సావిత్రి, మహేశ్, షన్ను
పులివెందుల మహేశ్ హీరోగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘స్కూల్ లైఫ్’. సావిత్రి, షన్ను హీరోయిన్లుగా నటించారు. సుమన్, ఆమని, మురళీధర్ గౌడ్ కీలక పాత్రలుపోషించారు. గంగాభవాని నిర్మించిన ఈ సినిమా బాలల దినోత్సవం సందర్భంగా ఈ నెల 14న విడుదల కానుంది. హైదరాబాద్‌లో నిర్వహించిన ‘స్కూల్ లైఫ్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో సుమన్ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాలో నేనుపోషించిన రైతు పాత్ర నా మనసుకు దగ్గరగా అనిపించింది.
రైతులకు అండగా నిలబడేలా నా పాత్ర ఉంటుంది. ఈ సినిమా షూటింగ్ కోసం పులివెందుల వెళ్లినప్పుడు అక్కడి ప్రజలు ఎంతగానో అభిమానం చూపించారు’’ అని తెలిపారు. పులివెందుల మహేశ్ మాట్లాడుతూ– ‘‘ఓ సినిమాలో కథే హీరో. బడ్జెట్ కాదు... క్రౌడ్ ఫండింగ్‌తో ఈ చిత్రం తీశాం. మా సినిమా టికెట్ వంద రూపాయలు మాత్రమే ఉంటుంది’’ అని చెప్పారు. ‘‘ఈ చిత్రంలో మాకు చాన్స్ ఇచ్చిన మహేశ్‌గారికి ధన్యవాదాలు’’ అని షన్ను, సావిత్రి పేర్కొన్నారు.


