
List Of Kannada Star Heroes Who Died At Young Age: కన్నడ సూపర్‌స్టార్ పునీత్ రాజ్‌కుమార్ మరణం చిత్ర పరిశ్రమను విషాదంలో నింపింది. ఎంతో భవిష్యత్తు ఉన్న పునీత్ అకాల మరణాన్ని అభిమానులు సహా సినీ ప్రముఖులు సైతం జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే కన్నడ ఇండస్ట్రీలో నెంబర్1 హీరోలుగా ఉన్నవారు ఇలా అకాల మరణం చెందడం ఇది మొదటి సారి కాదు. గతంలోనూ పలువురు కన్నడ స్టార్ హీరోలు హఠాన్మరణం చెందారు. ఇప్పుడు పునీత్ రాజ్‌కుమార్ విషయంలోనే ఇదే జరిగింది.
కన్నడ పవర్‌స్టార్ పునీత్ రాజ్‌కుమార్ అక్టోబర్29న గుండెపోటుతో మరణించారు. జిమ్ చేస్తుండగా తీవ్రమైన అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో ఆయన్ను బెంగళూరులోని విక్రమ్ ఆసుపత్రికి తరలించారు. అయితే పరిస్థితి విషమించడంతో ఆయన కన్నుమూశారు. పునీత్ హఠాన్మరణంతో అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు.
కన్నడ స్టార్ హీరో చిరంజీవి సర్జా 2020 జూన్7న గుండెపోటుతో కన్నుమూశారు. కెరీర్ పీక్‌స్టేజ్‌లో ఉన్న సమయంలోనే 39ఏళ్ల వయసులో ఆయన మరణించారు. చనిపోయే సమయానికి చిరంజీవి సర్జా చేతిలో సుమారు మూడు సినిమాలు ఉన్నాయి. ఈయన యాక్షన్ కింగ్ అర్జున్‌కు స్వయానా మేనల్లుడు. 2018లో ప్రముఖ నటి మేఘనా రాజ్‌ను వివాహం చేసుకున్న చిరంజీవి సర్జా..పెళ్లైన రెండేళ్లకే మేఘనను వదిలి తిరిగిరాని లోకాలకు వెళ్లారు. ఆ సమయంలో గర్భవతిగా ఉన్న ఆమె అక్టోబర్ 22న పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది.
2009లో కన్నడ మెగాస్టార్ విష్ణువర్ధన్ 58 ఏళ్ల వయసులో గుండెపోటుతో మరణించాడు. చనిపోయే సమయానికి ఆయన అగ్ర హీరో. 200కు పైగా సినిమ్లాల్లో నటించాడు. పునీత్ తండ్రి రాజ్‌కుమార్ తర్వాత అంతటి స్టార్ స్టేటస్‌ను అందుకున్నాడు. అయితే ఆయన కూడా పునీత్ మాదిరిగానే గుండోపోటుతో మరణించాడు.
ఇక 1990లో శంకర్ నాగ్ అనే స్టార్ హీరో కూడా కేవలం 35 ఏళ్ల వయసులో చనిపోయాడు. ఆయన చనిపోయే సమయానికి కన్నడలో స్టార్ హీరో. వరుస విజయాలతో చేతిలో దాదాపు 10 సినిమాలు ఉన్నాయి. శంకర్ నాగ్ చనిపోయిన 4 ఏళ్ల వరకు ఆయన నటించిన సినిమాలు విడుదల అవుతూనే ఉన్నాయంటే అతడి స్టార్ స్టేటస్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. అప్పట్లో శంకర్ నాగ్ మరణం దేశవ్యాప్తంగా సంచలనం. ఒక సినిమా షూటింగ్‌లో భాగంగా కార్ డ్రైవింగ్ చేస్తూ యాక్సిడెంట్‌లో ప్రాణాలు కోల్పోయాడు ఆయన.
స్టేజ్ నటుడి నుంచి సినిమా నటుడిగా ఎదిగిన విజయ్ సంచారి. కన్నడ సినిమా పరిశ్రమలో మంచి నటుడిగా గుర్తింపు పొందారు. తమిళం, తెలుగు, హిందీ సినిమాల్లో సైతం నటించిన సంచారి విజయ్ 2021 జూన్ 15న రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.
శాండల్‌వుడ్ చార్మింగ్ హీరో సునీల్ 1994 జులై 24న బాగల్‌కోట్ నుంచి బెంగళూరుకు తిరిగి వస్తుండగా కారు ప్రమాదంలో మృతి చెందారు. ఆ సమయంలో ఆయన వయస్సు 30 సంవత్సరాలు. చాక్లెట్ బాయ్‌గా గుర్తింపు పొందిన సునీల్ మరణం అభిమానులను షాక్‌కి గురిచేసింది.