![Rocky Aur Rani Kii Prem Kahaani Enters Rs 200 Crore Club, Karan Johar Gets Emotional - Sakshi](/styles/webp/s3/article_images/2023/08/8/ranveer.jpg.webp?itok=gdWyKH3e)
రాఖీ ఔర్ రాణీకీ ప్రేమ్ కహాని.. సోది సినిమా.. అసలిది సినిమానా? అచ్చంగా సీరియలే.. అయినా ఇది ఎప్పుడో చూసిన కథే, కొత్తగా ఏముంది? ఇలా నానామాటలు అన్నారు. కొందరు మాత్రం సినిమాను ఆస్వాదించారు. లొసుగులు వెతకడం మాని సినిమాను సినిమాలా ఆదరించారు. మొదట్లో ఈ మూవీకి మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ కలెక్షన్లు మాత్రం బాగానే వస్తున్నాయి. నెగెటివిటీని దాటుకుని వందల కోట్లు రాబడుతోందీ చిత్రం. తాజాగా ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.210 కోట్లకు పైగా రాబట్టింది.
దీంతో ఈ సినిమా దర్శకనిర్మాత కరణ్ జోహార్ సోషల్ మీడియా వేదికగా సంతోషం వ్యక్తం చేశాడు. 'సినిమా రిలీజ్‌కు ముందు కొంత భయపడ్డాను. ఏడేళ్లుగా డైరెక్షన్‌కు దూరంగా ఉండటం వల్లో, లేదంటే మూడేళ్లుగా ఆందోళనతో బాధపడుతున్నందుల్లో.. ఎందుకో తెలియదు కానీ నాలో ఒకరకమైన భయం, నీరసం ఆవహించింది. అసలే బాక్సాఫీస్ దగ్గర ఎప్పుడు? ఎటువంటి ఫలితాలు వస్తాయో ఊహించలేకుండా ఉన్నాం. ఏదైతేనేం.. ఒకరకమైన డోలాయమానంలో ఉన్నాను. కానీ జూలై 23 శుక్రవారం.. నాలో ఎక్కడలేని ఉత్తేజం వచ్చి చేరింది. ఇంత మంచి సక్సెస్ ఇచ్చినందుకు సర్వదా కృతజ్ఞుడిని. ప్రేమ, ఎనర్జీతో పనిచేసిన టీమ్ అందరి కృషి వల్ల దక్కిన ఫలితమే ఈ చిత్రం.
ఈ సినిమాకు రచయితలుగా పనిచేసిన శషాంక్ ఖైతన్, సుమిత్ రాయ్‌కు ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఈ సినిమా మొదటి నుంచి వాళ్లు నాకు ఎన్నో సలహాలు సూచనలు ఇచ్చారు. కామెడీని రెట్టింపు చేసేలా స్క్రీన్‌ప్లేలో ప్రధాన పాత్ర పోషించిన ఇషిత మైత్ర గురించి స్పెషల్‌గా చెప్పుకుని తీరాల్సిందే! సోమెన్ మిశ్ర ఈ టీమ్‌కు ఆధ్వర్యం వహించి ఉండకపోతే ఇదంతా సాధ్యమయ్యేదే కాదు' అని రాసుకొచ్చాడు. కాగా రణ్‌వీర్ సింగ్, ఆలియా భట్ జంటగా నటించిన 'రాఖీ ఔర్ రాణీకీ ప్రేమ్ కహాని' చిత్రం జూలై 28న విడుదలైంది. జయా బచ్చన్, ధర్మేంద్ర, షబానా అజ్మీ, అంజలి ఆనంద్, చుర్నీ గంగూలి, రాయ్ చౌదరి ముఖ్య పాత్రలు పోషించారు.
Comments
Please login to add a commentAdd a comment