బాలయ్య డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ తీయాలని ఉంది | Producer C Kalyan About Godse Movie | Sakshi
Sakshi News home page

Godse Movie: మంచి బహుమతి, అదేంటో త్వరలో చెప్తాను

Published Wed, Dec 8 2021 8:29 PM | Last Updated on Wed, Dec 8 2021 8:36 PM

Producer C Kalyan About Godse Movie - Sakshi

ఎన్ని జీవోలు వచ్చినా సరే ప్రేక్షకుడికి సినిమా కావాలని అఖండ నిరూపించింది. సినిమా అనేది చిన్న పరిశ్రమే కానీ ప్రభావం మాత్రం చాలా పెద్దగా ఉంటుంది అంటున్నారు ప్ర‌ముఖ నిర్మాత సి. క‌ళ్యాణ్‌. ప్ర‌స్తుతం ఆయ‌న నిర్మాణంలో స‌త్య‌దేవ్ హీరోగా గోపీ గణేష్‌ ద‌ర్శ‌క‌త్వంలో `గాడ్సే` సినిమా రూపొందుతుంది. డిసెంబ‌రు 9 సి. క‌ళ్యాణ్ పుట్టిన రోజు. ఈ సంద‌ర్భంగా మీడియాతో ముచ్చ‌టించారు. 

టికెట్ రేట్లను మరీ ఇంతగా తగ్గించడం విచారించాల్సిన విషయం. ఏదేమైనా ఈ సమస్య త్వరలోనే సమసిపోతుందని అనుకుంటున్నాను. మేం అంతా కలిసి మళ్లీ ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. ప్రస్తుతం ప్రభుత్వ నిర్ణయంతో ఎవ్వరూ సంతోషంగా లేరు. మిర్యాల రవీందర్ రెడ్డి కాబట్టి రిలీజ్ చేయగలిగారు. అంతంత పర్సంటేజీలు తగ్గించుకుని రిలీజ్ చేశారు. ఈ రేట్ల మీద ఎంజీలు వేసుకోలేకపోతోన్నారు. అదనపు షోలు లేవు. బాలయ్య బాబు తన స్టామినా మీద కొట్టుకుని వచ్చారు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా రిలీజ్ చేశారంటే నిర్మాతకు హ్యాట్సాఫ్.

ఆన్‌లైన్‌ టికెటింగ్ వ్యవస్థను తీసుకురావాలని మేమే అడిగాం. పారదర్శకత కోసం అడిగాం, కానీ  మీడియా వక్రీకరించింది. అసలు విషయం తెలుసుకుని వార్తలు రాసేవారి కన్నా.. కొత్తగా క్రియేట్ చేసి రాసేవారు ఎక్కువయ్యారు. అందుకే ఇలా ఇగోలు హర్ట్ అయి ఇంత వరకు వచ్చిందని అనుకుంటున్నాను. అదనపు షోలు, మిడ్ నైట్ షోలను ప్రభుత్వమే అలవాటు చేసింది. ఇప్పుడు అవన్నీ ఆలోచించడం వేస్ట్. మనకు కావాల్సింది పరిశ్రమకు మంచి జరగడం.

శేఖర్ కమ్ముల ఆనంద్ సినిమా మొదటగా మూడు థియేటర్లోనే విడుదలైంది. ఆ త‌ర్వాత హిట్ అయింది.  సినిమాలో స్టామినా ఉంటే ఇవన్నీ నథింగ్. ప్రభుత్వం మీద కామెంట్లు చేయడం కూడా అనవసరం. ఒకప్పుడు ఇలా ఉండేవాళ్లు కాదు. ఇంతకు ముందు సినిమా వాళ్లంతా మనవాళ్లే. కానీ ఎన్టీ రామారావు గారు పాలిటిక్స్‌లోకి రావడం, ఆ తరువాత సినిమా వాళ్లు కొందరు కాంగ్రెస్‌లోకి వెళ్లడంతో గ్రూపులు మొదలయ్యాయి.

చిరంజీవి సినిమా విడుదల విషయంలో ఓ సారి ఇలాంటి పరిస్థితి ఏర్పడింది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు కూడా టికెట్ రేట్లను తగ్గించారు. అయితే మేం వెళ్లి ఆయన్ను రిక్వెస్ట్ చేశాం. 

ప్రస్తుతం సినీ పరిశ్రమకి  ఒక తండ్రి ఇక్కడ ఉన్నారు.. మరో తండ్రి అక్కడ ఉన్నారు. ఏ కష్టం వచ్చినా ముందుగా ఈ తండ్రి వద్దకే వెళ్తున్నాం. సినిమా వాళ్లదంతా ఏ రోజు హడావిడి ఆ రోజుదే. ఇద్దరు సీఎంలను ఒకే చోటకు తీసుకొచ్చి సత్కరిద్దామని అనుకున్నాం. కానీ అది కుదర్లేదు. ముందుకు నడిపించే వ్యక్తి లేకుండాపోయారు.

పరిశ్రమ మీద ఎలాంటి రూల్స్ తెచ్చినా సినిమా వాళ్లు ముందుకు రారు. ఈ రోజు 39డి అనే కొత్త సెక్షన్ రాబోతోంది. అందరూ కలిసి రండి పోరాడుదామంటే ఎవ్వరూ రావడం లేదు. ఎవ్వరి డబ్బులు వారికి వచ్చేస్తున్నాయ్..ఎటొచ్చి నిర్మాతలకే కదా? నష్టం. కష్టం వచ్చినప్పుడే దాసరి గారు లేని లోటు తెలుస్తోందని అంటున్నారు.

ఒకప్పుడు నిర్మాతలు ఇలా ఉండేవారు కాదు. ఇప్పుడు మాత్రం హిట్ కాంబినేషన్‌కే డిమాండ్ ఉంది.  ఇప్పుడంతా ఫిగర్స్ గేమ్.

గాడ్సే సినిమా ఈ రోజు షూటింగ్ పూర్త‌య్యింది. అలాగే మా బ్యాన‌ర్‌లో రానా న‌టిస్తున్న 1945 సినిమాకి సంబంధించి వారంలో టీజర్, రెండు మూడు రోజుల్లో ఫస్ట్ లుక్ వస్తుంది. అది పీరియాడిక్ డ్రామా. సెన్సార్ పూర్తయింది. క్లీన్ యూ సర్టిఫికెట్ వచ్చింది.    

రూలర్ సినిమా అయ్యాకే బాలయ్య బాబుతో సినిమా చేయాలి. కానీ అంతలోనే సొంత ప్రొడక్షన్ కంపెనీలో అనిల్ రావిపూడి సినిమాను ఓకే చేశారు. ఆ తరువాత గోపీచంద్ మలినేని సినిమాను కూడా రెడీ చేశారు. ఈ మూడు కమిట్మెంట్లు ఉన్నాయి. 

ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్‌ను తీయాలని ఉంది. రామానుజాచార్య సినిమాను బాలయ్యతో తీయాలని ఉంది. ఆయన కూడా చేయాలనుకుంటున్నారు. బాలయ్య గారు ఎప్పుడంటే అప్పుడు నేను రెడీ. నన్ను ఆయన సొంత మనిషిలా భావిస్తారు.. సొంత ప్రొడక్షన్‌లానే అనుకుంటారు. ఆయన ఎప్పుడు ఓకే అంటే అప్పుడే సినిమాను తీస్తాను.

గాడ్సే సినిమాను జనవరి 26న ప్లాన్ చేస్తున్నాం. మళ్లీ అదే దర్శకుడు గోపీ గణేష్‌తో ఓ భారీ ప్రాజెక్ట్ ఉంటుంది. ఇక నా హీరో సత్యదేవ్‌తోనూ ఇంకో సినిమా చేస్తాను. గాడ్సే తరువాత సత్యదేవ్‌కు చాలా మంచి పేరు వస్తుంది. సినిమా చూశాను. మంచి సినిమాకు నిర్మాతగా ఉన్నందుకు ఎంతో గర్వంగా ఫీలవుతున్నాను. అందరినీ మేల్కొలిపే చిత్రం. ఇందులో అందరి సమస్యలు చూపిస్తాం. అమ్మనాన్నలు కష్టపడి చదివిస్తే.. చదువుకుని ఏదో చేద్దామని అనుకుని ఏం చేయకుండా స్ట్రగుల్ అయ్యే ప్రతీ ఒక్కడి సమస్య. ప్రభుత్వాలు ఎలా ఆడుకుంటున్నాయ్..నిరుద్యోగం ఏంటి? ప్రభుత్వాలను ప్రశ్నించే పాయింట్ మీద వస్తుంది. దర్శకుడు ఎంత అద్భుతంగా డైరెక్ట్ చేశాడో.. హీరో అంత అద్భుతంగా చేశాడు. ఇద్ద‌రికీ మంచి పేరు వస్తుంది. గాడ్సే క్యారెక్టర్ కొత్త‌గా ఉంటుంది.

తమిళనాడు నాకు ఓ మంచి బహుమతి ఇచ్చింది. ఆ గిఫ్ట్ మీ అందరితో పంచుకుంటాను. అసిస్టెంట్ డైరెక్టర్‌గా వచ్చిన కళ్యాణ్ ఏం చేయబోతున్నాడో చూపిస్తాను అంటూ ఆ గిఫ్ట్‌ ఏంటో చెప్పకుండా సస్పెన్స్‌లో ఉంచాడు నిర్మాత కళ్యాణ్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement