టైటిల్: గాడ్సే
నటీనటులు: సత్యదేవ్, ఐశ్వర్య లక్ష‍్మి, జియా ఖాన్, షిజు అబ్దుల్ రషీద్, బ్రహ్మాజీ, నోయెల్ తదితరులు
స్వరాలు (రెండు పాటలు): సునీల్ కశ్యప్
సంగీతం: శాండీ అద్దంకి
నిర్మాత: సి. కల్యాణ్
కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం: గోపీ గణేష్ పట్టాభి
సినిమాటోగ్రఫీ: సురేష్ సారంగం
విడుదల తేది: జూన్ 17, 2022
విభిన్న కథా చిత్రాలతో అలరించే యంగ్ హీరోల్లో సత్యదేవ్ ఒకరు. డిఫరెంట్ రోల్స్ చేస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న సత్యదేవ్ తాజాగా 'గాడ్సే'గా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. గతంలో సత్యదేవ్‌తో 'బ్లఫ్ మాస్టర్' సినిమా తెరకెక్కించిన గోపీ గణేష్ పట్టాభి ఈ మూవీకి దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో హీరోయిన్‌గా మలయాళ బ్యూటీ ఐశ్వర్య లక్ష్మి నటించింది. సీకే స్క్రీన్స్ బ్యానర్‌పై సి. కల్యాణ్ నిర్మించిన 'గాడ్సే' శుక్రవారం అంటే జూన్ 17న విడుదల అయింది. సామాజిక అంశాలు, వ్యవస్థ తీరు వంటి తదితర విషయాలు కథాంశంగా తెరకెక్కిన 'గాడ్సే' ప్రేక్షకులను ఏ విధంగా అలరించాడో రివ్యూలో చూద్దాం.
కథ:
పోలీసు అధికారులు, మంత్రులు, బినామీలతోపాటు కొందరు రాజకీయ, పారిశ్రామిక ప్రముఖులు వరుసగా కిడ్నాప్ అవుతుంటారు. ఈ విషయం ప్రజలకు తెలిస్తే ఆందోళనకు గురవుతారని, ఇతర సమస్యలు ఏర్పడతాయని ప్రభుత్వం రహస్యంగా హ్యాండిల్ చేస్తుంది. ఈ కేసును వీలైనంత త్వరగా పరిష్కరించాలని ఒక పోలీసు బృందాన్ని ఆదేశిస్తుంది. ఆ టీమ్‌లో ఏఎస్పీ వైశాలి (ఐశ్వర్య లక్ష్మి) ఉంటుంది. వీళ్లందరని రాష్ట్రానికి వచ్చిన వ్యాపారవేత్త విశ్వనాథ్ రామచంద్ర (సత్యదేవ్) కిడ్నాప్ చేశాడని తెలుసుకుంటుంది. వారందరినీ విశ్వనాథ్ రామచంద్ర ఎందుకు కిడ్నాప్ చేశాడు ? అతను ఏం చెప్పాలనుకున్నాడు ? బిజినెస్‌మేన్ కిడ్నాపర్ గాడ్సేగా ఎందుకు మారాడు? అనే తదితర విషయాలు సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.
విశ్లేషణ:
రాజకీయ నాయకులు చేసే అవినీతి, డొల్ల కంపెనీలు, షెల్ కంపెనీలు, వేలమంది గ్రాడ్యుయేట్స్‌కు ఉద్యోగాలు వంటి విషయాలను సినిమాలో చూపించారు దర్శకుడు. సినిమా కాన్సెప్ట్ నిజానికి బాగుంది. కానీ ఆ కథను వెండితెరపై ఆసక్తికరంగా తెరకెక్కించడంలో డైరెక్టర్ ఫెయిల్ అయినట్లే అని చెప్పుకోవచ్చు. కిడ్నాప్ ఎందుకు చేశారో చెప్పేది కొంతవరకు బాగున్నా తర్వాత ఆసక్తిగా ముందుకు తీసుకువెళ్లలేకపోయారు. అంతా ఎక్స్‌పెక్టెడ్ సీన్లతో బోరింగ్‌గా ఉంటుంది. ఫ్లాష్‌బ్యాక్‌లో వచ్చే ఎమోషనల్ సన్నివేశాలు అంతగా కనెక్ట్ కాలేదనే చెప్పొచ్చు. కానీ చివరిలో వచ్చే క్లైమాక్స్ మాత్రం సినిమాకు హైలెట్‌గా నిలిచింది. సత్యదేవ్ చెప్పే ఒక్కో డైలాగ్ అందరనీ ఆలోచింపజేసేలా ఉంటాయి.
ఎవరెలా చేశారంటే ?
సత్యదేవ్ ఇప్పటికే మంచి నటుడిగా నిరూపించుకున్నాడు. ఈ సినిమాలో కూడా ఆయన నటన ఇంటెన్సివ్‌గా ఉండి అందరినీ కట్టిపడేస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే సినిమా మొత్తాన్ని తన ఒంటిచేత్తో నడిపించాడు. ఆయన చెప్పే ఒక్కో డైలాగ్ క్లాప్ కొట్టించేలా ఉంది. ఇక పోలీసు అధికారి పాత్రలో మలయాళ ముద్దుగుమ్మ ఐశ్వర్య లక్ష‍్మి చక్కగా నటించింది. ఇది ఆమెకు తొలి తెలుగు చిత్రం. పోలీసు పాత్రకు తగిన ఆహార్యం, డ్రెస్సింగ్ స్టైల్, యాక్టింగ్ సరిగ్గా సరిపోయేలా ఉన్నాయి. ఇక షిజు అబ్దుల్ రషీద్, బ్రహ్మాజీ, జియా ఖాన్, పృథ్వీరాజ్, నోయెల్, చైతన్య కృష్ణ, తనికెళ్ల భరణి, నాగబాబు, ప్రియదర్శి తమ పాత్రల పరిధి మేర నటించారు. చివరిగా చెప్పాలంటే మరోసారి వృథా అయిన సత్యదేవ్ యాక్టింగ్ కోసం తప్పకుండా చూడొచ్చు.
-సంజు (సాక్షి వెబ్‌డెస్క్)
Comments
Please login to add a commentAdd a comment