Top 5 Tollywood Actors Six Pack Bodies Of Upcoming Movies In 2022 - Sakshi
Sakshi News home page

Six Pack Tollywood Actors: చొక్కా లేకుండా కనిపించడమే ఇప్పటి ప్యాషన్‌!

Published Sat, Jan 8 2022 5:04 AM | Last Updated on Sat, Jan 8 2022 11:01 AM

Six pack heroes in Tollywood - Sakshi

చోలీ కే పీచే క్యా హై అంటే... చోలీ మే దిల్‌ హై మేరా అన్నారు మాధురీ దీక్షిత్‌. ‘ఖల్‌ నాయక్‌’లోని ఈ పాట చాలామంది దిల్‌ని కొల్లగొట్టింది. ఇప్పుడు... ‘చొక్కా కే పీచే క్యా హై’ అని మన హీరోలను అడిగితే... చొక్కా మే ప్యాక్‌ హై మేరా అంటారేమో. కథ డిమాండ్‌ చేస్తే ఆరు పలకలు.. ఎనిమిది పలకల దేహంతో ఫ్యాన్స్‌ దిల్‌ని ఖుషీ చేయడానికి రెడీ అయ్యారు హీరోలు. షర్ట్‌లెస్‌గా కనిపించనున్నారు.. రండి... సిక్స్‌ ప్యాక్‌ చూద్దాం.

ఫైట్‌ సీన్స్‌ని ఇష్టపడే ప్రేక్షకుల శాతం ఎక్కువే ఉంటుంది. అందుకే హీరోలు కూడా డిఫరెంట్‌ యాక్షన్‌ సీన్స్‌ చేస్తుంటారు. వీటికోసం ప్రత్యేకంగా మేకోవర్‌ అవుతారు. కొందరు హీరోలు అవసరమైతే సిక్స్‌ ప్యాక్‌ చేస్తారు. చొక్కా విప్పి, ఆ ప్యాక్‌ని చూపిస్తారు. ఒక సినిమాలో కనిపించి, మరో సినిమాలో కూడా షర్ట్‌లెస్‌గా కనిపించాలంటే ‘సై’ అంటారు. ‘టెంపర్‌’ చిత్రంలో షర్ట్‌లెస్‌గా సిక్స్‌ ప్యాక్‌తో కనిపించిన ఎన్టీఆర్‌ ఇప్పుడు ‘రౌద్రం.. రణం.. రుధిరం’లో షర్ట్‌లెస్‌గా కనిపించిన దృశ్యాలు ఈ చిత్రం ట్రైలర్‌లో కనిపించాయి.

ఇక ఇదే చిత్రంలో మరో హీరోగా చేసిన రామ్‌చరణ్‌ ‘ధృవ’లో షర్ట్‌లెస్‌గా కనిపించారు. ఇప్పుడు ‘రౌద్రం.. రణం.. రుధిరం’లోనూ అలా కనిపించనున్నారు. రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం శుక్రవారం (జనవరి 7న) విడుదల కావాల్సింది. కరోనా ఎఫెక్ట్‌తో వాయిదా పడింది. ఇక ‘అర్జున్‌రెడ్డి’లో కొన్ని సీన్స్‌లో చొక్కా లేకుండా కనిపించారు విజయ్‌ దేవరకొండ. ఇప్పుడు ‘లైగర్‌’ కోసం బాక్సర్‌గా సిక్స్‌ప్యాక్‌తో రెడీ అయ్యారు.

ఇటీవల విడుదలైన ‘లైగర్‌’ గ్లింప్స్‌ వీడియోలో విజయ్‌ షర్ట్‌లెస్‌గా కనిపించిన విషయం గుర్తుండే ఉంటుంది. పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ఆగస్టు 25న విడుదల కానుంది. అయితే కరోనా కారణంగా ‘లైగర్‌’ షూటింగ్‌ తాత్కాలికంగా ఆగిపోయినట్లు విజయ్‌ దేవరకొండ పేర్కొన్నారు. ఇప్పటివరకు లవర్‌బాయ్‌లా కనిపించిన అఖిల్‌ ‘ఏజెంట్‌’ చిత్రం కోసం ఒక్కసారిగా మాస్‌ లుక్‌లోకి మారిపోయారు.

సురేందర్‌ రెడ్డి తెరకెక్కిస్తున్న ఈ చిత్రం కోసం దాదాపు ఏడాది కష్టపడి అఖిల్‌ మేకోవర్‌ అయ్యారు. ఇందులో అఖిల్‌ సిక్స్‌ప్యాక్‌ లుక్‌లో కనిపిస్తారు. ఇక హీరోగా పరిచయమైన తొలి చిత్రం ‘ఆర్‌ఎక్స్‌100’లోనే సిక్స్‌ప్యాక్‌ బాడీతో కనిపించారు కార్తికేయ. ఆ చిత్రం తర్వాత కూడా కొన్ని చిత్రాల్లో షర్ట్‌లెస్‌గా కనిపించారు. తాజాగా అజిత్‌ హీరోగా చేసిన యాక్షన్‌ ఫిల్మ్‌ ‘వలిమై’లో కార్తికేయ విలన్‌గా నటించిన విషయం తెలిసిందే.

ఈ చిత్రంలో కార్తికేయ ఓ ఫైట్‌లో సిక్స్‌ప్యాక్‌లో కనిపిస్తారు. ఈ సినిమా కోసం బాడీ బిల్డింగ్‌ చేస్తున్నట్లుగా కార్తికేయ సోషల్‌ మీడియాలో చొక్కా లేకుండా షేర్‌ చేసిన ఫొటో ఆ విషయాన్ని స్పష్టం చేస్తోంది. ఈ హీరోలే కాదు.. మరికొందరు కూడా షర్ట్‌లెస్‌కి సై అంటున్నారు.

మళ్లీ అలా కనిపిస్తారా డ్యూడ్‌...
సిక్స్‌ ప్లస్‌ కటౌట్‌ ఉన్న ప్రభాస్‌ సిక్స్‌ ప్యాక్‌లో కనిపిస్తే.. ‘వావ్‌ డ్యూడ్‌’ అంటారు. ‘మిర్చి’ లో ప్రభాస్‌ కటౌట్‌ మీద ‘కటౌట్‌ చూసి కొన్ని కొన్ని నమ్మేయాలి డ్యూడ్‌’ అనే డైలాగ్‌ కూడా ఉందిగా. ‘బాహుబలి’లో తన కటౌట్‌ని చూపించారు ప్రభాస్‌. మరోసారి చొక్కా లేకుండా కనిపించే అవకాశం ఉంది. తాజా చిత్రం ‘ఆదిపురుష్‌’లో రాముడి పాత్ర చేస్తున్నారు ప్రభాస్‌. రాముడంటే చొక్కా లేకుండా కనబడతారు కదా.. సో.. మరోసారి ప్రభాస్‌ కటౌట్‌ని చూడొచ్చన్న మాట. ఓం రౌత్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ చిత్రాన్ని ఈ ఏడాది ఆగస్ట్‌ 11న విడుదల చేయాలనుకుంటున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement