హైదరాబాద్‌లో పుష్ప 2 ఈవెంట్ పక్కా.. కానీ ఎక్కడ? ఎప్పుడు? అనేది నిన్నటి వరకు క్లారిటీ రాలేదు. తాజాగా ఈ విషయంపై క్లారిటీ ఇచ్చింది చిత్రబృందం. హైదరాబాద్‌లోని యూసఫ్‌గూడ పోలీస్ గ్రౌండ్‌లో సోమవారం(డిసెంబర్ 2) ఈ ఈవెంట్ జరగనుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఓ పోస్టర్‌ని విడుదల చేశారు మేకర్స్.
చివరి నిమిషంలో ప్లాన్ ఛేంజ్
ఇప్పటికే పాట్నా, ముంబై, చెన్నై, కొచ్చిలో భారీ ఈవెంట్స్ నిర్వహించిన పుష్ప 2 టీమ్.. అంతకు మించిన ఈవెంట్‌ని హైదరాబాద్‌లో జరపాలని ముందు నుంచే ప్లాన్ వేసుకున్నారు. డిసెంబర్ 1న ఈ ఈవెంట్‌ని నిర్వహించాలనుకున్నారు. తొలుత ఎల్బీ స్టేడియంలో ప్లాన్ చేశారు. కానీ అక్కడ పర్మిషన్ లభించలేదు. దీంతో మల్లారెడ్డి కాలేజీ గ్రౌండ్‌కి మార్చారు. అయితే అక్కడ కూడా అనుమతి లభించకపోవడంతో చివరి నిమిషంలో ఈ ఈవెంట్‌ని యూసఫ్‌గూడలోని పోలీస్ గ్రౌండ్‌కి మార్చారు. ఈ రోజు కాకుండా రేపు (డిసెంబర్ 2) ఈ భారీ ఈవెంట్‌ని నిర్వహించనున్నారు. బన్నీతో పాటు చిత్రబృందం అంతా ఈ కార్యక్రమానికి హాజరుకానుంది.
‘అలా.. ’తర్వాత మళ్లీ ఇలా..
యూసఫ్‌గూడలోని పోలీస్ గ్రౌండ్‌లో బన్నీ సినిమా ఈవెంట్ జరగడం ఇది రెండోసారి. తొలిసారి 2020లో బన్నీ నటించిన ‘అల..వైకుంఠపురములో’ మూవీ మ్యూజికల్ ఈవెంట్ ఇక్కడే జరిగింది. దాదాపు ఆరు వేల మంది అంచనాతో ఈవెంట్ నిర్వహించగా.. 15 వేల మందికి పైగా హాజరయ్యారు. దీంతో అక్కడ తొక్కిసలాట జరిగింది. అంతేకాదు ఆరు వేల మందికి పర్మిషన్ తీసుకొని..15 వేల మందిని ఆహ్వానించారంటూ ఈవెంట్ ఆర్గనైజేషన్ శ్రేయాస్ మీడియా పై పోలీసులు కేసు కూడా నమోదు చేశారు.
టికెట్ రేట్లు భారీగా పెంపు
సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 చిత్రంపై ఇప్పటికే భారీ బజ్ క్రియేట్ అయింది. బన్నీ మాస్ ఫెర్ఫార్మెన్స్‌ని చూసేందుకు అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. వారి కోసమే బెనిఫిట్ షోలు కూడా వేయబోతున్నారు. తెలంగాణలో నవంబర్ 4 రాత్రి 9.30 గంటల నుంచే ఈ బెన్‌ఫిట్ షోలు పడబోతున్నాయి. దీని కోసం తెలంగాణ ప్రభుత్వం నుంచి అనుమతి కూడా తీసుకున్నారు.
అంతేకాదు టికెట్ ధరలు కూడా పెంచేశారు. బెనిఫిట్ షోల టికెట్ ధరలు రూ.800 ఖరారు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా సింగిల్ స్క్రీన్, మల్టీఫ్లెక్స్ లో బెనిఫిట్ షో లకు ఈ ధరలు వర్తిస్తాయి. డిసెంబర్ 5 నుంచి 8 వరకు సింగిల్ స్క్రీన్ లో రూ.150, మల్టీఫ్లెక్స్ లో రూ.200లకు టికెట్ ధరను పెంచారు. డిసెంబర్ 9 నుంచి 16 వరకు సింగిల్ స్క్రీన్ లో రూ.105, మల్టీఫ్లెక్స్ లో రూ.150 పెంపునకు అనుమతి తీసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment