‘‘పుష్పక విమానం’లో ఆనంద్ దేవరకొండ పాత్రతో నా బంధం ఏంటి? అనేది తెరపైనే చూడాలి. నా పాత్ర సందర్భానుసారంగా వస్తుంది’’ అన్నారు శాన్వీ మేఘన. ఆనంద్ దేవరకొండ హీరోగా, శాన్వీ మేఘన, గీత్ సైనీ హీరోయిన్లుగా దామోదర దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘పుష్పక విమానం’. విజయ్ దేవరకొండ సమర్పణలో గోవర్థన్ రావు దేవరకొండ, విజయ్ మిట్టపల్లి, ప్రదీప్ ఎర్రబెల్లి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 12న విడుదలవుతోంది.
శాన్వీ మేఘన విలేకరులతో మాట్లాడుతూ – ‘‘నాది హైదరాబాద్. మా కాలేజ్ క్యాంపస్‌లో షూటింగ్ జరిగినప్పుడు నన్ను చూసి ఓ సీరియల్ ఆడిషన్ కోసం పిలిచారు. నాకు నటనంటే ఆసక్తి ఉండేది కాదు.. మా ఇంట్లో నేను సినిమాల్లోకి వెళ్లడం ఇష్టం లేదు. జయసుధగారు నిర్మిస్తున్న టీవీ ప్రోగ్రామ్ కోసం స్వయంగా అడగడంతో మా అమ్మా నాన్న అభ్యంతరం చెప్పలేదు. రెండు ఎపిసోడ్స్ షూట్ చేసిన తర్వాత జయసుధగారి భర్త నితిన్ కపూర్‌గారు చనిపోవడంతో ఆ టీవీ కార్యక్రమం ఆగిపోయింది. ఆ తర్వాత ‘బిలాల్‌పూర్ పోలీస్ స్టేషన్’ చిత్రంలో హీరోయిన్‌గా చేశాను.
‘సైరా నరసింహా రెడ్డి’లో చిన్న పాత్ర చేశాను. తరుణ్ భాస్కర్‌గారి ‘పిట్ట కథలు’ వెబ్ సిరీస్ చేశాను. ఆయనే ‘పుష్పక విమానం’ చిత్రానికి నన్ను సిఫారసు చేశారు. దామోదరగారు ఆడిషన్ చేసి సెకండ్ లీడ్‌గా సెలక్ట్ చేశారు. నాకు ఇష్టమైన హీరోయిన్ శ్రీదేవిగారు. హీరోల్లో అల్లు అర్జున్ అంటే ఇష్టం. విజయ్ దేవరకొండగారితో నటించే అవకాశం వస్తే వదులుకుంటానా?’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment