∙ఎనిమిది విభాగాల్లో అవార్డులందుకున్న ‘పుష్ప’ బృందం: వై.ఎస్. భారతీ రెడ్డితో నిర్మాత నవీన్ ఎర్నేని, రష్మిక మందన్నా, సుకుమార్, అల్లు అర్జున్, దేవిశ్రీ ప్రసాద్, రచయిత చంద్రబోస్, గాయని ఇంద్రావతీ చౌహాన్, గాయకుడు శివమ్
సకలజన మనోరంజకమైన సినీ రంగంలోని పాపులర్ చిత్రాలు, ఉత్తమ కళాకారులు, సృజనశీలురను గుర్తించి గౌరవించడం... సాక్షి ఎక్స్‌లెన్స్ అవార్డుల్లో గత ఎనిమిదేళ్ళుగా అవిచ్ఛి్ఛన్నంగా సాగుతున్న సత్సంప్రదాయం. గడచిన 2021లో విడుదలైన తెలుగు చిత్రాలకు ఇచ్చిన ఈ 8వ ఎడిషన్ అవార్డుల వేదిక పలువురు తారలతో, జీవనసాఫల్య పురస్కారాలందుకున్న సీనియర్లతో కళకళలాడింది. ఆత్మీయంగా సాగిన ఈ అవార్డుల సందడిలో... వారంతా మనసు విప్పి మాట్లాడిన సంగతుల సమాహారం... సంక్షిప్తంగా...
ఇలాంటి గొప్ప కార్యక్రమాలు
నిర్వహిస్తున్న భారతిగారికి కూడా ఒక అవార్డు ఇవ్వాలి. అవార్డులు ప్రోత్సాహాన్ని అందిస్తాయి. విపత్కర పరిస్థితుల్లో మా సినిమాను(లవ్ స్టోరీ) విడుదల చేశాం. ముఖ్యంగా కులం, చైల్డ్ ఎబ్యూజ్ వంటి అంశాలను చూపించినందుకుగాను సాక్షి అవార్డు రావడం గర్వంగా ఉంది. మా ఇద్దరి (శేఖర్ కమ్ముల, సుకుమార్) ప్రయాణం ఒకేసారి మొదలైంది. ఇండస్ట్రీ గర్వించేలా సుకుమార్ సినిమాలు చేస్తున్నారు.
వరుసగా రెండు సార్లు(2020, 2021) సాక్షి ఎక్స్‌లెన్స్ అవార్డ్ అందుకోవడం ఆనందంగా ఉంది.. హ్యాట్రిక్ కొట్టాలనుకుంటున్నా. ఈ అవార్డు అందించిన సాక్షికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ పురస్కారాన్ని ‘పుష్ప’ బృందానికి అంకితం ఇస్తున్నాను. తెరవెనుక వారి కృషి మాటల్లో చెప్పలేనిది. ఈ అవార్డు రావడానికి ముఖ్య కారణం సుకుమార్‌గారు. ఆయన వల్లే ఇంత మంచి సినిమా తీశాం.
దేవిశ్రీతో ప్రయాణం గొప్పగా ఉంటుంది. నా మొదటి సినిమా నుంచి ప్రస్తుతం దేశవ్యాప్తంగా యూట్యూబ్‌లో ఎక్కువ మంది వింటున్న ఆల్బమ్ వరకు పాటలు అందించిన చంద్రబోస్‌గారికి థ్యాంక్స్. 2021లో ‘పుష్ప’ తో పాటు బాలకృష్ణగారి‘అఖండ’, నాని ‘శ్యామ్‌సింగరాయ్’, ‘జాతిరత్నాలు’ వంటి మంచి మూవీస్ విడుదలయ్యాయి.. వాటన్నిటికీ అభినందనలు. కరోనా తర్వాత మళ్లీ వరుసగా సినిమాలు రావడం హ్యాపీ. ఈ మధ్యనే సినిమా ప్రయాణం మొదలుపెట్టిన ప్రతిభావంతులకు ఈ వేదికపై అవార్డు రావడం అభినందనీయం.
ఈ అవార్డు అందుకోవడం ఎంతో ప్రత్యేకం.
అవార్డు గ్రహీతలను సెలెక్ట్ చేసే కోర్ టీం గురించి నాకు తెలుసు.. ప్రతి విషయాన్ని గమనిస్తూ, సాహిత్యానికి ప్రాధాన్యమిస్తూ నిష్పాక్షికంగా ఎన్నుకుంటారు. ఇలాంటి అవకాశం ఇచ్చిన సాక్షికి, భారతిగారికి థ్యాంక్స్. ‘పుష్ప’ విజయంలో బన్నీ, ర ష్మిక, దేవిశ్రీ, నిర్మాతలు ఎంతో సహకారాన్ని అందించారు. నా కోసం ‘ఊ అంటావా మావా..’ పాటని ఐదేళ్లుగా దాచిన చంద్రబోస్‌కు ప్రత్యేక ధన్యవాదాలు. ‘సిరివెన్నెల’గారు సినిమాల్లో సాహిత్యాన్ని నింపగలిగారు. ఆయన మరణించినప్పుడు.. ‘సిరివెన్నెలగారు బతికే ఉన్నారు... కానీ, పాటే ప్రాణం పోగొట్టుకుంది’ అని రాసుకున్నాను.
ఎక్కడ టాలెంట్ ఉన్నా గుర్తించి, వారికి అవార్డులతో ప్రోత్సాహం అందిస్తున్న సాక్షి సంస్థ ఆ పేరుకు నిదర్శనంగా నిలుస్తోంది. ప్రస్తుతం ఏ రంగంలోని వారికైనా సాక్షి అవార్డు వస్తే వారికి నిజమైన ప్రతిభ ఉందని గుర్తించవచ్చు. సమాజహితమైన వార్తలతో పాటు అవార్డులు అందించడం అద్భుతం.
– ఎస్వీ కృష్ణా రెడ్డి, సీనియర్ డైరెక్టర్
ఎనిమిదేళ్లుగా సినిమాలతో పాటు అన్ని రంగాల్లో ప్రతిభ ఉన్న వారికి అంకితభావంతో, దిగ్విజయంగా అవార్డులు అందిస్తున్న సాక్షి యాజమాన్యానికి థ్యాంక్స్. టాలెంట్ ఉన్నవారిని ప్రోత్సహించాలనే నిబద్ధతతో సాక్షి సంస్థ పనిచేస్తోంది. వార్తలతో పాటు మరింత మెరుగైన సమాజం కోసం, పర్యావరణ హితం కోసం పుడమి సాక్షిగా వంటి కార్యక్రమాలను, రైతుల కోసం మరిన్ని ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇలాంటి అద్భుతమైన కార్యక్రమాలు నిరంతరం కొనసాగాలి.
– అచ్చిరెడ్డి, సీనియర్ నిర్మాత
ఈ వేదికలో సాక్షి అవార్డు పొందడం రెండవ సారి. మా మొదటి మూవీకి కూడా ఇక్కడే అవార్డు అందుకున్నాం.
మా విజయంలో టీం కృషి మర్చిపోలేనిది.
– నవీన్ ఎర్నేని, నిర్మాత (పుష్ప)
గత కొంతకాలంగా మా అందరికీ సాక్షి సంస్థ అవార్డులతో ప్రోత్సాహం అందిస్తోంది. ఇలాంటి వేదికను ఏర్పాటు చేసినందుకు సాక్షికి ధన్యవాదాలు. ఈ అవార్డు సుకుమార్ వల్లే అందుకోగలిగాను. తనకు ఎన్ని సార్లు థ్యాంక్స్ చెప్పినా సరిపోదు. మైత్రీ మూవీస్ నిర్మాతలు, బన్నీ ప్రోత్సాహం మర్చిపోలేను. ‘పుష్ప 2’ మీరు ఊహించని రేంజ్‌లో ఉంటుంది. ఈ సందర్భంగా ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రిగారిని గుర్తు చేసుకోవాలి. ఆయనతో నాది కొడుకులాంటి అనుబంధం. సినిమా కోసం గొడవపడి అలిగేంత చనువు ఉండేది. ప్రతీ అక్షరంతో జనాల గుండెల్లోకి దూసుకుపోయేవారు ఆయన. ‘వర్షం, పౌర్ణమి’.. వంటి ఎన్నో మంచి సినిమాలు కలిసి చేశాం. ఆయన్ని చూసి జీవితాన్ని నేర్చుకున్నాను. ‘సిరివెన్నెల’ గారు మన మనస్సుల్లో ఎప్పటికీ నిలిచి ఉంటారు.
– దేవిశ్రీ ప్రసాద్, మోస్ట్ పాపులర్ సంగీత దర్శకుడు (పుష్ప)
సాక్షి ఎక్స్‌లెన్స్ పురస్కారానికి నన్ను అర్హున్ని చేసిన న్యాయనిర్ణేతలకు ధన్యవాదాలు. ఎప్పటికైనా ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వెలుగుతుంది, లోకాన్ని ఏలుతుందనే నమ్మకం ఉండేది. ఆ కోరిక ‘పుష్ప’ సినిమాతో నిజమైనందుకు ఆనందంగా ఉంది. ఇందులో దర్శకుడు సుకుమార్, సంగీతం అందించిన దేవీశ్రీ ప్రసాద్ కృషి ఎనలేనిది. ఈ ప్రయాణంలో నా కృషి అణువంత.. అదృష్టం ఆకాశమంత.
– చంద్రబోస్, మోస్ట్ పాపులర్ గీత రచయిత (పుష్ప)
అవార్డులు గుర్తింపుతో పాటు మరింత బాధ్యతను పెంచుతాయి. సాక్షిలాంటి సంస్థ ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేయడం చాలా సంతోషం. ఈ అవార్డు నా బాధ్యతను పెంచింది. ఈ అవార్డుల్లో భాగంగా జ్యూరీ విభాగంలో ఉన్నాను. ఇక్కడ ఎంపిక విధానం ఉన్నత ప్రమాణాలతో ఉంది. సాక్షి బృందానికి అభినందనలు.
– పుల్లెల గోపీచంద్, బ్యాడ్మింటన్ దిగ్గజం
ముందుగా ఈ అవార్డును మా మావయ్య చిరంజీవిగారికి అంకితం ఇవ్వాలనుకుంటున్నాను. ఎందుకంటే ఆయన లేకపోతే నేను లేను. ఆ తర్వాత మా అమ్మగారికి. అమ్మా... ఈ అవార్డు నీ కోసమే..!. ఈ ఏడాది బెస్ట్ డెబ్యూడెంట్ యాక్టర్‌గా నేను అవార్డు తీసుకోవడానికి ఓ కారణం అయిన దర్శకుడు బుచ్చిబాబుకు ధన్యవాదాలు. అలాగే ‘ఉప్పెన’ సినిమాలో నటించిన విజయ్ సేతుపతిగారికి, నిర్మాతలు నవీన్, రవి శంకర్‌గార్లకు, డీఓపీ శ్యామ్‌దత్‌కు, డైరెక్టర్ సుకుమార్, ఆయన భార్య తబితగార్లకు థ్యాంక్స్. ఈ అవార్డును నాకు ఇచ్చిన సాక్షికి ధన్యవాదాలు.
– వైష్ణవ్‌తేజ్, ఉత్తమ తొలి చిత్ర నటుడు (ఉప్పెన).
సాక్షి ఆధ్వర్యంలో మా చిత్రం ‘వైల్డ్ డాగ్’కు జ్యూరీ స్పెషల్ రికగ్నిషన్ అవార్డు అందుకోవడం సంతోషంగా ఉంది. ‘వైల్డ్ డాగ్’లో నటించిన నాగార్జున గారికి ధన్యవాదాలు.
– అన్వేష్‌రెడ్డి, నిర్మాత, జ్యూరీ స్పెషల్ రికగ్నిషన్ (వైల్డ్ డాగ్)
మా అక్క మంగ్లీ (‘లవ్‌స్టోరీ’లోని ‘సారంగదరియా’ పాట), నేను (‘పుష్ప’లోని ‘ఊ అంటావా...’ పాట) పోటీపడి, సరిసమానంగా నిలిచి, ఇద్దరం ఈసారి అవార్డు గెల్చుకోవడం ఆనందంగా ఉంది. మా అక్క రాలేకపోయింది. అవార్డిచ్చిన భారతమ్మకు ధన్యవాదాలు. సుకుమార్, దేవీశ్రీ, చంద్రబోస్‌గార్లకు థ్యాంక్స్.
– ఇంద్రావతి, మోస్ట్ పాపులర్ సింగర్ – ఫిమేల్ (పుష్ప)
సామాజిక సేవ, విద్య, పర్యావరణం.. వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నవారికి సాక్షి అవార్డు అందించడం అభినందనీయం. ఈ కార్యక్రమానికి ఎనిమిదేళ్లుగా భారతి సిమెంట్ తరపున సహకారం ఇస్తున్నాం.. ఇలాంటి మంచి కార్యక్రమాలకు మా తోడ్పాటు ఎల్లప్పుడూ ఉంటుంది.
– రవీందర్ రెడ్డి. డైరెక్టర్ మార్కెటింగ్, భారతి సిమెంట్స్.
అవార్డు చాలా బరువుగా ఉంది.. థ్యాంక్యూ సాక్షి. సుకుమార్‌సర్ లేకుంటే నేను లేను.
దర్శకుడిగా నాకంటూ ఏదొచ్చినా అది మీదే. ‘ఉప్పెన’ ఇంత బాగా రావడానికి కారకులైన నిర్మాతలు నవీన్, రవిగార్లకు థ్యాంక్స్. అలాగే విజయ్ సేతుపతి, వైష్ణవ్, కృతి, దేవిశ్రీలకు థ్యాంక్స్. టీమ్ అంతా కష్టపడితే ఈ అవార్డు నాకు ఇచ్చారు.
– బుచ్చిబాబు, ఉత్తమ తొలిచిత్ర దర్శకుడు(ఉప్పెన)
‘నాంది’ సినిమా తీసినందుకు మమ్మల్ని ప్రోత్సహిస్తూ ‘స్పెషల్ జ్యూరీ అవార్డ్’ రావడం సంతోషంగా ఉంది. అన్ని రంగాల్లోని ప్రతిభావంతులను ఎంపిక చేసి అవార్డులతో సత్కరించి, ప్రోత్సహించడం చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి అవార్డులు మాలాంటి యువ దర్శకులు, యువతకు మరింత ప్రోత్సాహాన్ని ఇస్తాయి. సాక్షి ఇచ్చిన ప్రోత్సాహంతో భవిష్యత్‌లో కూడా మరిన్ని మంచి సినిమాలు తీయడానికి ప్రయత్నిస్తాను.
– దర్శకుడు విజయ్ కనకమేడల, జ్యూరీ స్పెషల్ రికగ్నిషన్ (నాంది)
‘నాంది’ రిలీజ్ కాకముందే మా సినిమా.. విడుదల తర్వాత ప్రేక్షకుల చిత్రం. వారి సొంత సినిమాలా భావించి ఆదరించారు. ఈ వేదికపై మేం ఉండటానికి ప్రధాన కారణం ప్రేక్షకుల ఆదరణే. అందుకే ఈ అవార్డును ప్రేక్షకులకు అంకితం ఇస్తున్నాను. అవార్డుకు ఎంపిక చేసిన సాక్షి జ్యూరీకి ధన్యవాదాలు.
– సతీష్ వర్మ, నిర్మాత, జ్యూరీ స్పెషల్ రికగ్నిషన్ (నాంది)
గత ఏడాది నా వర్క్‌ను గుర్తించి నన్ను ఈ అవార్డుకు ఎంపిక చేసిన సాక్షికి ధన్యవాదాలు. నా తొలి చిత్రం ‘జాంబీరెడ్డి’కి విశేష ఆదరణ లభించండం హ్యాపీ. నాపై నమ్మకం ఉంచిన దర్శక– నిర్మాతలకు థ్యాంక్స్. అలాగే ఓ నటుడిగా నన్ను ప్రేక్షకులు ఆదరించారు. నేను ఎంపిక చేసుకున్న
కథలను ప్రేక్షకులు వారి ఆదరణ రూపంలో ప్రశంసించారు. ఇప్పుడు నా కష్టాన్ని కూడా గుర్తిస్తూ ఇలాంటి అవార్డులు రావడం నాకు కచ్చితంగా బోనస్‌లా అనిపిస్తోంది.
– తేజా సజ్జా, జ్యూరీ స్పెషల్ రికగ్నిషన్ (జాంబీ రెడ్డి)
ఈ అవార్డు ఇచ్చిన సాక్షికి థ్యాంక్స్. ఈ అవార్డును మన మధ్యలేని (ఇటీవల మరణించారు) ఈ సినిమా (సూపర్ ఓవర్)
దర్శకుడు ప్రవీణ్‌కు అంకితం ఇస్తున్నాను. అలాగే ఈ చిత్రానికి పని చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు.
– సుధీర్‌వర్మ, మోస్ట్ పాపులర్ ఓటీటీ ఫిల్మ్ (సూపర్ ఓవర్)
ఇది నా తొలి అవార్డు. నా జీవితాంతం గుర్తు పెట్టుకుంటాను. మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ అన్నకు ధన్యవాదాలు. ఆయన వల్లే ఇది సాధ్యమైంది. నేను ఈ అవార్డు అందుకోవడానికి ప్రత్యక్షంగా, పరోక్షంగా కారణమైన అందరికీ థ్యాంక్స్. అలాగే ‘పుష్ప’లాంటి అద్భుతమైన సినిమా తీసిన సుకుమార్‌గారికి, లిరిక్స్ రాసిన చంద్రబోస్‌గారికి ధన్యవాదాలు.
– శివమ్, మోస్ట్ పాపులర్ సింగర్ (మేల్) (పుష్ప–1).
కృష్ణవేణి లైఫ్ టైమ్ ఎఛివ్‌మెంట్ అవార్డ్
చిత్తజల్లు కృష్ణవేణి... పదేళ్ళ వయసులో సినిమా రంగానికి వచ్చారామె. ఇండియాలోనే తొలి బాలల చిత్రం ‘సతీ అనసూయ – ధ్రువ విజయం’లో అనసూయ పాత్రధారి ఆవిడే. బాల నటి నుంచి హీరోయిన్‌గా ఎదిగారు. గాయనిగా ప్రేక్షకులను పరవశింపజేశారు. శోభనాచల స్టూడియో అధినేత, దర్శక–నిర్మాత మీర్జాపురం రాజావారిని వరించారు. నిర్మాతగా మారారు.
స్టూడియో అధినేత అయ్యారు. పదేళ్ళ వయసులో వచ్చి... 1935 నుంచి ఇప్పటికీ 86 ఏళ్ళుగా తెలుగు సినీ రంగంలో ఉన్న సీనియర్ మోస్ట్... నటి, నిర్మాత... బహుముఖ ప్రజ్ఞాశాలి... సి.కృష్ణవేణి. ‘సతీ అనసూయ, తుకారామ్, కచ దేవయాని, భోజ–కాళిదాసు, జీవనజ్యోతి, దక్షయజ్ఞం, భీష్మ, ధర్మాంగద, మదాలస, గొల్లభామ, శ్రీలక్ష్మమ్మ, మన దేశం, పల్లెటూరి పిల్ల’... ఇలా తెలుగు టాకీల తొలినాళ్ళలో ఆమెకు నటిగా, స్టార్ హీరోయిన్‌గా పేరు తెచ్చిన చిత్రాలు అనేకం. అన్నమయ్య కీర్తన ‘జో అచ్యుతానంద జోజో ముకుంద...’ తెలుగు తెరపై తొలిసారిగా వినిపించింది కృష్ణవేణి గొంతులోనే.
స్వాతంత్య్ర సమరం నేపథ్యంలో తెలుగులో వచ్చిన తొలి చిత్రం ‘మనదేశం’. ఎల్వీ ప్రసాద్ దర్శకత్వంలో ఆ చిత్రాన్ని నిర్మించి, నటించడమే కాదు... ‘మనదేశం’తో ఎన్టీఆర్‌ను ప్రేక్షకులకు పరిచయం చేసిన ఘనత కృష్ణవేణిది. ఘంటసాల, రమేశ్ నాయుడులను మ్యూజిక్ డైరెక్టర్స్‌గా, పి.లీలను ప్లేబ్యాక్ సింగర్‌గా పరిచయం చేశారు. అక్కినేని నాగేశ్వరరావుతో ‘కీలుగుర్రం’ మొదలు పలు సినిమాలు నిర్మించారు. రాజ్‌కుమార్‌తో కన్నడలో ‘భక్త కుంభార’, శివాజీ గణేశన్ ద్విపాత్రాభినయంతో తెలుగు హిట్ ‘యమగోల’ రీమేక్ గా ‘యమనుక్కు యమన్’ చిత్రాలు నిర్మించారు. గతంలో వై.ఎస్.ఆర్. సారథ్యంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మక రఘుపతి వెంకయ్య అవార్డునిచ్చి సి.కృష్ణవేణిని గౌరవించింది. ఆమె కుమార్తె ఎన్.ఆర్.అనూరాధా దేవి సైతం ప్రసిద్ధ నిర్మాతే.
వందేళ్ళ వయస్సు దగ్గరపడుతున్న వేళ ఈ అవార్డుతో ఘనమైన కీర్తి అందించిన సాక్షి వారికి అభినందనలు. పదేళ్ల వయస్సులో ‘సతీ అనసూయ’ అనే సినిమాలో అనసూయ పాత్ర చేసే అవకాశాన్నిచ్చారు సి.పుల్లయ్య. ‘మనదేశం’ సినిమాని రామారావు కోసమే
తీసినట్టు అనిపిస్తోంది.
– సి. కృష్ణవేణి, తొలితరం నటి –గాయని
గిరిబాబు లైఫ్ టైమ్ ఎఛివ్‌మెంట్ అవార్డ్
అర్ధ శతాబ్ద కాలంగా తెలుగు సినీరంగంలో ఆయనది ఓ ప్రత్యేక స్థానం. హీరోగా, విలన్‌గా, కమెడియన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, నిర్మాతగా, దర్శకుడిగా... ఇలా వెండితెరపై బహుముఖ పాత్రధారి గిరిబాబు. చిన్నతనంలోనే నటనపై మక్కువతో నాటకాలతో మొదలుపెట్టి, మద్రాసులో సినిమా అవకాశాల కోసం పట్టుపట్టి, ఎన్టీఆర్, ఏయన్నార్ నుంచి చిరంజీవి, నాగార్జున దాకా మూడు తరాల అగ్ర హీరోలకు దీటుగా విలన్‌గా నటించిన ఖ్యాతి గిరిబాబుది. 1943 జూన్ 8న ప్రకాశం జిల్లా, రావినూతల గ్రామంలో మధ్యతరగతి రైతు కుటుంబంలో పుట్టిన యర్రా శేషగిరిరావు... ఇలా గిరిబాబుగా పేరు సంపాదించుకున్న తీరు నేటి తరానికి ఒక స్ఫూర్తి పాఠం. 1973లో ‘జగమే మాయ’తో గిరిబాబు సినీరంగ ప్రవేశం చేశారు. స్వీయ అభిరుచికి అనుగుణంగా చిత్రాలు తీయాలని జయభేరి సంస్థను స్థాపించారు.
తెలుగులో తొలి పూర్తి బ్లాక్ అండ్ వైట్ సినిమా స్కోప్ ‘దేవతలారా దీవించండి’తో 1977లో నిర్మాతగా మారి పది చిత్రాలు నిర్మించారు. అన్ని భాషల్లో కలిపి సుమారు 600లకు పైగా సినిమాల్లో విభిన్న పాత్రపోషణ చేశారు. సాంఘికం, చారిత్రకం, పౌరాణికం, జానపదం – ఇలా అన్ని తరహా చిత్రాల్లోనూ మెప్పించారు. ‘రణరంగం, ఇంద్రజిత్, నీ సుఖమే నే కోరుకున్నా’ చిత్రాలకు దర్శకత్వం వహించారు. గిరిబాబు చిన్న కుమారుడు బోసుబాబు కొన్ని చిత్రాల్లో హీరోగా నటించారు. పెద్ద కుమారుడు రఘుబాబు సైతం తండ్రి బాటలో పయనించి, నటుడిగా ఆల్ రౌండర్ అనిపించుకుంటున్నారు.
సినీరంగానికి సుదీర్ఘ కాలంగా గిరిబాబు అందించిన సేవలను గుర్తించి... ఆయన సినీజీవిత స్వర్ణోత్సవ వేళ...లైఫ్‌టైమ్ ఎఛివ్‌మెంట్ అవార్డుతో... సాదరంగా సత్కరించింది... సాక్షి మీడియా గ్రూప్.
సినిమా రంగంలో 50 ఏళ్ల అనుభవం ఉంది.. దాదాపు ఆరువందల సినిమాల్లో నటించాను. ఇంతకాలానికి జీవిత సాఫల్య పురస్కారం అవార్డు రావడం, ఈ అవార్డును సాక్షి సంస్థ అందించడం అమితమైన ఆనందాన్నిచ్చింది. ఇప్పటికీ సాక్షి పేపర్ చదవడం నాకు అలవాటు.
– గిరిబాబు, సీనియర్ నటులు.
సిరివెన్నెల సీతారామశాస్త్రి లైఫ్ టైమ్ ఎఛివ్‌మెంట్ అవార్డ్ (మరణానంతరం)
ఆయన పాట... చీకట్లో దారి చూపించే వెన్నెల. నిరాశలో వెన్నుతట్టి ముందుకు నడిపించే భరోసా. అన్యాయాన్ని ప్రశ్నించే గొంతుక. ఆ పాట యువతరాన్ని ఉర్రూతలూగించింది... జీవిత సత్యాన్ని విడమర్చి చెప్పింది... ప్రేమతత్వాన్ని బోధించింది. ఆ పాటల పూదోట ఎవరో కాదు... చేంబోలు సీతారామశాస్త్రి. తొలిసినిమా పేరే ఆయనకు ఇంటిపేరై, ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రిగా ప్రసిద్ధు లయ్యారు. కె.విశ్వనాథ్ ప్రోత్సాహంతో ‘జననీ జన్మభూమి’తో సినీ ప్రయాణం మొదలుపెట్టారు. ‘విధాత తలపున ప్రభవించినది...’ అంటూ తొలినాటి పాటతోనే సినీ సాహిత్య ప్రియుల గుండెల్లో సుస్థిర స్థానాన్ని పొంది, తొలి నంది అవార్డు సాధించారు. అక్కడి నుంచి సీతారామశాస్త్రి కలం
విశ్రమించలేదు. మూడున్నర దశాబ్దాలపైచిలుకు ప్రయాణంలో 800కు పైగా చిత్రాల్లో 3 వేలకు పైగా పాటలు రాశారు. ఉత్తమ గీత రచయితగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి 11 నంది అవార్డులు అందుకున్నారు సిరివెన్నెల. 2019లో భారత ప్రభుత్వం ‘పద్మశ్రీ’ పురస్కారంతో సత్కరించింది. ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన సిరివెన్నెల సీతారామశాస్త్రిని తెలుగు సినీ ప్రియులందరి తరఫున సగౌరవంగా స్మరిస్తూ, ఆ మరపురాని సాహితీమూర్తికి మరణానంతరం... సభక్తికంగా జీవిత సాఫల్య పురస్కారాన్ని అందించింది సాక్షి మీడియా గ్రూపు.
సాక్షి మీడియా వారు ఆయన్ను (‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి) అభిమానంతో గౌరవించినందుకు మా కుటుంబం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు.
– పద్మావతి (‘సిరివెన్నెల’ సతీమణి)
నాన్నగారిని ఎప్పటికీ ఎవరూ మర్చిపోలేరు. ఆయన మీద గౌరవంతో అవార్డు ఇచ్చిన భారతిగారికి, సాక్షి మీడియాకి ధన్యవాదాలు. ప్రస్తుతానికి ఇంత కన్నా నేను ఎక్కువ మాట్లాడలేను (భావోద్వేగంతో...)
– యోగేశ్వర్ (‘సిరివెన్నెల’ పెద్దబ్బాయి)
Comments
Please login to add a commentAdd a comment