‘‘కరోనా పరిస్థితుల తర్వాత ప్రేక్షకులను థియేటర్స్‌కు రప్పించాలంటే సినిమాలో మంచి కంటెంట్ ఉంటేనే సాధ్యమౌతోంది. దీంతో థియేట్రికల్‌గా బాగుంటాయనుకునే కథలనే ఎంపిక చేసుకుంటున్నాం. ‘ది గర్ల్‌ఫ్రెండ్’ థియేట్రికల్ మూవీ. ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతుంది’’ అని అన్నారు నిర్మాత ధీరజ్ మొగిలినేని. రష్మికా మందన్నా లీడ్ రోల్‌లో, దీక్షిత్ శెట్టి మరో లీడ్ రోల్‌లో నటించిన చిత్రం ‘ది గర్ల్ ఫ్రెండ్’. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 7న తెలుగు, హిందీ భాషల్లో విడుదల కానుంది. తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ఈ నెల 14న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు.
ఈ సందర్భంగా శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో ధీరజ్ మొగిలినేని మాట్లాడుతూ– ‘‘రిస్క్ చేసినా ఫర్వాలేదు అనేంత బాగా ‘ది గర్ల్ ఫ్రెండ్’ సినిమా స్టోరీ నచ్చింది. ఈ చిత్రం హీరోయిన్ కోణంలో ఉంటుంది... అంతే. కన్నడ మార్కెట్ కోసం దీక్షిత్‌ను తీసుకోలేదు. అతను మంచి పెర్ఫార్మర్ అనే తీసుకున్నాం. రాహుల్ చేసిన గత సినిమాల గురించి మేం ఆలోచించలేదు. రాహుల్ రాసిన ఈ కథ నచ్చి, ఈ సినిమా చేశాం. పారితోషికం తీసుకోకుండానే రష్మిక ఈ సినిమా చేశారు. ఆ కృతజ్ఞతతో ఆమెకు రెట్టింపు పారితోషికం ఇస్తున్నాం.
ఇక ఈ చిత్రంలో అను ఇమ్మాన్యూయేల్ ప్రాధాన్యం ఉన్న అతిథి పాత్ర చేశారు. నిర్మాత విద్య, నేను సమష్టిగా నిర్ణయాలు తీసుకుంటాం. ఈ చిత్రాన్ని మేమే సొంతంగా రిలీజ్ చేస్తున్నాం. అల్లు అరవింద్‌గారు మాకు మంచి సపోర్ట్‌గా ఉంటారు’’ అని అన్నారు. మరో నిర్మాత విద్య కొప్పినీడి మాట్లాడుతూ– ‘‘కాలేజీ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ‘ది గర్ల్‌ఫ్రెండ్’ రెగ్యులర్ సినిమా కాదు. వాస్తవ సంఘటనల స్ఫూర్తితో ఈ సినిమా తీశాం.
దర్శకుడిగా రాహుల్‌కు జాతీయ అవార్డు రావొచ్చనే ప్రశంసలు సెన్సార్ వారి నుంచి వచ్చాయి. ఈ చిత్రంలోని నాలుగు పాటలు, రెండు బిట్ సాంగ్స్‌కి హేషమ్ మంచి మ్యూజిక్ ఇచ్చారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో నిర్మాతలు ఓ ప్రాజెక్ట్‌ను టేకప్ చేయడం అంత సులువైన పని కాదు. అందుకే ఒకటికి పదిసార్లు ఆలోచించి, సినిమాలు చేయాల్సి వస్తోంది. అరవింద్‌గారు ఇచ్చే సలహా కూడా ఇదే’’ అని చెప్పారు.


