‘జానకి కలగన లేదు
రాముడి సతి కాగలనని ఏనాడు’...
తెలుగు సినిమా పాటలో సీత ఉంది.
‘సీతే రాముడి కట్నం
ఆ సీతకు రాముడు దైవం’
తెలుగు సినిమా పాటలో రాముడు ఉన్నాడు.
‘కల్యాణ వైభోగమే
శ్రీ సీతారాముల కల్యాణమే’...
వెండి తెర ఆ ఇరువురి కల్యాణానికి పాట కట్టింది.
‘జానకి రాముల కల్యాణానికి
జగమే ఊయల లూగెనులే’ అంటూ
పరవశించింది.
సీతను, రాముణ్ణి ప్రస్తావిస్తూ తెలుగు పాట
కొనసాగుతూనే ఉంది.
సీతను రాముణ్ణి పోలికకై తేకుండా
కళ ఎలా మనగలుగుతుంది?
శ్రీరామనవమి సందర్భంగా
కొన్ని ‘సీతారాముల పాటలు’.
తెలుగువారికి పెళ్లి అంటే అది సీతారాముల పాటతోనే మొదలవ్వాలి. ఆ దివ్యజంట వివాహం ఎంత వైభోగంగా జరిగిందో అంత వైభోగంగా తమదీ జరగాలని లేదంటే ఆ జంట దివ్యాశీస్సు తమపైనా ఉండాలని కాంక్షించని వధూవరులు ఉండరు. అందుకే పచ్చని పందిరి కట్టగానే గతంలో గ్రామ్‌ఫోన్ రికార్డు మోగించేవారు. ‘శ్రీ సీతారాముల కల్యాణము చూతము రారండీ’... ఎన్.టి.ఆర్‌ది ఎంత గొప్పతనమో. తాను తీసే సినిమాలో రాముడిగా తాను ఉండగలిగినా ఉండకుండా, అంతమంచి పాటను తన కోసం రిజర్వ్ చేసుకోకుండా హరనాథ్, గీతాంజలిలపై చిత్రీకరణ చేశారు. ‘సీతారామ కల్యాణం’ సినిమా రెండోసారి చూడని వారు చాలామంది ఉంటారు. కాని వందసార్లయినా ఈ పాట వినని వారు ఉండరు.
రాముడు ఆది పురుషుడు హైందవ విశ్వాసాలలో. సీత మహాసాధ్వి. వీరి కథ వేల సంవత్సరాలుగా జనవాళికి తీపిని పంచుతూనే ఉంది. జంట అంటే సీతారాముల జంటే. ఆమె కోసం అతను విల్లు విరిచాడు. అతని కోసం ఆమె వనవాసానికి బయలుదేరింది. ఇరువురూ తమ వియోగానికి ఎంతగా అలమటించారో నేటికీ వారి భక్తులు ఆ సందర్భాన్ని వింటూ కంటూ అంతగా అలమటిస్తారు. వారికి సీతారాములు పటం కట్టినట్టు సదా పక్కపక్కనే ఉండాలి. కాంతులీనుతూ ఉండాలి. వారిని పాట కట్టుకుని తాము పరవశిస్తూ ఉండాలి. తాము ఏదైనా మొరపెట్టుకోవాలంటే సీతమ్మ ద్వారా ఆయనకు మొర పెట్టుకోవాలి. భక్త రామదాసు నుంచి నేటి భక్తుని వరకూ పాడేది అదే. ‘నను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి’... ఆ తల్లి చెబితే ఆయన వినకుండా ఉంటాడా? చిత్తూరు నాగయ్య గారి నుంచి నాగార్జున వరకు ఆ పాటతో సీతను వేడుకున్నవారిలో ఉన్నారు.
‘లవకుశ’లో సీతకూ రాముడికీ కలిపి పాటలు లేవు. కాని వారు నగర ప్రవేశం చేయనున్నారన్న వార్త వినగానే ప్రజలు సంభ్రమం చెందుతారు. ఆడిపాడుతారు. ‘విరిసే చల్లని వెన్నెల’ పాట ప్రేక్షకుల మదిలో పిండారబోస్తుంది. దర్శకుడు బాపు రామభక్తులు. ఆయన ‘సంపూర్ణ రామాయణం’, ‘సీతా కల్యాణం’ సినిమాలు తీశారు. ఆయన చివరి సినిమా ‘శ్రీరామరాజ్యం’ కావడం రాముడు ఆయనకు ఇచ్చిన కానుక అనుకోవచ్చు అభిమానులు. ‘శ్రీరామరాజ్యం’లో సీతాసమేతుడైన రాముడు అయోధ్యకు తిరిగి వస్తుండగా ఇళయరాజా చేసిన ‘జగదానంద కారకా’... పాట రామభక్తులకు కన్నులపండువ.
సోషల్ సినిమాలు వచ్చాక ఆధునిక హీరో హీరోయిన్లు తెర మీదకు వచ్చినా ఆ ఇరువురిని తలవకుండా లేరు. రెండు పెళ్లిచూపుల పాటలు సీతారాముల ప్రస్తావనతో హిట్ అయ్యాయి. ‘మగమహారాజు’లో ‘సీతే రాముడి కట్నం’ పాట వాణి జయరామ్ పాడగా నటి తులసి అభినయించారు. ‘అడవులనైనా అయోధ్యనైనా రామయ్యే సీతమ్మకు పేరంటం’ అనే లైను ఈ పాటలో ఎంతో లోతైనది. నిజమే కదా అనిపించేది. ఇక ‘సంసారం ఒక చదరంగం’లో కూడా ‘జానకి రాముల కల్యాణానికి జగమే ఊయలలూగెనులే’ పాట పెళ్లిచూపుల సందర్భంగా వస్తుంది. ఆ పాటను ఆ సినిమాలోని అన్నపూర్ణ, సుహాసిని, కల్పనల మీద విడివిడిగా చిత్రీకరించడం చిన్న సరదా.
ఇళయరాజా తెలుగువారికి మరో అందమైన సీతారాముల పాట ఇచ్చారు ‘రాజ్‌కుమార్’ సినిమా లో. శోభన్‌బాబు, జయసుధ నటించిన ఆ పాట ‘జానకి కలగన లేదు.. రాముడి సతి కాగలనని ఏనాడు’... ఈ పాటలో వేటూరి ‘తొలి చుక్కవు నీవే... చుక్కానివి నీవే’ అని రాస్తారు రాముడు సీతతో అన్నట్టు. రాముడికి సీత చుక్కాని కావడం ఒక మంచి భావన. ‘సాగర సంగమం’ తర్వాత వేటూరి కొన్నాళ్లు అలిగి కె.విశ్వనాథ్‌తో కలిసి పని చేయలేదు. ఆ సమయంలో విశ్వనాథ్ సినారె, సిరివెన్నెలలతో పాటలు రాయించారు. కాని ఎస్.పి. బాలు నిర్మాత కావడం వల్ల ‘శుభ సంకల్పం’లో పాట రాశారు. సీతారాముల తలంపు కావచ్చు. అందుకే ‘సీతమ్మ అందాలు రామయ్య గోత్రాలు’ వంటి అందమైన పాట పుట్టింది.
జంధ్యాల తీసిన ‘సీతారామ కల్యాణం’లో కెవి మహదేవన్ చేసిన ‘కల్యాణ వైభోగమే శ్రీసీతారాముల కల్యాణమే’... పాట కూడా పెద్ద హిట్ అయ్యింది. అందులో భద్రాద్రి కల్యాణం రియల్ ఫుటేజ్ వాడటం ఆ రోజుల్లో విశేషమనే చెప్పాలి.
ఆ తర్వాతి రోజుల్లో సిరివెన్నెల సీతారామశాస్త్రి తన వచ్చిన అవకాశాలలో సీతారాముల జంట ప్రస్తావనను సుందరంగా తెస్తూ వచ్చారు. ‘స్వయంకృషి’లో ‘సిగ్గూపూబంతి యిసిరే సీతామాలచ్చి’ మనోహరంగా ఉంటుంది. ‘రాముడి సిత్తంలో కాముడు చింతలు రేపంగా’ అని బహుశా మొదటిసారి రాముని శృంగార తలపులను జానపదుల శైలిలో ప్రస్తావనకు తెచ్చారాయన. ‘మురారి’లో ‘అలనాటి రామచంద్రుడికన్నింట సాటి’ పాట ‘శ్రీసీతారాముల కల్యాణం చూతము రారండి’కి సరిసాటిగా ఉండే ప్రయత్నం చేస్తుంది.
రాముడిని ఎల్లవేళలా తలిచేవారు ఉంటారు. కాని శ్రీరామ నవమి అంటే సీతారాములను కలిపి తలుస్తారు. ఆ జంట సుందర చరితను స్మరించుకుంటారు. వారి ప్రస్తావన ఉన్న పాటలు రేడియోల్లో మారుమోగుతాయి. రాముడి పాటలో తప్పక భక్తి ఉంటుంది. కాని సీతారాముల పాటలో బాంధవ్యం ఉంటుంది. స్త్రీ పురుషుల మధ్య ఉండాల్సింది బాంధవ్యమే అని ఈ సందర్భంగా వారి పాటలన్నీ మనకు చెబుతూ ఉంటాయి.
శ్రీరామ నవమి శుభాకాంక్షలు.
- సాక్షి ఫ్యామిలీ
సీతమ్మ అందాలూ రామయ్య గోత్రాలూ...
Published Wed, Apr 21 2021 12:21 AM | Last Updated on Wed, Apr 21 2021 12:15 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment