టైటిల్: ‘పెదకాపు 1’
నటీనటులు: విరాట్ కర్ణ, ప్రగతి శ్రీవాస్తవ, అనసూయ, శ్రీకాంత్ అడ్డాల తదితరులు
నిర్మాణ సంస్థ: ద్వారక క్రియేషన్స్
నిర్మాత: మిర్యాల రవీందర్ రెడ్డి
దర్శకత్వం: శ్రీకాంత్ అడ్డాల
సంగీతం: మిక్కీ జే మేయర్
సినిమాటోగ్రఫీ: చోటా కె. నాయుడు
విడుదల తేది: సెప్టెంబర్ 29, 2023
ఫ్యామిలీ సినిమాలకు పెట్టింది పేరు శ్రీకాంత్ అడ్డాల. అయితే నారప్ప నుంచి తన స్టైల్ మార్చాడు. అది అనుసర్ మూవీకి తెలుగు రీమేకే అయినా.. మేకింగ్ పరంగా తనలో కొత్త యాంగిల్ చూపించాడు. ఇక ఇప్పుడు అదే జానర్‌లో ‘పెదకాపు-1’ అనే సినిమా చేశాడు. హీరోహీరోయిన్లు ఇద్దరిని కొత్తవాళ్లను పెట్టి, రాజకీయ నేపథ్యంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సినిమాపై ఆసక్తిని పెంచింది. దానికి తోడు మూవీ ప్రమోషన్స్ కూడా గ్రాండ్‌గా నిర్వహించడంతో ‘పెదకాపు’పై హైప్ క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య నేడు(సెప్టెంబర్ 29) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.
‘పెదకాపు 1’ కథేంటంటే..
1962లో గోదావరి జిల్లాలో అల్లరు చెలరేగడంతో చుట్టు పక్కల గ్రామాల ప్రజలంతా భయంతో ఉన్న ఊరిని వదిలి వెళ్లిపోతుంటారు. అలా వెళ్తున్న క్రమంలో ఓ పొలం వద్ద అప్పుడే పుట్టిన బిడ్డ కనిపిస్తుంది. ఎవరో పడేసి వెళ్లిన ఆ ఆడబిడ్డను ఓ అనామకురాలు చూసి.. ఆ బిడ్డని ఎవరికైనా అమ్మేసి రమ్మని కూతురు గౌరీకి చెబుతుంది. ఆమె ఆ పాపను ఓ చాటలో తీసుకొని.. లంక గ్రామంలోని మాస్టర్(తనికెళ్ల భరణి)కి అమ్మెస్తుంది.
కట్ చేస్తే.. అది 1982 మార్చి 29. రాష్ట్రంలో అప్పుడే ఓ కొత్త పార్టీ ఆవిర్భవించింది. దీంతో లంకలోని యువత ఆ పార్టీ కోసం పనిచేసేందుకు రెడీ అవుతోంది. అయితే ఆ గ్రామంపై పెత్తనం కోసం ఓ వర్గానికి చెందిన సత్యరంగయ్య(రావు రమేశ్), బయ్యన్న(నరేన్) పోటీ పడుతుంటారు. హింసని ప్రేరేపిస్తూ.. తమ స్వార్థం కోసం జనాల ప్రాణాలతో చలగాటం ఆడుతుంటారు. అదే గ్రామానికి చెందిన పెదకాపు(విరాట్ కర్ణ) (పది మందికి సాయం చేస్తూ, ఆపదొస్తే అండగా ఉండేవాణ్ని అప్పట్లో పెదకాపుగా పిలిచేవారు) తన అన్నయ్యతో కలిసి సత్య రంగయ్య వద్ద పనిచేస్తుంటాడు.
ఓ సారి సత్యరంగయ్య చేసిన హత్య కేసులో. ఆయన తరపున పెదకాపు అన్నయ్య జైలుకు వెళ్తాడు. పోలీసులు అదుపు ఉండాల్సిన ఆయన.. కనిపించకుండా పోతాడు. అసలు పెదకాపు అన్నయ్య ఏమయ్యాడు? పొలంలో పడేసిపోయిన ఆ ఆడబిడ్డ ఎవరు? ఆమెను పడేసి వెళ్లిందెవరు? స్వార్థ రాజకీయాల కోసం సామాన్యుల ప్రాణాలతో చలగాటం ఆడుతున్న బయ్యన్న, సత్యరంగయ్యను పెదకాపు ఎలా ఎదిరించాడు? ఈ క్రమంలో అతనికి ఎదురైన సమస్యలేంటి? కొత్తగా వచ్చి పార్టీ.. ఎమ్మెల్యే టికెట్ ఎవరికి ఇచ్చింది? ఈ కథలో కన్నబాబు(శ్రీకాంత్ అడ్డాల), అక్కమ్మ(అనసూయ)ల పాత్ర ఏంటి? అనేది తెలియాలంటే ‘పెదకాపు 1’ సినిమా చూడాల్సిందే.
ఎలా ఉందంటే..
‘సామాన్యుడిగా ఓ మనిషి ఎప్పుడు దుఃఖం నుంచి సుఖంలోకి.. చీకటి నుంచి వెలుగులోకి రావాలని అనుకుంటాడు. ఎదగాలని తపన పడతాడు. అప్పుడు అలా ఎదగాలి అనుకునేవాడికి, ఎదగనివ్వనోడికి, తన దారిన తాను పోయేవాడికి, ఆ దారి మూసేసి తోక్కేయ్యాలనుకునే వాడికి మధ్య యుద్ధం తప్పదు’ అంటూ సినిమా ప్రారంభంలోనే ఓ నోట్ కార్డు వేసి సినిమా ఎలా ఉండబోతుందో క్లారిటీ ఇచ్చాడు దర్శకుడు. అయితే అంతే క్లారిటీగా కథను నడిపించడంలో మాత్రం విఫలమయ్యాడు. కథను ఒక్కలా ప్రారంభించి..మధ్యలో మరోలా చూపించి.. చివరకు రాజకీయంతో ముగింపు పలికాడు. ఒకే కథలో రకారకాల ఎమోషన్స్ చూపించి.. ఆడియన్స్‌ని ఏ ఎమోషన్స్‌కి కనెక్ట్ కాకుండా గందరగోళంతో బయటకు వచ్చేలా చేశాడు.
ఓ పసిపాపని పొలంలో పడేసి వెళ్లె సీన్‌తో కథ ఆసక్తికరంగా ప్రారంభం అవుతుంది. అసలు ఆడబిడ్డ ఎవరు? ఆమె నేపథ్యం ఏంటి? కథలో ఆమె కీలక పాత్ర కావొచ్చుననే కుతుహాలం ప్రేక్షకుల్లో కలిగే లోపు.. కథను రాజకీయాల్లోకి తీసుకెళ్లాడు. అక్కడ పెదకాపుని పరిచయం చేశాడు. ఆ తర్వాత బయ్యన్న, సత్యరంగయ్య పాత్రలను రంగంలోకి దించాడు. కొత్త పార్టీకి వారిని ముడిపెడుతూ.. కాసేపు రాజకీయం, ఆదిపత్య పోరుని చూపించాడు.
పోని అదైనా పూర్తిగా చూపిస్తాడనుకుంటే అంటే.. వెంటనే కట్ చేసి బ్రదర్ సెంటిమెంట్‌ని తెరపైకి తెచ్చాడు. అక్కడితో ఆగకుండా అక్కమ్మ పాత్రని రంగంలోకి దించాడు. గౌరి పాత్రను చంపేసి ప్రేక్షకుల ఆలోచనను అక్కమ్మ పాత్రపైకి మలిచాడు. ఆ తర్వాత మళ్లీ ఆదిపత్య పోరు..రాజకీయాల వైపు వెళ్లాడు. ఇలా కథను ఆసక్తిగా ఎత్తుకోవడం వెంటనే దించేసి..మరో పాయింట్‌ని చూపించడంతో కథ ఎటువైపు వెళ్తుందో అర్థంకాక.. ఎవరి ఎమోషన్‌కి కనెక్ట్ కాలేక..ఆడియన్స్ గందరగోళానికి గురవుతారు.
ఈ కథలో కీలకం అని చెప్పిన పెదకాపు పాత్రనే సరిగా తీర్చిదిద్దలేదనిపిస్తుంది. పెదకాపుగా ఎంట్రీ సీన్‌లోనే హీరో ఓ పెద్ద చెట్టుని నరికి కొత్త పార్టీ జెండా ఎత్తేందుకు ప్రయత్నిస్తాడు. అడ్డుగా వచ్చిన బయ్యన్న మనుషులను కత్తులతో నరికి మరీ ఊర్లో జెండా ఎగరేస్తాడు. ఆ సీన్ చూడగానే పెదకాపు సామాన్యుడు ఎలా అవుతాడనే ఫీలింగ్ కలుగుతుంది. అలాగే ఓ కీలక వ్యక్తిని నరికి చంపేంత ధైర్యం ఉన్నోడు..అతన్ని ఇబ్బంది పెడుతున్న వ్యక్తిని ఎలా వదిలేస్తాడు? ఒక చోట భయపడుతూ.. మరో చోట ధైర్యంగా ఉంటూ.. చాలా విచిత్రంగా ఆ పాత్ర ప్రవర్తిస్తుంది.
అలాగే హీరోయిన్ పాత్ర ప్రవర్తన కూడా కాస్త తేడాగానే అనిపిస్తుంది. పసిపాపను ఎందుకు పొలంలో వదిలేసి వచ్చారనే రీజన్ కూడా కన్విన్సింగ్‌గా అనిపించదు. కొన్ని సన్నివేశాల్లో సహజత్వం కొరవడుతుంది. కొన్ని విషయాల్లో మాత్రం దర్శకుడు సఫలం అయ్యాడు. ప్రేక్షకులను 1980 నాటి కాలంలోకి తీసుకెళ్లాడు. అప్పటి గ్రామాల్లోని పరిస్థితి, రాజకీయ పరిణామాలను చక్కగా ఆవిష్కరించాడు. ఇంటర్వెల్ సీన్ అదిరిపోతుంది. కొన్ని పాత్రలను సగం సగంగానే పరిచయం చేసి పార్ట్ 2లో ఇంకా ఏదో ఉందనేలా చూపించే ప్రయత్నం చేశాడు.
ఎవరెలా చేశారంటే..
హీరో విరాట్ కర్ణకి తొలి సినిమా ఇది. అయినా అది తెరపై కనిపించదు. చాలా సహజంగా నటించాడు. యాక్షన్స్ సీన్స్ ఇరగదీశాడు. హీరోయిన్ ప్రగతి పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేదు. అయినా ఉన్నంతలో చక్కగా నటించింది. సత్యరంగయ్య పాత్రలో రావు రమేశ్ ఒదిగిపోయాడు. ఓ రకమైన మేజరిజంతో విలనిజాన్ని బాగా పండించాడు. బయన్న పాత్రలో నరేన్ కూడా తన పరిధిమేర చక్కగా నటించాడు.
కన్నబాబు పాత్రలో శ్రీకాంత్ అడ్డాల నిజంగానే సర్‌ప్రైజ్ చేశాడు. కూర్చున్న చోట నుంచే అన్ని నడిపించే విలన్ పాత్ర తనది. అక్కమ్మగా చేసిన అనసూయ చాలా కీలకమైన పాత్ర చేసింది. పార్ట్ 2లో ఆమె పాత్ర మరింత కీలకం కానున్నట్లు సినిమా చూస్తే అర్థమవుతుంది. పెదకాపు తల్లిదండ్రులుగా ఈశ్వరిరావు, రాజీవ్ కనకాల తెరపై మరోసారి తమ అనుభవాన్ని చూపించారు. తాగుడుకు బానిసైన మాస్టర్‌గా తనికెళ్ల భరణి తన పాత్ర పరిధిమేర చక్కగా నటించాడు. శ్రీనివాస్ వడ్లమాని, నాగబాబుతో మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు.
ఇక సాంకేతిక విషయాలకొస్తే.. మిక్కీ జే మేయర్ నేపథ్య సంగీతం బాగుంది. పాటలు పర్వాలేదు. ఛోటా కె. నాయుడు సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది. తెరపై అనాటి గోదావరి జిల్లాను చూపించాడు. విజువల్స్ పరంగా సినిమా చాలా బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి.
-అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్
Comments
Please login to add a commentAdd a comment