టైటిల్: రామ్ (RAM ర్యాపిడ్ యాక్షన్ మిషన్)
నటీనటులు: సూర్య అయ్యలసోమయజుల,ధన్య బాలకృష్ణ ,భాను చందర్, సాయి కుమార్, రోహిత్, శుభలేఖ సుధాకర్, రవివర్మ, మీనా వాసు, అమిత్ కుమార్ తివారీ, భాషా తదితరులు
నిర్మాణ సంస్థ: దీపికా ఎంటర్‌టైన్‌మెంట్ & ఓ ఎస్ యం విజన్
నిర్మాత:దీపికాంజలి వడ్లమాని
కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్, దర్శకత్వం: మిహిరామ్ వైనతేయ
సంగీతం: ఆశ్రిత్ అయ్యంగార్
సినిమాటోగ్రఫీ దర్శకుడు: ధారన్ సుక్రి
విడుదల తేది: జనవరి 26, 2024
కథేంటంటే...
హైద్రాబాద్‌లోని హెచ్ ఐ డీ (హిందుస్థాన్ ఇంట్రా డిఫెన్) హెడ్డుగా రియాజ్ అహ్మద్ (సాయి కుమార్) వ్యవహరిస్తుంటారు. ఆ డిపార్ట్మెంట్‌లో జేబీ (భాను చందర్) చురుకైన ఆఫీసర్. గతంలో జేబీ పని చేసిన జట్టు ఓ మిషన్ కోసం వెళ్తుంది. అందులో జేబీపై అధికారి మేజర్ సూర్య ప్రకాష్ (రోహిత్) ప్రాణాలు కోల్పోతాడు. తమ కోసం ప్రాణాలు అర్పించిన అధికారి కొడుకు రామ్ (సూర్య అయ్యలసోమయాజుల)ను డిపార్ట్మెంట్‌లోకి తీసుకు రావాలని ప్రయత్నిస్తుంటాడు. కానీ రామ్ మాత్రం అల్లరి చిల్లరి జాలీగా తిరుగుతూ తాగుతూ ఎంజాయ్ చేస్తుంటాడు.
అలాంటి రామ్ తొలి చూపులోనే జాహ్నవి (ధన్య బాలకృష్ణ) ప్రేమలో పడిపోతాడు. ఆ అమ్మాయి జేబీ కూతురే. మా అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటే డిపార్ట్మెంట్‌లో జాయిన్ అవ్వాలనే కండీషన్ పెడతాడు జేబీ. అమ్మాయి ప్రేమ కోసం రామ్ డిపార్ట్మెంట్‌లో చేరేందుకు పడిన కష్టం ఏంటి? అదే టైంలో ఉగ్రవాదులు ఎలాంటి కుట్రలు పన్నుతుంటారు? దాన్ని అడ్డుకునేందుకు హీరో ఏం చేస్తాడు? అసలు ఈ కథలో ర్యాపిడ్ యాక్షన్ మిషన్ మీనింగ్ ఏంటి? అన్నది తెరపై చూడాల్సిందే.
ఎలా ఉందంటే..
రామ్ సినిమా కోసం దర్శకుడు రాసుకున్న సెటప్ కొత్తగా అనిపిస్తుంది. ఉగ్రవాదం మీద సినిమాలు రావడం కొత్తేమీ కాదు. మన దేశంలో ఉగ్రవాదం మీద ఎన్నో సినిమాలు వచ్చాయి. బార్డర్‌లోనే కాదు.. దేశం లోపలే ఎంతో ప్రమాదకర శత్రువులుంటారని చూపించాడు డైరెక్టర్. రామ్ విషయంలో కథనాన్ని నడిపించిన తీరు మాత్రం కొత్తగా ఉంటుంది. పనీ పాట లేని అల్లరి చిల్లరగా తిరిగే వ్యక్తి.. దేశం కోసం ప్రాణాలిచ్చే అధికారిగా మారే ప్రయాణాన్ని, ఆ గ్రాఫ్‌ను చక్కగా ప్రజెంట్ చేశాడు. హెచ్‌ఐడీ (హిందుస్తాన్ ఇంట్రా డిఫెన్స్) అంటూ కొత్త పాయింట్ చూపించాడు. దాని చుట్టూ ఈ కథనాన్ని అల్లు కున్నాడు. దేశం లోపల ఉండే స్లీపర్ సెల్స్ గురించి చర్చించాడు. ఓ మతం చేస్తే తప్పు.. ఇంకో మతం చేస్తే తప్పు కాదు అంటూ సాయి కుమార్ పాత్రతో డైలాగ్ చెప్పించడం దర్శకుడి ధైర్యానికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. అలాంటి గూస్ బంప్స్ ఇచ్చే సీన్లు చాలానే రాసుకున్నాడు. సెకండాఫ్, క్లైమాక్స్‌లో హై ఇచ్చే సీన్లను బాగానే రాసుకున్నాడు. బ్యూరోక్రసీ జీహాద్ అంటూ సాయి కుమార్ పాత్రతో కొత్త పాయింట్‌ను జనాల్లోకి బలంగా తీసుకెళ్లాడు దర్శకుడు.
శుభలేఖ సుధాకర్ పాత్రతో రాజకీయానికి ఉగ్రవాదానికి కనెక్షన్స్ ఎలా ఉంటాయో చూపించాడు. ఫస్ట్ హాఫ్‌ను సరదా సరదాగా రాసుకున్నట్టుగా అనిపిస్తుంది. సెకండాఫ్‌ను ఫుల్ సీరియస్ మోడ్‌లో నడిపించాడు. క్లైమాక్స్‌ను మాత్రం నెక్ట్స్ లెవెల్లో ప్లాన్ చేసుకున్నాడు. త్రివర్ణ పతాకం కనిపించే షాట్ డైరెక్టర్ విజన్, ప్రతిభకు ఉదాహరణగా నిలుస్తుంది. థియేటర్లో కూర్చున్న ప్రేక్షకులను చివరకు జై హింద్ అనిపించేలా చేస్తాడు. అదే దర్శకుడి సక్సెస్ అని చెప్పొచ్చు.
ఎవరెలా నటించారంటే?
రామ్ పాత్రలో సూర్య అయ్యలసోమయాజుల చక్కగా నటించాడు. కొత్త వాడైనా ఎక్కడా ఆ బెరుకు కనిపించలేదు. యాక్షన్ సీక్వెన్స్‌లో ఓ మాస్ హీరోగా ఫైట్స్ చేశాడు. కామెడీ టైమింగ్ కూడా బాగుంది. ఎమోషనల్ సీన్స్‌లోనూ ఆకట్టుకున్నాడు. ఫస్ట్ హాఫ్‌కు, సెకండాఫ్‌కు చూపించిన వేరియేషన్స్ బాగున్నాయి. అక్కడే సూర్య సక్సెస్ అయ్యాడనిపిస్తుంది. ఇక ఈ చిత్రంలో సాయి కుమార్, శుభలేఖ సుధాకర్, రోహిత్, భాను చందర్ పాత్రలు బాగుంటాయి. రోహిత్ చాలా కాలం తరువాత ఆడియెన్స్‌ను ఆకట్టుకుంటాడు. సాయి కుమార్ తన డైలాగ్ డెలివరీతో మరోసారి ఆడియెన్స్‌ను మంత్ర ముగ్దుల్ని చేస్తాడు. శుభలేఖ సుధాకర్ కనిపించేది కొద్ది సేపే అయినా ఇంపాక్ట్ చూపిస్తాడు. ధన్య బాలకృష్ణ లుక్స్ పరంగా బాగుంది. ఎమోషనల్‌గానూ ఆకట్టుకుంది. భాషా కామెడీ, రవి వర్మ, మీనా వాసు, అమిత్ ఇలా మిగిలిన పాత్రలన్నీ మెప్పిస్తాయి.
రామ్ సినిమాలో టెక్నికల్ టీం మేజర్ అస్సెట్‌గా నిలిచింది. ఆశ్రిత్ అయ్యంగార్ ఇచ్చిన ఆర్ఆర్ సినిమాను నిలబెట్టింది. చివర్లో వచ్చే దేశ భక్తి గీతం రోమాలు నిక్కబొడుచుకునేలా చేస్తుంది. ధారన్ సుక్రి విజువల్స్ అద్భుతంగా ఉంటాయి. సెకండాఫ్‌లో వచ్చే డైరెక్టర్ మిహిరాం రాసిన మాటలు గుండెల్ని హత్తుకుంటాయి. హిందూ, ముస్లిం, దేశ భక్తి అంటూ చెప్పే డైలాగ్స్ అందరి మనసుల్ని తాకుతాయి. ఆర్ట్, ఎడిటింగ్ అన్నీ చక్కగా కుదిరాయి. నిర్మాత పెట్టిన ఖర్చు తెరపై కనిపిస్తుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment