గతేడాది లాక్‌డౌన్ వల్ల సినిమాలు లేకుండా ఎంతో ఖాళీగా ఉన్నారు హీరోలు. కానీ ఇప్పుడు వరుస షూటింగ్స్‌లో పాల్గొంటూ బిజీబిజీగా మారారు. 'బాహుబలి' ప్రభాస్ అయితే భారీ బడ్జెట్ సినిమాలు చేస్తూ క్షణం తీరిక లేకుండా ఉంటున్నారు. ప్రస్తుతం 'ఆదిపురుష్', 'సలార్' సినిమా చిత్రీకరణలో పాల్గొంటున్న ప్రభాస్ వీటి షూటింగ్ ముగిసే సమయానికి 'మహానటి' ఫేమ్ నాగ్ అశ్విన్ డైరెక్షన్‌లో నటించనున్నాడు. తర్వాత 'మాస్టర్' డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో నటించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఇదిలా వుంటే సోషల్ మీడియాలో ప్రభాస్ అరుదైన ఫొటో ఒకటి తెగ వైరల్ అవుతోంది. ఇందులో డార్లింగ్ హీరో మునీశ్వరుడి వేషం కట్టాడు. గతంలో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన 'యమదొంగ' చిత్రాన్ని విశ్వామిత్ర క్రియేషన్స్ పతాకంపై నిర్మించారు. ఈ బ్యానర్ లోగో కోసం విశ్రామిత్రుడి గెటప్ అవసరం కాగా దానికి ప్రభాస్ కరెక్ట్‌గా సెట్ అవుతారని అంతా అనుకున్నారు. ఇంకేముందీ.. ప్రభాస్‌ను వెంటనే విశ్వామిత్రుడిగా మార్చారు. ఆ ఫొటోనే ప్రస్తుతం నెట్టింట గింగిరాలు తిరుగుతోంది. ఇదిలా వుంటే రాజమౌళి ఈ బ్యానర్‌లో 'యమదొంగ' తర్వాత మరే చిత్రాన్ని నిర్మించలేదు. ప్రస్తుతం ఆయన రామ్‌చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా 'ఆర్‌ఆర్‌ఆర్' సినిమా తీస్తున్నాడు. ఈ సినిమా అక్టోబర్ 13న విడుదల కానుంది.
Comments
Please login to add a commentAdd a comment