
Pushpa Art Director Rama Krishna Reveals Secrets Of Pusha Sets: ‘‘ఎర్రచందనం నేపథ్యంలో సాగే ‘పుష్ప’ సినిమా కోసం కృత్రిమంగా అడవిని సృష్టించడం చాలా కష్టంగా అనిపించింది. ప్రేక్షకులకు సెట్ అనే భావన రాకుండా ఒరిజినల్ ఫీలింగ్ కలిగించేలా సెట్స్ వేయడం సవాల్‌గా నిలిచింది’’ అని ఆర్ట్ డైరెక్టర్స్ రామకృష్ణ–మౌనిక అన్నారు. అల్లు అర్జున్, రష్మికా మందన్న జంటగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘పుష్ప: ది రైజ్’. నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మించిన ఈ చిత్రం మొదటి భాగం రేపు విడుదలవుతోంది.
ఈ సందర్భంగా ‘పుష్ప’కి ఆర్ట్ డైరెక్టర్స్‌గా చేసిన రామకృష్ణ–మౌనిక విలేకరులతో మాట్లాడుతూ– ‘‘రంగస్థలం’ తర్వాత సుకుమార్‌గారితో ‘పుష్ప’కి పని చేశాం. ఆయనతో ఒక్కసారి కనెక్ట్ అయితే మళ్లీ మళ్లీ పని చేయాలనిపిస్తుంది. సాంకేతిక నిపుణులకు మంచి విలువ ఇస్తారు. ‘పుష్ప’ సినిమా కోసం మొత్తం 25 సెట్స్ వేశాం. నిర్మాతల తపన, ధైర్యం వల్లే సెట్స్ గ్రాండ్‌గా వేయగలిగాం. అలాంటి నిర్మాతలు ఇండస్ట్రీకి అవసరం. ఖర్చు విషయంలో ఎక్కడా రాజీ పడకుండా మాకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు.
కోవిడ్ వల్ల కేరళలోని ఓ జలపాతం వద్ద షూటింగ్ చేయడానికి వీలు కాలేదు.. దీంతో ఆ జలపాతం సెట్‌ని కూడా హైదరాబాద్‌లోనే వేశాం. సెట్స్‌లోకి అడుగుపెట్టగానే బన్నీగారు (అల్లు అర్జున్) సెట్స్ బాగున్నాయని అభినందించారు. కొన్ని సన్నివేశాలు అడవుల్లో, మరికొన్ని సెట్స్‌లో తీసినా ఏది నిజమైన అడవో? ఏది సెట్టో అనేది ప్రేక్షకులకు తేడా తెలియకూడదని కష్టపడ్డాం. ప్రస్తుతం రామ్‌చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వం వహిస్తున్న సినిమా చేస్తున్నాం’’ అన్నారు.