
Pushpaka Vimanam Fame Geeth Saini : ‘‘పుష్పక విమానం’లో చిట్టిలంక సుందర్ భార్య మీనాక్షి పాత్ర చేశా. పెళ్లయ్యాక మీనాక్షి ఇంట్లో నుంచి వెళ్లిపోవడానికి కొన్ని కారణాలు ఉంటాయి. సినిమా చూశాక ప్రేక్షకులు నా పాత్రని ఇష్టపడతారు’’ అని గీత్ సైనీ అన్నారు. ఆనంద్ దేవరకొండ హీరోగా, గీత్ సైనీ, శాన్వీ మేఘన హీరోయిన్లుగా దామోదర దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘పుష్పక విమానం’. విజయ్ దేవరకొండ సమర్పణలో గోవర్థన్ రావు దేవరకొండ, విజయ్ మిట్టపల్లి, ప్రదీప్ ఎర్రబెల్లి నిర్మించిన ఈ సినిమా నేడు విడుదలవుతోంది.
ఈ సందర్భంగా గీత్ సైనీ మాట్లాడుతూ– ‘‘మా ఫ్యామిలీకి సినిమా ఇండస్ట్రీతో సంబంధం లేదు. అయితే ‘పుష్పక విమానం’ ఆడిషన్స్‌కి నా స్నేహితురాలు నా ఫొటోలు పంపింది.. మీనాక్షి క్యారెక్టర్‌కు నేను సరిపోతానని ఎంపిక చేశారు. కెరీర్ ఆరంభంలోనే ఇంత పెద్ద స్పాన్ ఉన్న సినిమా చేస్తాననుకోలేదు.. అందుకే ఈ సినిమా రిలీజ్ అయ్యేదాకా వేరే సినిమాలు చేయకూడదనుకుని కొన్ని ఆఫర్స్ వదులుకున్నాను. అన్ని రకాల పాత్రలూ చేయాలని ఉంది’’ అన్నారు.