అన్నారు.
సంగీత దర్శకుడు ఎంఎం. కీరవాణి మాట్లాడుతూ:.. ఆర్ఆర్ఆర్ సినిమాకి ఆస్కార్ అవార్డు రావడం వెనుక మూల విగ్రహాలు రాజమౌళి, ప్రేమ్ రక్షిత్. నేను చంద్రబోస్ ఉత్సవ విగ్రహాలు మాత్రమే. తెలుగు సినీ పరిశ్రమ ఈరోజు ఒక్కచోట చేరి ఇలా పండుగ చేసుకోవడం సంతోషంగా ఉంది. నా మొట్ట మొదటి పాట చేసింది చెన్నైలోని ప్రసాద్ ల్యాబ్స్. అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానం ఉన్న థియేటర్ అది. కొత్త మ్యూజిక్ డైరెక్టర్ అయిన నాకు కృష్ణంరాజు సూర్యనారాయణ రాజు ఇచ్చారు. ఆస్కార్ వల్ల నేను ఎక్సయిటింగ్ అవ్వలేదు. నిజంగా ప్రతిష్టాత్మకమైన అవార్డ్. ఈ పాటకు అందరూ ఎంతో కష్టపడి చేశారు. ఈ సినిమా కోసం ఆస్కార్ మెంబర్స్‌కి షోస్ వేసి చూపించాం. వాళ్లకు నచ్చింది. అందరూ సమిష్టిగా చేసిన కృషికి లభించిన విజయానికి మీరందరు వేడుక చేయడం సంతోషంగా ఉంది.' అని అన్నారు.
మంత్రి తలసాని మాట్లాడుతూ..' ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు సాంగ్‌కు ఆస్కార్ అవార్డు రావటం తెలుగు ప్రజలందరికీ గర్వకారణం. బాహుబలి సినిమాతో టాలీవుడ్ విశ్వ వ్యాప్తంగా విస్తరించింది. ఆ సినిమాకు కూడా ఆస్కార్ అవార్డ్స్ రావాల్సింది. ఆర్ఆర్ఆర్ సినిమాకు వచ్చింది. తెలుగు చలన చిత్ర పరిశ్రమకు అన్ని విధాలుగా సీఎం కేసీఆర్, ప్రభుత్వం సహకారం అందించింది. ఈ మధ్య పాన్ ఇండియా సినిమాలు తెలుగులోనూ వస్తున్నాయి. లక్షలాది మందికి అన్నం పెడుతున్న పరిశ్రమ తెలుగు సినిమా. పరిశ్రమకు ఎప్పుడు సహాయం చేయడానికి ముందుంటాం.' అని అన్నారు.
మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. ' ఈరోజు ఆస్కార్ అవార్డు రావడం సినిమా ఇండస్ట్రీకి గర్వకారణం. తెలంగాణ వస్తే సినీ పరిశ్రమ వస్తే ఏమౌతుందోనని అనుకున్నారు. ఉద్యమ సమయంలో కూడా మా పోరాటం పాలకుల మీద కానీ ప్రజల మీదకు కాదని కేసీఆర్ చెప్పారు. తెలంగాణ భాషను యాసను సినిమాల్లో అవమానించేవారు అని మేము బాధ పడేటోళ్లం. కానీ ఈరోజు గర్వపడుతున్నాం. రెండు రాష్ట్రాలు కలిసి ఉండాలినేదే మా ధ్యేయం. తెలంగాణలో అద్భుతమైన లొకేషన్స్ ఉన్నాయి. అక్కడ షూటింగ్స్ జరుపుకోవడానికి మేము సహకరిస్తాం. సినీ పరిశ్రమకు తెలంగాణ ప్రభుత్వం తరపున అన్ని విధాల సహాయ సహకారాలు ఉంటాయి.' అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment