చుట్టూ పచ్చని చెట్లతో అలరారే అందమైన ఉద్యానవనాలు.. సరస్సును తలపించే స్విమ్మింగ్ పూల్.. వీటన్నింటి నడుమ రాజసం ఉట్టిపడే భవంతి.. అందమైన ఇంటీరియర్ డెకరేషన్.. అడుగడుగునా పూర్వీకుల ఫొటోలతో దర్శనమిచ్చే గోడలు.. ఇంతటి వైభవం ఉన్న బంగ్లా కనుకే పటౌడీ వారసుడు, బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ తనకు పూర్వీకుల నుంచి సంక్రమించిన రాజభవనాన్ని తిరిగి సొంతం చేసుకున్నాడు. హర్యానాలోని పటౌడీ ప్యాలెస్‌లో నివాసం ఉండేలా సర్వహక్కులు పొందాడు. నీమరానా హోటల్ గ్రూపు లీజు నుంచి దీనిని విడిపించుకున్నాడు. ఈ నేపథ్యంలో ఈ రాజభవంతి కోసం అతడు అక్షరాలా 800 కోట్లర రూపాయలు చెల్లించాడనే ప్రచారం జరుగుతోంది. ఈ విషయంపై స్పందించిన సైఫ్.. ఇది కేవలం ఓ చారిత్రక కట్టడం మాత్రమే కాదని, ఆ ప్యాలెస్‌తో తనకున్న అనుబంధాన్ని మాటల్లో వర్ణించలేనంటూ భావోద్వేగానికి లోనయ్యాడు. విలువైన జ్ఞాపకాలతో నిండి ఉన్న రాజభవనాన్ని డబ్బుతో వెలకట్టలేనని చెప్పుకొచ్చాడు.(చదవండి: ‘నా కొడుకు కంటే దాదాపు ఐదేళ్లు పెద్దది’)
ప్రముఖ క్రికెటర్, పటౌడీ నవాబ్ మన్సూర్ అలీఖాన్ తనయుడే సైఫ్ అలీఖాన్ అన్న సంగతి తెలిసిందే. రాచకుటుంబానికి చెందిన ఏకైక వారసుడైన సైఫ్ తన తల్లి, నటి షర్మిలా ఠాగూర్ వారసత్వాన్ని పుణికిపుచ్చుకుని సినీరంగంలో అడుగుపెట్టాడు. నటుడిగా తనకంటూ గుర్తింపు పొందిన సైఫ్, వివిధ రకాల వ్యాపారాల్లో భాగస్వామిగా ఉన్నాడు. ఈ క్రమంలో తాను సంపాదించిన సొమ్ము నుంచి భారీ మొత్తం చెల్లించి వారసత్వంగా వచ్చిన పటౌడీ ప్యాలెస్‌ను హోటల్ గ్రూపు నుంచి విడిపించుకున్నాడు.(చదవండి: కాస్తైనా సిగ్గుపడండి; మమ్మల్ని క్షమించండి!)
ఈ విషయం గురించి సైఫ్ ముంబై మిర్రర్‌తో మాట్లాడుతూ..‘‘నా తండ్రి ఈ భవనాన్ని ఓ హోటల్ గ్రూపునకు లీజుకు ఇచ్చారు. ఫ్రాన్సిస్, అమన్(హోటల్ నిర్వాహకులు) ఈ భవనాన్ని ఎంతో జాగ్రత్తగా చూసుకున్నారు. మా అమ్మ షర్మిలా ఠాగూర్‌కు అక్కడ ప్రత్యేకంగా ఓ కాటేజీ కూడా ఉంది. అందరూ అనుకుంటున్నట్లుగా నేను ఈ ప్యాలెస్‌ను కొనుగోలు చేయలేదు. ఎందుకంటే మేం ఎప్పుడూ దానిని అమ్మలేదు. అది మా సొంతం. లీజుకు ఇచ్చాం అంతే.
ఆ భవనంతో ఎన్నో జ్ఞాపకాలు ముడిపడి ఉన్నాయి. కాబట్టి దానికి వెలకట్టలేను. మా బామ్మాతాతయ్యలు, మా నాన్న సమాధులు అక్కడే ఉన్నాయి. అక్కడికి వెళ్తే ఎంతో భద్రంగా ఉన్న ఫీలింగ్ కలుగుతుంది. ఆధ్యాత్మిక భావనలు స్ఫురిస్తాయి. వందల ఏళ్ల క్రితం నాటి నుంచే మాకు అక్కడ భూమి ఉంది. అయితే మా తాతయ్య, మా బామ్మ మీద కోసం దాదాపు వందేళ్ల క్రితం ఈ భవనాన్ని కట్టించారు.
తనకంటూ రాజ్యం ఉండేది. కాలక్రమంలో ఈ భవంతిని హోటల్ గ్రూపునకు అద్దెకు ఇవ్వాల్సి వచ్చింది. అయితే ఇప్పుడు నేను దానిని తిరిగి దక్కించకున్నాను’’అని హర్షం వ్యక్తం చేశాడు. కాగా సైఫ్ కొన్నిరోజుల క్రితం తన భార్యాపిల్లలు కరీనా కపూర్, తైమూన్ అలీఖాన్‌లతో కలిసి పటౌడీ ప్యాలెస్‌ను సందర్శించిన విషయం తెలిసిందే. నెలరోజుల పాటు వారు అక్కడే గడిపి ఇటీవలే ముంబైకి తిరిగి వచ్చారు. ప్రస్తుతం కరీనా గర్భవతి అన్న సంగతి తెలిసిందే. ఇక సైఫ్ అలీఖాన్‌కు సారా అలీఖాన్, ఇబ్రహీం అలీఖాన్ అనే మరో ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. మొదటి భార్య అమృతా సింగ్ ద్వారా కలిగిన సంతానం వీరు.
Comments
Please login to add a commentAdd a comment