‘‘ఆస్కార్ అనేది అమెరికన్ అవార్డు. కాబట్టి అక్కడి డిస్ట్రిబ్యూషన్ సపోర్ట్ ఉన్న భారతీయ సినిమాలను నామినేషన్స్ కోసం పంపితే అవార్డులు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది’’ అని బాలీవుడ్ నిర్మాత గునీత్ మోంగా అన్నారు. ‘పీరియడ్: ఎండ్ ఆఫ్ సెంటెన్స్, ది ఎలిఫెంట్ విస్పరర్స్’ చిత్రాలకు నిర్మాతగా ‘బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ సబ్జెక్ట్’ విభాగంలో రెండు ఆస్కార్ అవార్డులు అందుకున్నారు గునీత్ మోంగా.
కాగా ‘ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా’ (ఎఫ్‌ఎఫ్‌ఐ)కి సంబంధించిన జ్యూరీ ఎంపిక చేసిన చిత్రాలు ఆస్కార్ అవార్డు నామినేషన్‌కు వెళుతుంటాయి. కానీ అమెరికన్ డిస్ట్రిబ్యూషన్ సపోర్ట్ కూడా ఉన్న ఇండియన్ సినిమాలను ఉత్తమ విదేశీ చిత్రం విభాగానికి పంపితే ఆస్కార్ నామినేషన్ వచ్చే మార్గం సులువు అవుతుందని గునీత్ అంటున్నారు. ఈ విషయాలపై తాజాగా గునీత్ ఓ ఆంగ్ల మీడియాతో మాట్లాడారు.
‘‘ఆస్కార్ నామినేషన్ కోసం మనం ప్రయత్నం చేయవచ్చు. కానీ అది చాలా కష్టం. మన సినిమా ప్రచారానికి సమయం కేటాయించాలి. డబ్బు ఖర్చు పెట్టాలి. అక్కడి పబ్లిసిటీ మార్కెటర్స్‌ను నియమించుకోవాలి. ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’ సమయంలో నేను అక్కడ నెల రోజులకు పైగా ఉన్నాను. అక్కడి వ్యవస్థ చూసి నాకు ఆశ్చర్యం కలిగింది. షార్ట్‌లిస్ట్ అయిన తర్వాతి నుంచి నామినేషన్ దక్కించుకునే ప్రాసెస్ చాలా క్లిష్టతరంగా ఉంటుంది. మనతో పాటుగా ప్రపంచం అంతా ఆస్కార్ అవార్డు కోసం ఖర్చు పెడుతుంది... పోటీ పడుతుంది. మనం కూడా గట్టి పోటీ ఇవ్వాలంటే అక్కడి స్ట్రాంగ్ డిస్ట్రిబ్యూషన్ సపోర్ట్ ఉండాలి.
‘పీరియడ్: ఎండ్ ఆఫ్ సెంటెన్స్, ది ఎలిఫెంట్ విస్పరర్స్’ చిత్రాలకు నెట్‌ఫ్లిక్స్ సపోర్ట్ ఉంది. ఆస్కార్ నామినేషన్ దక్కించుకున్న షౌనక్ సేన్ డాక్యుమెంటరీ ‘ఆల్ దట్ బ్రీత్స్’కు హెచ్‌బీవో వంటి పెద్ద సంస్థ సపోర్ట్‌గా నిలిచింది. 2001లో ‘లగాన్’ సినిమాకు నామినేషన్ వచ్చిందంటే ఆ సినిమాకు సోనీ వంటి సంస్థ సపోర్ట్ ఉంది. ‘ఆర్‌ఆర్‌ఆర్’ టీమ్ చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. అందుకే యూఎస్ డిస్ట్రిబ్యూషన్ సపోర్ట్ ఉన్న సినిమాలను ఎఫ్‌ఎఫ్‌ఐ ఆస్కార్‌కు పంపితే అవార్డు వచ్చే చాన్సెస్ ఉంటాయి’’ అని పేర్కొన్నారు గునీత్ మోంగా.
ఇక 2025లో లాస్ ఏంజిల్స్‌లో మార్చిలో జరగనున్న 97వ ఆస్కార్ అవార్డ్స్‌లోని ఉత్తమ విదేశీ చిత్రం విభాగాపు నామినేషన్ కోసం ఇండియా నుంచి ‘లాపతా లేడీస్’ చిత్రాన్ని ఎఫ్‌ఎఫ్‌ఐ పంపిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే... గునీత్ మోంగా నిర్మించిన తాజా ‘ఆల్ ఉయ్ ఇమాజిన్ యాజ్ ఏ లైట్’ చిత్రం 77వ కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లోని ప్రతిష్టాత్మకమైన గ్రాండ్ ప్రీ అవార్డు గెల్చుకుంది. కానీ ఆస్కార్ నామినేషన్ ఎంట్రీ బరిలో ‘ఆల్ ఉయ్ ఇమాజిన్ యాజ్ ఏ లైట్’ చిత్రాన్ని ఎఫ్‌ఎఫ్‌ఐ పరిశీలించినప్పటికీ ఫైనల్‌గా ‘లాపతా లేడీస్’ చిత్రాన్ని ఎంపిక చేసింది.
Comments
Please login to add a commentAdd a comment