శరణ్య ప్రదీప్ తెలంగాణ యువతి .. చిన్న చిన్న పాత్రలతోనే మంచి గుర్తింపు తెచ్చుకుని, తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్న ఆర్టిస్ట్. తెలంగాణ యాస మాట్లాడటంలో ఆమె కంటూ ఒక స్టైల్ ఉంది .. అందువలన పల్లె పాత్రలలో ఆమె ఇట్టే ఒదిగిపోతుంది. ఫిదా సినిమాతో శరణ్యకు మంచి గుర్తింపు దక్కింది. తాజాగా సుహాస్‌కు అక్కగా 'అంబాజీపేట మ్యారేజీ బ్యాండు'లో తన నటనతో విశ్వరూపాన్ని చూపింది. ఈ సినిమాలో సుహాస్‌ను పూర్తిగా శరణ్య ప్రదీప్ డామినేట్ చేసింది. నిజంగానే శరణ్య సినిమా మొత్తానికి ఆమెనే హీరోలా అనిపించేలా ప్రేక్షకులను మెప్పించింది. ఈ సినిమాలో విలన్ ఆమెను బట్టలు తొలగించి ఓ స్కూళ్లో బంధించి వెళ్లినప్పుడు గానీ… పోలీస్ స్టేషన్‌లో విలన్‌ను కాలితో తన్నిన సీన్‌లో గానీ శరణ్య విజృంభించేసింది.
శరణ్యతో పాటుగా అంబాజీపేట మ్యారేజీ బ్యాండు సినిమాలో పుష్ప ఫేమ్ జగదీశ్ కూడా నటించాడు. ఈ చిత్రంలో శరణ్యకు ప్రియుడి పాత్రలో ఆయన నటించిన విషయం తెలిసిందే. ఒక యువతిని ప్రైవేట్ ఫొటోలతో బ్లాక్ మెయిల్ చేసి ఆమె ఆత్మహత్యకి కారణం అయ్యాడనే ఆరోపణలతో జగదీశ్ జైలుకు వెళ్లి ఆపై బెయిల్‌పై వచ్చాడు. ఈ అంశం గురించి శరణ్య తాజాగా ఇలా రియాక్ట్ అయింది.
'జగదీస్ కేసులో ఏం జరిగిందో నాకు తెలియదు. అలాంటి సమయంలో మాట్లాడడం కరెక్ట్ కాదు. పుష్ప సినిమాతో పాన్ ఇండియా రేంజ్‌లో గుర్తింపు పొందిన జగదీశ్ ఇలాంటి కేసులో చిక్కుకోవడం బాధాకరం. అయితే మా సినిమా సెట్‌లో మాత్రం జగదీశ్ అందరితో చాలా బాగా ఉండేవాడు. నాతో పాటు అందరినీ కూడా చాలా గౌరవంగా పలకరించేవాడు. నాకు తెలిసినంత వరకు అతడి క్యారెక్టర్‌లో ఎలాంటి తేడా లేదు. కానీ ఆయన కేసు విషయంలో ఏం జరిగిందో మనం చూడలేదు కాబట్టి దాని గురించి ఎలాంటి వ్యాఖ్యలు చేయడం సబబు కాదు.' అని శరణ్య పేర్కొంది.
అంబాజీపేట మ్యారేజీ బ్యాండు సినిమాలో ఆమెను వివస్త్రను చేసిన సీన్ గురించి ఆమె ఇప్పటికే పంచుకుంది. తన భర్త సపోర్ట్ ద్వారా మాత్రమే ఆ సీన్ చేయగలిగానని చెప్పింది. కానీ కొంతమంది యూట్యూబ్ వారు తప్పుడు థంబ్‌నైల్స్ పెట్టి మరో రకంగా ప్రచారం చేస్తున్నారని తెలిపింది. సినిమాలో ఎం లేకపోయినా కూడా ఎదో ఉంది అనేలా క్రియేట్ చేసి వీడియోలు పోస్ట్ చేశారు. దీంతో చాలా వీడియోలకు స్ట్రైక్స్ కొట్టినా ఉపయోగం లేదని శరణ్య వాపోయింది. వాస్తవంగా ఆ సీన్‌లో ఎలాంటి అసభ్యత లేదు. ఆ సీన్‌లో నటించాలంటే గట్స్ ఉండాలి. కానీ శరణ్య ఎంతో ధైర్యంగా ఒప్పుకుని ఆ సీన్‌లో మెప్పించింది. దీంతో తన సినీ కెరియర్‌లో మరో పది మెట్లు ఎక్కేలా చేసింది. ఏదేమైనా సరైన కథ,దర్శకుడి చేతిలో శరణ్య పడితే మరోసారి తన నటనతో దుమ్మురేపడం ఖాయం అని చెప్పవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment