![Shriya Saran Says That She Has Not Seen The RRR Movie - Sakshi](/styles/webp/s3/article_images/2022/03/31/Shriya-Saran.jpg.webp?itok=si4mujXH)
‘రాజమౌళి సినిమా అనగానే కథ వినకుండానే ఓకే చెప్పాను. ఆర్‌ఆర్‌ఆర్‌లో ఇద్దరు స్టార్ హీరోలు ఉన్నారని తెలుసు కానీ.. వాళ్లు రామ్ చరణ్, ఎన్టీఆర్ అని షూటింగ్ స్టార్ట్ అయ్యేవరకు నాకు తెలియదు’అని అన్నారు హీరోయిన్ శ్రియ. ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన పాన్ ఇండియా చిత్రం ఆర్‌ఆర్‌ఆర్. ఇందులో అజయ్ దేవగణ్ సతీమణి సరోజినీ పాత్రలో శ్రియ నటించారు. మార్చి 25న విడుదలైన ఈ చిత్రం.. విజయవంతంగా దూసుకెళ్తూ.. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షాన్ని కురిపిస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా శ్రియ ‘ఆర్‌ఆర్‌ఆర్’ విజయంపై స్పందించారు. ఆర్‌ఆర్‌ఆర్ విజయం పట్ల తాను చాలా సంతోషంగా ఉందన్నారు. ఓ గొప్ప చిత్రంలో మంచి పాత్ర ఇచ్చినందుకు రాజమౌళికి థ్యాక్స్ చెప్పారు.
ఇక సినిమా చూశారా అన్ని అడగ్గా.. ‘నేను ఇంకా ఆర్‌ఆర్‌ఆర్ మూవీ చూడలేదు. సినిమా విడుదలైన సమయంలో నేను ముంబైలో ఉన్నాను. అక్కడ టిక్కెట్లు దొరకలేదు. ప్రతి థియేటర్స్‌లో హౌస్‌ఫుల్ బోర్డులే కనిపించాయి. షూటింగ్ కోసం ఇప్పుడు బెంగళూరు వచ్చాను. ఇక్కడ కూడా టిక్కెట్లు దొరకడం లేదు. కనీసం వచ్చే వారమైనా టిక్కెట్లు దొరుకుతాయేమో చూడాలి’ అని శ్రియ చెప్పుకొచ్చారు.
ఇక జక్కన్న గురించి చెబుతూ.. ‘ఛత్రపతి మూవీతో తొలిసారి రాజమౌళితో కలిసి పనిచేసే అవకాశం వచ్చింది. నా కెరీర్‌లో సూపర్ హిట్ చిత్రమది. ఆ తర్వాత రాజమౌళితో కలిసి మళ్లీ పనిచేయాలని ఎన్నో ఏళ్లుగా ఎదురుచూశాను. తాజాగా ఆర్‌ఆర్‌ఆర్‌లో అవకాశం వచ్చింది. మంచి పాత్ర పోషించే అవకాశం వచ్చింది. మళ్లీ రాజమౌళి టీమ్‌తో పనిచేసే అవకాశం వస్తే.. తప్పకుండా ఆయన సినిమాలో భాగం అవుతాను’ అని శ్రియ అన్నారు. ప్రస్తుతం ఈ బ్యూటీ కబ్జా, మ్యూజిక్ స్కూల్ అనే పాన్ ఇండియా చిత్రాలతో పాటు, అజయ్ దేవ్‌గణ్ ‘దృశ్యం 2’లో నటిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment