
Sirivennela Sitaramasastry: అక్షరయోధుడు సిరివెన్నెల సీతారామశాస్త్రి అంత్యక్రియలు ముగిశాయి.హైదరాబాద్‌లోని మహాప్రస్థానంలో ఆశ్రునయనాల మధ్య అంతిమ సంస్కారాలను పూర‍్తి చేశారు. ఫిల్మ్ ఛాంబర్ నుంచి ప్రారంభమైన సిరివెన్నెల అంతియాత్ర మహాప్రస్థానం వరకు కొనసాగింది. అంతిమయాత్రలో పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు. సిరివెన్నెలను కడసారి చూసేందుకు పెద్ద ఎత్తున అభిమానులు తరలివచ్చారు. సిరివెన్నెల ఇక మనమధ్య లేరని తెలిసి కన్నీటి పర్యంతం అయ్యారు.
కాగా తీవ్రమైన న్యుమోనియాతో బాధపడుతూ నవంబర్ 24న సిరివెన్నెల సీతారామశాస్త్రి సికింద్రాబాద్‌లోని కిమ్స్ ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. చికిత్స పొందుతూ మంగళవారం సాయంత్రం 4.07 గంటలకు తుదిశ్వాస విడిచారు. తొలి సినిమా పేరునే తన ఇంటిపేరుగా మార్చుకున్నసిరివెన్నెల పూర్తి పేరు చేంబోలు సీతారామశాస్త్రి. విశాఖ జిల్లా అనకాపల్లిలో1955 మే 20న జన్మించిన ఆయన సిరివెన్నెల సినిమాతో పాటల ప్రస్థానాన్ని ప్రారంభించారు.
అలా ఇప్పటివరకు మూడువేలకు పైగా పాటలు రాశారు. గేయరచయితగా తన సుదీర్ఘ సినీ ప్రస్థానంలో 2020 వరకు 3000 పాటలకు పైగా సాహిత్యం అందించారు. పదకొండు నంది అవార్డులు అందుకున్నారు. నాలుగు ఫిల్మ్‌ఫేర్ అవార్డులను సాధించారు. ఈ రంగంలో ఆయన కేసిన కృషికి గాను 2019లో పద్మశ్రీ పురస్కారం లభించింది.