Singer Mangli Clarify Issues On Bonalu Song 2021 - Sakshi
Sakshi News home page

Mangli Bonalu Song: నా జాతి, కులం అంటూ నిందలు.. మంగ్లీ ఎమోషనల్‌

Published Wed, Jul 21 2021 1:22 PM | Last Updated on Wed, Jul 21 2021 3:17 PM

Singer Mangli Clarify Issues On Bonalu Song 2021 - Sakshi

'చెట్టు కింద కూసున్నవమ్మ' పాట యూట్యూబ్‌లో మార్మోగిపోతున్న విషయం తెలిసిందే. అయితే అదే స్థాయిలో విమర్శలు కూడా వస్తున్నాయి. అమ్మవారిని మోతెవరి అంటూ సంబోధించడంతో కొందరు నెటిజన్లు సింగర్‌ మంగ్లీ మీద భగ్గుమన్నారు. బోనాల పాటలో అభ్యంతరకర పదాలు వాడారంటూ ఏకంగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ పాటపై మంగ్లీ వివరణ ఇచ్చింది. ప్రఖ్యాత జానపద పాటల రచయిత, గాయకులు పాలమూరి రామస్వామిగారు 25 ఏళ్ల క్రితమే ఈ పాట రాశారని తెలిపింది. గ్రామదేవతలను ఎలా పూజిస్తారో తెలుసుకుంటే మంచిదని హితవు పలికింది. ఈ మేరకు సోషల్‌ మీడియాలో సుదీర్ఘ పోస్ట్‌ పెట్టింది.

"రచయిత రామస్వామిగారి అభిప్రాయం ప్రకారం.. 'చెట్టుకింద కూసున్నవమ్మ' పాటలో మోతెవరి అంటే గ్రామంలో పెద్ద అనే అర్థంలో సాగుతుంది. ప్రస్తుతం ఆ పదం వ్యతిరేక పదంగా వాడుకలోకి వచ్చిందన్నది వాదన, నిందాస్తుతిలో కోలాటం రూపంలో సాగే ఈ పాటను మాకు తెలిసిన కొంతమంది కళాకారులు, పెద్దల సలహాలు తీసుకుని చిత్రీకరించాం. గ్రామదేవతల ఒగ్గు కథలు, బైండ్లోల్ల కొలువులు ఇలా రకరకాల ఆచారాలున్నాయి. భక్తిలో కూడా మూఢ భక్తి, వైరి భక్తి అని రకరకాలుగా ఉన్నాయి. అందులో భాగంగానే ఈ పాటను రూపొందించాం.

నేను పండితుల కుటుంబం నుంచి రాలేదు. చెట్లు పుట్టలను కొలిచే గిరిజన జాతికి చెందిన తండా నుంచి వచ్చిన ఆడబిడ్డను. బతుకమ్మ, బోనాలు పండగల్లాగే మా బంజారాలో తీజ్‌, శీతలా(సాతి భవాని) పండగల్లో ప్రకృతినే దేవతలుగా పూజిస్తాము. మాకు కష్టం కలిగినా సంతోషం వచ్చినా మేము చెప్పుకునేది నమ్ముకునేది గ్రామదేవతలకే. వారిని మా ఇంట్లో సభ్యులుగా నమ్ముతాము. మేము తినేదే, తాగేదే ఆ దేవతలకు నైవేద్యంగా పెడతాము. నేను సింగర్‌గా అంతో ఇంతో ఎదిగింది కూడా అమ్మవారి కృప, ఆంజనేయ స్వామి దీవెన, మీ అభిమానం, ఆదరణ వల్లే అని నమ్ముతాను. అందుకే నేను పుట్టిన తండాలో మా తాతలనాటి ఆంజనేయ స్వామి విగ్రహానికి గుడి కట్టించి పూజలు చేస్తున్నాము.

ఏనాడూ గుడికి వెళ్లనివాళ్లు, బోనం ఎత్తని వాళ్లు కూడా నా జాతి, ప్రాంతం, కులం అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇది ఎంతవరకు సమంజసమో గమనించాలి. గత నాలుగేళ్లుగా ప్రతి ఏటా లాల్‌ దర్వాజ అమ్మవారికి బోనం ఎత్తుతున్నాను. గత ఆరు సంవత్సరాలుగా బతుకమ్మ, సమ్మక్క సారక్క, శివరాత్రి, సంక్రాంతి, బోనాలు.. ఏ పండగ వచ్చినా నేను పాటలు చేస్తున్నాను. ఈసారికి శివరాత్రి పాట అత్యంత పవిత్ర స్థలం కాశీకి వెళ్లి మరీ చిత్రీకరించాము. ప్రతి పండగలో నా పాటల ద్వారా మీ ఇంటి భాగస్వామినయ్యాను. మీ ఇంట్లో ఓ ఆడబిడ్డగా కడుపులో పెట్టుకున్నారు. ఇందుకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. నేను ఒక్కరోజులో ఫేమస్‌ కాలేదు. నా పాటల వెనక పదేళ్ల కష్టం ఉంది. కానీ కొందరు తమ ఇంట్లో తల్లి, చెల్లి ఉందన్న విషయం మరిచి విచక్షణ కోల్పోయి కామెంట్లు చేస్తున్నారు. ఈ పాట నేపథ్యం తెలుసుకోకుండా నిందిస్తున్నారు.

గ్రామదేవతలను ఎలా కొలుస్తారు? మైసమ్మ కొలువు పాటలు, నిందాస్తుతి సాహిత్యం గురించి తెలుసుకుని విమర్శలు చేస్తే విజ్ఞతగా ఉండేది. ఈ పోస్టు నా మనసుకు బాధ కలిగించినవారి కోసం, నన్ను అభిమానించేవారి మనసుకు కష్టం కలిగించిన వారి కోసం. ఈ పాటపై విమర్శలు వచ్చిన రోజే పాట మార్చే అవకాశం ఉన్నప్పటికీ పాట కోసం ప్రాణం పెట్టిన వృద్ధ రచయిత రామస్వామి గారిని తక్కువ చేయొద్దనే ఉద్దేశ్యంతో ఈ నిర్ణయం తీసుకోలేకపోయాను. కానీ దీన్ని మరింత వివాదం చేసి ఆయన్ను కూడా కించపరుస్తున్నారని, ఆ పెద్దాయన కుటుంబ సభ్యుల అనుమతితో లిరిక్స్‌లో మార్పులు చేశాం. నన్ను వ్యతిరేకించినవారు, నిందించినవారు అందరూ నా వాళ్లే అనుకుని ఈ నిర్ణయం తీసుకున్నాను" అని మంగ్లీ చెప్పుకొచ్చింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement