సూపర్ స్టార్ కృష్ణ మరణంపై ఇండస్ట్రీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ పరుచూరి గోపాలకృష్ణ ఎమోషనలయ్యాడు. కృష్ణ తనకు చేసిన సాయాన్ని ఎన్నటికీ మరువలేనంటూ భావోద్వేగానికి లోనయ్యాడు. కృష్ణ గురించి ఆయన మాట్లాడుతూ.. 'బంగారు భూమి సినిమాలో నాలుగైదు సీన్లకు డైలాగ్ రైటర్స్‌గా పని చేశాం. పీసీ రెడ్డి గారు సినిమా ఆరంభంలో పేరు వేయించుకోమన్నారు. కానీ ఆ సినిమాకు పెద్ద రచయితలు పని చేశారు, వారి పక్కన మా పేరెందుకని వద్దన్నాను.
ఇందులో ఒక డైలాగ్ ఉంటుంది. 'పద్మ.. మనిషిని నమ్మితే మన నోట్లో ఇంత మట్టి కొడతాడు. మట్టిని నమ్మితే మన నోటికింత ముద్ద పెడుతుంది. ఆ మట్టికి నమస్కారం చేయి..' ఈ డైలాగ్ కృష్ణగారికి బాగా నచ్చింది, వెంటనే ఎవరు రాశారని అడగడంతో అది నేనే అని పీసీరెడ్డి చెప్పారు. నేను ఇండస్ట్రీలో పెద్దవాడిని అవుతానని ఆయన జోస్యం పలికారు. ఇండస్ట్రీలో ఆయన ఎంతోమందికి సాయం చేశారు. నాకు సినిమాలు లేని సమయంలో ఇల్లు కట్టుకోవడానికి ఆయన డబ్బులు పంపించారు. అది తీసుకున్న మరుసటి రోజే కొబ్బరికాయ కొట్టి ఇల్లు కట్టాను. అందరికంటే ఎక్కువగా కృష్ణగారి 54 సినిమాలకు మా కలం ఉపయోగపడింది. ఆయన బంగారు మనసు మహేశ్‌బాబుకు వచ్చింది' అని చెప్పుకొచ్చాడు పరుచూరి గోపాలకృష్ణ.
Comments
Please login to add a commentAdd a comment