Ponniyin Selvan 1 Movie Review And Rating In Telugu | Vikram | Karthi - Sakshi

PS-1 Movie Review: పొన్నియన్‌ సెల్వన్‌ మూవీ రివ్యూ

Sep 30 2022 1:08 PM | Updated on Sep 30 2022 3:04 PM

Ponniyin selvan 1 Movie Review And Rating In Telugu - Sakshi

పొన్నియన్‌ సెల్వన్‌ సినిమా ఎలా ఉందంటే..

టైటిల్‌: పొన్నియన్‌ సెల్వన్‌-1
నటీనటులు: చియాన్‌ విక్రమ్‌, కార్తి, జయం రవి, త్రిష, ఐశ్వర్య రాయ్, ప్రకాశ్ రాజ్, పార్థిబన్, ఐశ్వర్య, ప్రభు, శరత్ కుమార్, విక్రమ్ ప్రభు, జయరాం తదితరులు
నిర్మాణ సంస్థలు: లైకా ప్రొడక్షన్స్, మద్రాస్‌ టాకీస్‌
దర్శకత్వం : మణిరత్నం
సంగీతం: ఏఆర్‌ రెహమాన్‌ 
సినిమాటోగ్రఫీ: రవి వర్మన్ 
విడుదల తేది: సెప్టెంబర్‌ 30, 2022

లెజెండరీ ఫిల్మ్ మేకర్ మణిరత్నం ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన హిస్టారికల్ మూవీ ‘పొన్నియన్ సెల్వన్’. కల్కి కృష్ణ మూర్తి రాసిన ‘పొన్నియన్ సెల్వన్’ నవల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాని రెండు భాగాలుగా రిలీజ్ చేస్తున్నారు. అందులో మొదటి భాగం PS-1 నేడు(సెప్టెంబర్‌ 30) విడుదలైంది. నాలుగేళ్ల విరామం తర్వాత మణిరత్నం చేసిన సినిమా... అందులోను ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ కావడంతో పొన్నియన్ సెల్వన్‌ భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దానికి తోడు ఇటీవల విడుదలైన టీజర్‌, ట్రైలర్‌ సినిమాపై హైప్‌ క్రియేట్‌ చేశాయి. భారీ అంచనాల మధ్య నేడు విడుదలైన ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఏ మేరకు ఆదరించారో రివ్యూలో చూద్దాం. 

పొన్నియన్‌ సెల్వన్‌ కథేంటంటే?
పొన్నియన్‌ సెల్వన్‌ కథంతా పదో శతాబ్దంలో జరుగుతుంది. వేయి సంవత్సరాల క్రితం పరిపాలన సాగించిన చోళ రాజుల గొప్పదనం గురించి చెబుతూ కథ మొదలవుతుంది. చోళ సామ్రాజ్యపు అధినేత సుందర చోళుడు(ప్రకాశ్‌ రాజ్‌)కి ఇద్దరు కుమారులు, ఓ కూతురు. పెద్ద కుమారుడు ఆదిత్య కరికాలుడు(చియాన్‌ విక్రమ్‌) తంజావూరుకు దూరంగా ఉంటూ.. కనిపించిన రాజ్యానల్లా ఆక్రమిస్తూ వెళ్తుంటాడు. చిన్న కుమారుడు అరుళ్‌ మోళి అలియాస్‌ పొన్నియన్‌ సెల్వన్‌(జయం రవి) చోళ రాజ్యానికి రక్షకుడిగా ఉంటాడు. తండ్రి ఆజ్ఞతో శ్రీలంకలో ఉంటాడు.

తన తర్వాత వారసుడిగా  పెద్ద కుమారుడు ఆదిత్య కరికాలుడు (విక్రమ్)ను యువరాజుగా సుందర చోళుడు ప్రకటిస్తాడు. ఆ నిర్ణయానికి వ్యతిరేకంగా సామాంత రాజులను ఏకం చేస్తాడు కోశాధికారి పళవేట్టురాయర్‌(శరత్‌ కుమార్‌). సుందర చోళుడు అన్నయ్య కుమారుడు మధురాంతకుడు (రహమాన్) ను రాజును చేయాలనేది అతని కోరిక. రాజ్య ఆక్రమణ కోసం తెలిసినవాళ్లే కుట్ర చేస్తున్నారని గ్రహించి.. ఆ కుట్రను చేధించడానికి తన మిత్రుడు వల్లవరాయన్‌(కార్తి)ని తంజావురుకు పంపిస్తాడు ఆదిత్య కరికాలన్‌. కుట్ర విషయాన్ని వల్లవరాయన్‌ ఎలా కనిపెట్టాడు?  శ్రీలంకలో ఉన్న అరుళ్‌మోళిని వల్లవరాయన్‌ ఎలా రక్షించాడు? సొంతవాళ్లు పన్నిన కుట్రకు యువరాణి కుందవై(త్రిష) ఎలా చెక్‌ పెట్టింది? పళవేట్టురాయల్‌ భార్య నందిని(ఐశ్యర్య రాయ్‌) ఉన్నంత వరకు తంజావూరుకు రానని ఆదిత్య కరికాలుడు ఎందుకు చెబుతున్నాడు? అసలు నందిని, ఆదిత్యకు మధ్య ఏం జరిగింది? అనేదే మిగతా కథ. 

ఎలా ఉందంటే.. 
రాజ్యాలు.. యుద్దం.. కుట్రలు అనగానే అందరికి గుర్తుకొచ్చే సినిమా ‘బాహుబలి’. రాజుల పాలన ఎలా ఉంటుంది? అధికారం కోసం ఎలాంటి కుట్రలు చేస్తారు? తదితర విషయాలను కళ్లకు కట్టినట్లు చూపించాడు రాజమౌళి. అయితే అది కల్పిత కథ కాబట్టి అందరికి అర్థమయ్యేలా, కావాల్సిన కమర్షియల్‌ అంశాలను జోడించి ఆ చిత్రాన్ని తెరకెక్కించారు. కానీ చారిత్రాత్మక కథలకు ఆ వెసులుబాటు ఉండదు. కథలో మార్పులు చేస్తే చరిత్రకారులు విమర్శిస్తారు. అలా అని ఆసక్తికరంగా చూపించపోతే ప్రేక్షకులు మెచ్చరు. పొన్నియన్‌ సెల్వన్‌ విషయంలో అదే జరిగింది. మణిరత్నం చరిత్రకారులను మెప్పించాడు కానీ.. ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాడు.

కథలో విషయం ఉంది కానీ కన్‌ఫ్యూజన్స్‌ లేకుండా తెరపై చూపించడంలో దర్శకుడు విఫలమయ్యాడు. స్లోనెరేషన్‌ సినిమాకు పెద్ద మైనస్‌. కథ జరిగే ప్రాంతాలు మారుతాయి కానీ.. కథనం మాత్ర కదినట్లే అనిపించదు. చాలా పాత్రలు.. పెద్ద పెద్ద నటులు కనిపిస్తారు కానీ.. ఏ ఒక్క పాత్ర కూడా గుర్తుండిపోయేలా తీర్చిదిద్దలేదు. యాక్షన్‌ సీన్స్‌ కూడా అంతగా ఆకట్టుకోవు. ఏ పాత్ర కూడా ఎమోషనల్‌గా కనెక్ట్‌ కావు. నవల ఆధారంగా ఈ స్క్రిప్ట్‌ను రాసుకోవడం వల్ల..ట్విస్టులు, వావ్‌ ఎలిమెంట్స్‌ ఏవి ఉండవు.  విజువల్‌ ఎఫెక్ట్స్‌ కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి. క్లైమాక్స్‌లో మాత్రం ఓ చిన్న ట్విస్ట్‌ ఇచ్చి పార్ట్‌-2పై ఆసక్తి పెంచారు. మొత్తంగా ఈ చిత్రం తమిళ ప్రేక్షకులకు ,అది కూడా చరిత్రపై అవగాహన ఉన్నవారికి ఎంతో కొంతో నచ్చుతుంది. కానీ తెలుగు ప్రేక్షకులను మెప్పించడం కాస్త కష్టమే. 

ఎవరెలా నటించారంటే...
‘పొన్నియన్ సెల్వన్’ సినిమాకు మెయిన్ పిల్లర్ లాంటి పాత్ర వల్లవరాయన్‌. ఈ పాత్రలో కార్తి ఒదిగిపోయాడు. వల్లవరాయన్‌ సమయస్ఫూర్తి కలవాడు, చమత్కారి కూడా. సినిమాలో ఎక్కువ స్క్రీన్‌ స్పేస్‌ కార్తికే దక్కింది. ఆదిత్య కరికాలుడు పాత్రలో చియాన్‌ విక్రమ్‌ మెప్పించాడు. అయితే ఇతని పాత్ర నిడివి చాలా తక్కువనే చెప్పాలి. సినిమా ప్రారంభంలో ఒకసారి, మధ్యలో మరోసారి, ఇక క్లైమాక్స్‌లో ఇంకోసారి కనిపిస్తాడు.

అరుళ్‌మొళి వర్మన్ అలియాస్‌ పొన్నియన్‌ సెల్వన్‌ పాత్రలో జయం రవి ఒదిగిపోయాడు.. నందిని పాత్రకు వందశాతం న్యాయం చేసింది ఐశ్యర్యరాయ్‌. తన అందం, అభినయంతో ఎలాంటి మగవాడినైనా తన వశం చేసుకోగల పాత్ర తనది. అందుకు తగ్గట్టే తెరపై చాలా అందంగా కనిపించింది. రాజకుమారి కుందవైగా త్రిష తనదైన నటనతో ఆకట్టుకుంది. పళవేట్టురాయర్‌గా శరత్‌కుమార్ మరోసారి తెరపై తన అనుభవాన్ని చూపించాడు. సుందర చోళుడు పాత్రను ప్రకాశ్‌ రాజ్‌ అద్భుతంగా పోషించాడు. తంజావూరు కోటసేనాధిపతి చిన పళవేట్టురాయన్‌గా ఆర్‌.పార్తిబన్‌, పడవ నడిపే మహిళ పూంగుళలిగా ఐశ్యర్య లక్ష్మీతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఇక సాంకేతిక విషయానికొస్తే  ఏఆర్‌ రెహమాన్‌ నేపథ్య సంగీతం జస్ట్‌ ఓకే. వీఎఫ్‌ఎక్స్ వర్క్‌ అద్భుతం అని చెప్పలేం కానీ బాగుంది. సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లు ఉన్నతంగా ఉన్నాయి. 

-అంజి శెట్టి, సాక్షి వెబ్‌డెస్క్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement