లావణ్య అనే అమ్మాయి వల్ల హీరో రాజ్ తరుణ్ గత కొన్నిరోజులుగా వార్తల్లో నిలిచాడు. హీరోయిన్ మాల్వి మల్హోత్రా మాయలో పడి, తనని మోసం చేశాడని ఈమె చేసిన కామెంట్స్ టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీ అయిపోయాయి. అదే మాల్వి మాల్హోత్రా-రాజ్ తరుణ్ జంటగా కలిసి నటించిన 'తిరగబడర సామీ' సినిమా ఇప్పుడు థియేటర్లలోకి వచ్చేసింది. రచ్చ వల్ల చర్చల్లో నిలిచిన ఈ మూవీ ఎలా ఉంది? ఏంటనేది ఇప్పుడు రివ్యూలో చూద్దాం.
కథేంటి?
సమాజంలో తప్పిపోతున్న చాలామందిని వాళ్ల సొంతవాళ్ల దగ్గరకి చేర్చే అనాథ కుర్రాడు గిరి (రాజ్ తరుణ్). ఈ పని చేస్తుండటం వల్ల ఇతడికి పిల్లనిచ్చి పెళ్లి చేయడానికి ఎవరూ ముందుకు రారు. అలాంటిది మరో అనాథ అయిన శైలజ (మాల్వీ మల్హోత్రా), గిరిని పెళ్లి చేసుకుంటుంది. కొన్నిరోజుల్లో ప్రెగ్నెంట్ కూడా అవుతుంది. అయితే శైలజ అనాథ కాదని ఓ సందర్భంలో గిరికి తెలుస్తుంది. అప్పుడేం చేశాడు? ఇంతకీ కొండారెడ్డి అనే గుండాకు శైలజకు సంబంధమేంటి? చివరకు ఏమైందనేదే స్టోరీ.
ఎలా ఉందంటే?
లావణ్య అనే అమ్మాయి వల్ల రాజ్ తరుణ్‌తో పాటు 'తిరగబడర సామీ' సినిమా కూడా వార్తల్లో నిలిచింది. కానీ అనుకున్నంతగా ఇందులో ఏం లేదు. టాలీవుడ్‌లో చాలాసార్లు చూసేసిన కథతోనే సినిమా తీశారు. పోనీ ఏమైనా సర్‌ప్రైజింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయా అంటే ఏం లేవు. మొదలైన దగ్గర చివరివరకు తర్వాత సీన్ లో ఏం జరుగుతుందో సాధారణ ప్రేక్షకుడు సులభంగా ఊహించేస్తాడు. అంత నీరసమైన స్క్రీన్ ప్లేతో సినిమాని నడిపించారు.
తప్పిపోయిన, కనిపించకుండా పోయిన వ్యక్తుల్ని.. ఆయా వ్యక్తుల కుటుంబీకులకు అప్పగించే కుర్రాడిగా రాజ్ తరుణ్‌ని పరిచయం చేశారు. ఆ తర్వాత హీరోయిన్ ఎంట్రీ, కట్ చేస్తే ఇద్దరికీ పెళ్లి జరుగుతుంది. ఆ తర్వాత పాటలు ఇలా చప్పగా సాగుతూ ఉంటుంది. అసలు తనని పెళ్లి చేసుకున్న శైలజ ఎవరో తెలిసే విషయంతో ఇంటర్వెల్ పడుతుంది. అయితే అనవసరమైన సీన్లతో సెకండాఫ్ ఇంకా భారంగా సాగుతుంది. ఫైట్‌తో క్లైమాక్స్ ముగుస్తుంది.
గంట 55 నిమిషాల నిడివితో తీసినప్పటికీ.. ఏదో మూడు గంటల సినిమా చూస్తున్నామా అనేంత భారమైన ఫీలింగ్ కలుగుతుంది. అప్పుడెప్పుడో 90ల్లో రాసుకున్న కథని ఇప్పుడెందుకు తీశారు? అసలు రాజ్ తరుణ్ ఇలాంటి మూవీ ఎందుకు చేశాడా అని సందేహాలు వస్తాయి. ఇందులో హీరోయిన్ ప్రెగ్నెన్సీతో ఉన్నట్లు చెబుతారు. కానీ ఒక్కచోట కూడా పొట్ట ఎత్తుగా ఉన్నట్లు చూపించారు. ఇలాంటి లాజిక్ లేని సీన్లు సినిమాలో బోలెడు ఉంటాయి.
ఎవరెలా చేశారు?
రాజ్ తరుణ్ మంచి ఎనర్జీ ఉన్న నటుడు. కాకపోతే ఇందులో అతడి యాక్టింగ్ స్టామినాని సరిగా ఉపయోగించుకోలేకపోయారు. ఏదో అలా చేశాడంతే! హీరోయిన్ మాల్వీ మల్హోత్రా యాక్టింగ్ పర్లేదు. విలన్‌గా చేసిన మకరంద్ దేశ్ పాండే పాత్ర, బిహేవ్ చేసే విధానం మరీ సిల్లీగా ఉంటుంది. గ్లామర్ షో చేసేందుకే మన్నారా చోప్రా పాత్ర ఉంది. మిగిలిన పాత్రలన్నీ ఏదో ఉన్నాయంటే ఉన్నాయంతే!
టెక్నికల్ విషయాలకొస్తే.. 'యజ్ఞం', 'పిల్లా నువ్వు లేని జీవితం' సినిమాలు తీసిన డైరెక్టర్ ఏఎస్ రవికుమార్ చౌదరి.. మరీ ఇలా అయిపోయారేంటి అనిపిస్తుంది. పాటలు పర్లేదు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం మరీ లౌడ్‌గా ఉండి తెగ ఇబ్బంది పెట్టింది. సినిమాటోగ్రాఫీ, నిర్మాణ విలువలు ఓకే ఓకే. ఓవరాల్‌గా చెప్పుకొంటే రాజ్ తరుణ్-లావణ్య గొడవ వల్ల కాస్త హైలైట్ అయిన ఈ సినిమా.. కనీసం అంటే కనీసం ఆకట్టుకోలేకపోయింది!
Comments
Please login to add a commentAdd a comment