సాక్షి, అమరావతి: కరోనా వైరస్ సెకండ్ వేవ్ ప్రమాదం పొంచి ఉందన్న వైద్యారోగ్య నిపుణుల హెచ్చరికల నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ విజ్ఞప్తి చేశారు. ప్రపంచమంతా కోవిడ్-19 నిరోధక వ్యాక్సిన్ కోసం ఎంతగానో ఎదురు చూస్తోందని, టీకా వచ్చేదాకా నివారణ చర్యలు పాటిస్తూ ముందుకు సాగడమే ఉత్తమని పేర్కొన్నారు. కాగా మెగాస్టార్ చిరంజీవికి కరోనా సోకిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై స్పందించిన పవన్ కల్యాణ్.. అన్నయ్య చిరంజీవి కరోనా బారినపడటంతో తామంతా విస్తుపోయామన్నారు. ‘‘లాక్‌డౌన్ ప్రకటించినప్పటి నుంచి అన్నయ్య ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారు.
అంతేకాదు.. ప్రతి ఒక్కరిలో చైతన్యం కలిగించేలా సామాజిక బాధ్యతగా పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. ప్రజారోగ్యంపై ఎంతో అవగాహన ఉన్న చిరంజీవి గారు తన ఆరోగ్యం పట్లా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. కానీ ఆయన కూడా మహమ్మారి బారిన పడ్డారు. ఎలాంటి లక్షణాలు కనిపించలేదు. పరీక్షల్లో మాత్రం పాజిటివ్ అని తేలింది’’ అని పేర్కొన్నారు. అన్నయ్య సత్వరమే కోలుకోవాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానని, అదే విధంగా కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని పవన్ విజ్ఞప్తి చేశారు.(చదవండి: చిరంజీవికి కరోనా పాజిటివ్)
Comments
Please login to add a commentAdd a comment