
సాక్షి, సింహాచలం(పెందుర్తి): ఇటీవల విడుదలైన సర్కారు వారి పాట సినిమాలో సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామిని ఉద్దేశించి విలన్‌తో పలికించిన ఒక డైలాగ్ భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా ఉంటే క్షమించాలని ఆ సినిమా దర్శకుడు పరశురామ్ తెలిపారు. సర్కారు వారి పాట సినిమా విజయవంతం కావడంతో శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామిని శుక్రవారం ఆయన దర్శించుకున్నారు.
(చదవండి: అభిమానిని తలుచుకొని ఎమోషనల్ అయిన సూపర్‌స్టార్ కృష్ణ)
ఈ సందర్భంగా సినిమాలోని ఒక డైలాగ్ విమర్శలకు తావివ్వడంపై మీడియా ప్రతినిధులు, కొందరు భక్తులు పరశురామ్ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై ఆయన మాట్లాడుతూ అది ఉద్దేశపూర్వకంగా చేసింది కాదని, ఆ విషయంలో భక్తుల మనోభావాలు దెబ్బతిని ఉంటే మనస్పూర్తిగా క్షమాపణలు అడుగుతున్నానని తెలిపారు.
శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి అంటే తనకు ఎంతో భక్తి అని, వీలైనప్పుడల్లా స్వామిని దర్శించుకుంటానని అన్నారు. సర్కారు వారి పాట సినిమా ప్రారంభ సమయంలోనూ స్వామిని దర్శించుకున్నానన్నారు. సినిమాకు విజయం చేకూర్చిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు చెబుతున్నానని తెలిపారు. నాగచైతన్యతో త్వరలో సినిమా తీస్తున్నట్టు చెప్పారు. దర్శనార్థం వచ్చిన పరశురామ్ ఆలయంలోని కప్పస్తంభాన్ని ఆలింగనం చేసుకున్నారు. ఆయన పేరిట అర్చకులు స్వామికి పూజలు చేశారు. వేద ఆశీర్వచనం అందజేశారు. ఆలయ సంప్రదాయం ప్రకారం టెంపుల్ ఇన్‌స్పెక్టర్ కనకరాజు స్వామి వారి ప్రసాదాన్ని అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment