చిన్నచిన్న గొడవలతో అయినవాళ్లకే దూరమవుతున్నాం. ఉరుకుల పరుగుల జీవితంలో బంధాలకు, బంధుత్వాలను మర్చిపోతున్నాం. కానీ అంతా మనవాళ్లే అనుకుని కలిసిమెలిసి ఉంటే అంతకు మంచిన ఆనందం మరొకటి ఉండదు. ఇదే విషయాన్ని బలగంతో నిరూపించాడు దర్శకుడు వేణు. ఈ సినిమాలో జబర్దస్త్ కమెడియన్ రచ్చ రవి కూడా నటించాడు. అయితే రచ్చ రవి నిజ జీవితంలోనూ బలగం సీన్ ఎదురైంది. తను ఎంతగానో ప్రేమించిన చెల్లె మాట్లాడటం లేదని కన్నీరుమున్నీరుగా విలపించాడు.
తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. '2016లో మా ఇంటి గృహప్రవేశం జరిగింది. అప్పుడు వచ్చిన చెల్లె రజిత ఆ తర్వాత ఎన్నడూ మా ఇంటికి రాలేదు. తనిచ్చిన 123 రూపాయలతో హైదరాబాద్‌కు వచ్చాను. ఎన్నో తిప్పలు పడి ఈ స్థాయికి వచ్చాను. నాకు సమయం లేక తనతో సరిగా మాట్లాడలేదు. దాన్ని ఆమె తప్పుగా అర్థం చేసుకుంది. ఎన్నిసార్లు బతిమాలినా ఇంటికి రాననే చెప్తుంది.
నేనేమైనా తప్పు చేస్తే తిట్టాలి కానీ ఇన్నేళ్లవుతున్నా ఇంటికి రావడం లేదు. రాఖీ పండగ వస్తే నేనే చెల్లె ఇంటికి వెళ్లి రాఖీ కట్టించుకుంటున్నాను, తను మాత్రం మా ఇంటికి రావడం లేదు. ఆమె ఇచ్చిన డబ్బులతోనే సిటీకి వచ్చి ఇంత సంపాదించాను. తను నా ఇంటికి వస్తే చూడాలనుంది. చెల్లె గుర్తుకు వస్తే నాకు కన్నీళ్లు ఆగట్లేదు' అని కంటతడి పెట్టుకున్నాడు రచ్చ రవి. ఇది చూసిన నెటిజన్లు 'మీ అన్న చేసిన బలగం సినిమా చూసి తప్పకుండా వచ్చి కలుస్తావని ఆశిస్తున్నాం', 'ఒక్కసారి వచ్చిపోవమ్మా.. ఆయన ఏడుస్తుంటే మాకు కన్నీళ్లొస్తున్నాయి' అంటూ కామెంట్లు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment