ముంబై: దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ స్నేహితుడు, బాలీవుడ్ నిర్మాత సందీప్ సింగ్ రిపబ్లిక్ టీవీ ఛానల్‌పై 200 కోట్ల రూపాయల పరువు నష్టం దావా వేశారు. ఈమేరకు రిపబ్లిక్ టీవీ కార్యాలయానికి, ఆ ఛానల్ ఎడిటర్ అర్నబ్ గోస్వామికి బుధవారం నాడు నోటీసులు పంపించారు. ఛానల్ టీఆర్పీ పెంచుకోవడం కోసం తన వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించేలా నిరాధార కథనాలను ప్రచారం చేశారని ఆయన నోటీసుల్లో పేర్కొన్నారు. సుశాంత్ కేసులో తనను కీలక సూత్రధారిగా, హంతకుడిగా పరిగణించారని మండిపడ్డారు. (చదవండి: సుశాంత్ కేసు : సీబీఐ ఎదుట యూటర్న్)
వెంటనే వారు తనకు లిఖితపూర్వకంగా లేదా వీడియో సందేశం ద్వారా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అలాగే నిజానిజాలు సైతం వెల్లడించాలని కోరారు. దాంతో పాటు తనపై తప్పుడు ఆరోపణలు చేసిన వార్తలను ఛానల్ నుంచి తొలగించాలని పేర్కొన్నారు. కాగా సుశాంత్ కేసు పాట్నా నుంచి సీబీఐ విచారణకు వెళ్లిన విషయం తెలిసిందే. ఈ కేసులో వెలుగు చూసిన డ్రగ్స్ కోణం బాలీవుడ్‌ను అతలాకుతలం చేస్తోంది. ఈ క్రమంలో పలు మీడియా సంస్థలు బాలీవుడ్‌ను చీల్చి చెండాడుతున్నాయి. ఈ నేపథ్యంలో వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగిస్తున్నారంటూ బాలీవుడ్ నిర్మాతలు.. రిపబ్లిక్ టీవీ, టైమ్స్ నౌ మీడియా సంస్థలపై పరువు నష్టం దావా వేసిన విషయం విదితమే. (చదవండి: మీడియా సంస్థలపై చర్యలు తీసుకోవాలని విఙ్ఞప్తి)
Comments
Please login to add a commentAdd a comment