Prithviraj Sukumaran Jana Gana Mana 2022 Movie Review And Rating In Telugu - Sakshi
Sakshi News home page

Jana Gana Mana 2022 Movie Review in Telugu: 'జన గణ మన' మూవీ రివ్యూ

Published Sun, Jun 5 2022 2:53 PM | Last Updated on Sun, Jun 5 2022 4:30 PM

Prithviraj Sukumaran Jana Gana Mana 2022 Review And Rating In Telugu - Sakshi

టైటిల్‌: జన గణ మన (2022)
నటీనటులు: పృథ్వీరాజ్‌ సుకుమారన్, సూరజ్‌ వెంజరమూడ్‌, మమతామోహన్‌ దాస్‌, జీఎమ్‌ సుందర్‌ తదితరులు
కథ: షరీస్‌ మహమ్మద్‌
దర్శకత్వం: డిజో జోస్‌ ఆంటోని
సంగీతం: జేక్స్‌ బిజోయ్‌
నిర్మాతలు:  పృథ్వీరాజ్‌ సుకుమారన్, లిస్టిన్‌ స్టీఫెన్‌
ఓటీటీ విడుదల తేది: జూన్‌ 2, 2022 (నెట్‌ఫ్లిక్స్‌)

విభిన్నమైన కథా కథనాలతో ఎప్పుడూ ప్రత్యేకంగా ఉంటుంది మలయాళ సినీ ఇండస్ట్రీ. అందులోనూ పృథ్వీరాజ్ సుకుమారన్‌ సినిమాల ఎంపికను మెచ్చుకోక తప్పదు. నటుడిగా అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌, డైరెక్టర్‌గా లూసీఫర్‌ తదితర చిత్రాలతో అలరించిన ఆయన తాజాగా 'జన గణ మన' సినిమాతో ప్రేక్షకులకు ముందుకు వచ్చాడు. నిజానికి ఈ సినిమా ఏప్రిల్‌ 28న విడుదలైనప్పటికీ ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్‌లో జూన్‌ 2 నుంచి స్ట్రీమింగ్‌ అవుతోంది. ఓటీటీలో సందడి చేస్తున్న ఈ సినిమా నెట్టింట ట్రెండింగ్‌గా మారింది. నెటిజన్స్‌ ప్రశంసలు కురిపిస్తున్న 'జన గణ మన' ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. 

కథ:
ఒక యూనివర్సిటీ ప్రొఫెసర్‌ సబా మరియం (మమతా మోహన్‌ దాస్‌)ను రేప్ చేసి శరీరాన్ని కాల్చి చంపేశారని మీడియాలో నేషనల్‌ హైడ్‌లైన్‌ అవుతుంది. తమ ప్రొఫెసర్‌కు న్యాయం చేయాలని నిరసనకు దిగుతారు ఆ యూనివర్సిటీ స్టూడెంట్స్‌. దీంతో ఆ కేసును చేధించమని ఏసీపీ సజ్జన్‌ కుమార్‌ (సూరజ్‌ వెంజరమూడ్‌)ను ఆదేశిస్తుంది ప్రభుత్వం. మరీ రంగంలోకి దిగిన ఆ ఏసీపీ ఏం చేశాడు ? ఆమెను హత్య చేయడానికి కారణమేంటి ? కారకులెవరు ? వారిని ఏ విధంగా శిక్షించాలని సమాజం కోరుకుంది ? తర్వాత ఏసీపీ ఎదుర్కొన్న పరిణామాలేమిటి ? కోర్టులో లాయర్‌ అరవింద్‌ స్వామినాథన్‌ (పృథ్వీరాజ్‌ సుకుమారన్‌) సంధించిన ప్రశ్నలు ఏంటి ? తదితర ఆసక్తికరమైన విషయాలేంటో తెలుసుకోవాలంటే కచ్చితంగా సినిమా చూడాల్సిందే. 

విశ్లేషణ:
సత్యమేవ జయతే.. సత్యానికి అబద్ధం ఎన్నిసార్లు అడ్డుగా నిలుచున్నా, చివరిగా కటిక చీకట్లో ఉన్న సత్యం వెలుగులోకి రాక తప్పదు అని 'జన గణ మన' సినిమా ద్వారా తెలియజేశారు. ఇది పేరుకు సినిమా అయినా ప్రస్తుతం సమాజంలో నెలకొన్న పరిస్థితులకు 2 గంటల 41 నిమిషాల నిదర్శనం. విద్య, న్యాయ, పోలీసు, మీడియా, రాజకీయ వ్యవస్థ ఇలా ప్రతీ అంశాన్ని తడిమారు. ఈ వ్యవస్థల ఉనికి, విశ్వసనీయతను సూటిగా ప్రశ్నించారు. సమాజంలో అవి ఎలాంటి పరిస్థితులో ఉన్నాయి, వర్ణ, కుల, మత, జాతి విబేధాలు ఏ స్థాయిలో ఉన్నాయో కళ్లకు కట్టినట్లు చూపించారు. ప్రభుత్వాలు తమ గెలుపు కోసం పరిస్థితులను ఎలా మార్చుకుంటాయి ? అందుకోసం ఏం చేస్తాయి? విద్యార్థులను ఏ విధంగా వాడుకుంటాయి? వంటి విషయాలను తెరపై చూపించి వాటన్నింటి గురించి ఆలోచింపజేసేలా సినిమా ఉంది. ఏది అబద్ధం, ఏది నిజం అనేది సమాజం ఎలా నిర్ణయిస్తుందో, ఏ దృక్కోణంతో ఆలోచిస్తుందో, ఎలా ప్రభావితమవుతుందో సమాజానికి చూపించారు.   

ఎవరెలా చేశారంటే ?
సమాజంలో నెలకొన్న పరిస్థితులు, ప్రతి ఒక్క అంశాన్ని ధైర్యంగా చూపించిన డైరెక్టర్‌ డిజో జోస్‌ ఆంటోనికి, ఈ సినిమా నిర్మించిన పృథ్వీరాజ్‌ సుకుమారన్‌కు హాట్సాఫ్‌ చెప్పాల్సిందే. కథ అందించిన షరీస్‌ మహమ్మద్‌కు, జేక్స్‌ బిజోయ్‌ సంగీతానికి ప్రశంసలు దక్కాల్సిందే. ఇక పృథ్వీరాజ్‌ సుకుమారన్‌, సూరజ్‌ వాళ్ల నటనతో అదరగొట్టారు. ఫస్టాఫ్‌లో సూరజ్‌ తనవైపు దృష్టిని ఆకర్షిస్తే, సెకండాఫ్‌లో పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ ప్రేక్షకులను నిజాలతో కట్టిపడేస్తాడు. ప్రొఫెసర్‌ సబా మరియంగా మమత మోహన్‌ దాస్‌ సెటిల్డ్‌ పర్ఫామెన్స్‌ ఇచ్చింది. కోర్టు సీన్‌లో వచ్చే సన్నివేశాలు, సినిమాలోని డైలాగ్‌లు హైలెట్‌గా నిలిచాయి. చివరిగా చెప్పాలంటే ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా మాత్రమే కాదు, సమాజానికి ఓ కనువిప్పు ఈ 'జన గణ మన'.
-సంజు (సాక్షి వెబ్‌డెస్క్‌)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement